ఆరోపణలు చేయడం.. పారిపోవడం!
ABN , Publish Date - Feb 13 , 2026 | 04:19 AM
శాసన మండలిలో గురువారం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడిచింది. పరిశ్రమలకు భూముల కేటాయింపులు, పింఛన్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలపై సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది.
యువతకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతోనే కంపెనీలకు భూముల కేటాయింపులు
ఇందులో లాలూచీ ఏమీ లేదు: మంత్రి లోకేశ్
ఆరోపణలు నిరూపించాలని వైసీపీకి సవాల్
మండలిలో అధికార, విపక్షాల మాటల యుద్ధం
అమరావతి, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): శాసన మండలిలో గురువారం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడిచింది. పరిశ్రమలకు భూముల కేటాయింపులు, పింఛన్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలపై సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. మంత్రులు, విపక్ష సభ్యుల సవాళ్లు, ప్రతి సవాళ్లతో మండలి హోరెత్తింది. తొలుత 99 పైసలకే భూ కేటాయింపుల అంశంపై వాడీవేడీ చర్చ జరిగింది. ఎకరా 99 పైసలకే ఏ పరిశ్రమకు, ఎంతెంత భూమి కేటాయించారు? పరిశ్రమలతో ప్రభుత్వ ఒప్పందాలు ఏంటని వైసీపీ సభ్యులు మాధవరావు, కళ్యాణి, రవీంద్రబాబు ప్రశ్నించారు. మంత్రి లోకేశ్ సమాధానం చెప్తూ.. యువతకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో టీసీఎస్, కాగ్నిజెంట్, ఏఎన్‌ఎ్‌సఆర్ గ్లోబల్, రహేజా, మదర్సన్ ఇంటర్నేషనల్ కంపెనీలకే ఎకరా 99 పైసలకు భూములు కేటాయించామని, దీని వల్ల ఐటీ రంగంలో 65 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని, ప్రత్యక్షంగా, పరోక్షంగా 4-5 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. విశ్వసనీయత ఉన్న కంపెనీలకే భూములిచ్చామని, ఇందులో లాలూచీ ఏమీ లేదని స్పష్టం చేశారు. ‘నన్ను విమర్శించాలనుకుంటే విమర్శించండి.. కప్పు కాఫీ, టీ తప్ప ఆయా కంపెనీల నుంచి నేనేమైనా తీసుకుంటే నిరూపించండి. విశ్వసనీయత లేని కంపెనీలకు తక్కువ ధరకు భూములిచ్చామని నిరూపిస్తే ఏ చర్యకైనా సిద్ధం’ అని సవాల్ చేశారు.
పక్క రాష్ట్రాలతో పోటీ పడాలి
పక్క రాష్ట్రాలతో పోటీ పడాల్సిన అవసరం ఉంది కాబట్టే.. తక్కువ ధరకు భూములిచ్చామని లోకేశ్ స్పష్టం చేశారు. ఏపీఐఐసీని కాదని రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములెందుకు ఇస్తున్నారని విపక్ష నేత బొత్స ప్రశ్నించగా, టాటా నానో ఫ్యాక్టరీని బెంగాల్‌లో తరిమేయడంతో నాటి గుజరాత్ సీఎంగా ఉన్న మోదీ 99 పైసలకే భూమి ఇస్తామని తమ రాష్ట్రానికి తీసుకెళ్లారని, దీంతో అక్కడ ఎకో సిస్టమ్ ఏర్పడిందన్నారు. ఇప్పుడు విశాఖనూ ఐటీ కేంద్రంగా మారుస్తున్నామన్నారు. భూ కేటాయింపుపై వైసీపీ పిల్ వేయించగా, కోర్టు మొట్టికాయలు వేసిన విషయాన్ని లోకేశ్ గుర్తుచేశారు.
బొత్సకు ఇదో ఫ్యాషన్..
మంత్రి అచ్చెన్నాయుడు కల్పించుకొని.. మంచి కంపెనీలకే తక్కువ ధరకు భూములిస్తున్నామని, తమ కుటుంబసభ్యులకు ఇవ్వట్లేదని వ్యాఖ్యానించారు. భూకేటాయింపులపై వాదోపవాదాల నేపథ్యంలో వైసీపీ సభ్యులు మండలి నుంచి వాకౌట్ చేశారు. మంత్రి లోకేశ్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. వైసీపీ సభ్యులు ఎందుకు వాకౌట్ చేశారో అర్థం కావడం లేదన్నారు. ‘బొత్సకు ఇదో ఫ్యాషన్. ఆ తలుపు నుంచి వస్తారు. ఈ తలుపు నుంచి వెళ్తారు’ అని అన్నారు. మా ప్రభుత్వ లక్ష్యం కోసం ఎక్కడా లాలూచీ పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కియ పరిశ్రమ రాకతో ఆ ప్రాంతం మారిందన్నారు. క్లస్టర్ విధానంతో ముందుకు వెళ్తున్నామని, ముందుకొచ్చిన ప్రతి పరిశ్రమ గ్రౌండింగ్ చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు.
‘టీం 11’పై చర్చిద్దామా?
విశాఖలో అడ్రస్ లేని ఉర్సా కంపెనీకీ 99
పైసలకే భూమి ఇస్తారా? అని వైసీపీ సభ్యులు ప్రశ్నించారు. దీనిపై లోకేష్ దీటుగా స్పందించారు. 5 కంపెనీలకే భూములు ఇచ్చామని, ఆరో కంపెనీ పేరు ప్రస్తావిస్తున్నందున, ఆధారాలు చూపాలని సవాల్ చేశారు. ఉర్సా కంపెనీకి భూమి కేటాయించలేదని స్పష్టం చేశారు. అయినా వైసీపీ సభ్యులు కేకలు పెడుతుండటంతో.. ‘లెక్కల్లోకి వెళ్తే.. 151 కాస్తా.. 11 అయ్యాయి. దీనిపైనా చర్చిద్దామా?’ అని అన్నారు. ఏపీకి పరిశ్రమలు రాకూడదని, పరిశ్రమల్ని తరిమేయాలని వైసీపీ లక్ష్యంగా పెట్టుకుందని మండిపడ్డారు.
ఎవరి పింఛనూ తీసేయలేదు
కూటమి ప్రభుత్వం భారీగా పింఛన్లు తొలగించిందని, కొత్త పింఛన్లు ఇవ్వలేదని వైసీపీ ఎమ్మెల్సీలు ఆరోపించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ వైసీపీ హయాంలో 10 లక్షల పింఛన్లు తొలగించారని, అనర్హులకు అక్రమంగా పింఛన్లు ఇచ్చారని విమర్శించారు. తమ 20 నెలల పాలనలో ఎవరి పింఛనూ తీసేయలేదని స్పష్టం చేశారు. దివ్యాంగుల సర్టిఫికెట్ల రీవెరికేషన్ చేసి, పింఛన్ కొనసాగిస్తున్నామన్నారు. కొత్తగా 2.50 లక్షల స్పౌజ్ పింఛన్లు ఇచ్చామన్నారు. 2019-24 మధ్య పింఛన్లకు రూ.91 వేల కోట్లు ఖర్చు చేయగా, తమ ప్రభుత్వం 20 నెలల్లో రూ.55 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు.మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ.. గతంలో టీడీపీ ప్రభుత్వం 54.10 లక్షల పింఛన్లు ఇస్తే, వైసీపీ ప్రభుత్వం పార్టీ ముద్ర వేసి, లక్షల పింఛన్లు నిలిపివేసిందన్నారు.
బొత్స వర్సెస్ మంత్రి పార్థసారథి
‘తల్లికి వందనం’ కింద ఎంత మంది పిల్లలున్నా ఏటా ఒకొక్కరికి రూ.15 వేలు వేస్తామని మోసం చేశారని, 15 శాతం మందికి రూ.7-8 వేలు మించి పడలేదని బొత్స ఆరోపించారు. నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని మంత్రి పార్థసారథి సవాల్ చేశారు. 48 లక్షల మందికి ‘అన్నదాత సుఖీభవ’ లబ్ధి చేకూరితే.. ఏ రైతుకూ రూ.20 వేలు పడలేదనడం సరికాదన్నారు. సాంకేతిక కారణంతో ఎక్కడో కొద్ది మందికి అలా జరిగి ఉండొచ్చని, అలాంటి వారి వివరాలు ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వంలో ‘అమ్మ ఒడి’ని ఇద్దరికీ ఇస్తామని మాట తప్పారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఎంత మంది పిల్లలుంటే అంత మందికి రూ.15 వేలు, అన్నదాత సుఖీభవ కింద రైతులకు రూ.20 వేలు ఇస్తున్నామని చెప్పారు. మరోవైపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరు మాత్రమే మార్చినట్లు వైసీపీ సభ్యులు తప్పుగా చెప్తున్నారని, యాక్ట్‌ను పూర్తిగా రద్దు చేశామని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు.
ఉయ్యాలవాడ, బుడ్డాను గౌరవించేలా: దుర్గేశ్
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బుడ్డా వెంగళరెడ్డి స్మారక మ్యూజియాల ఏర్పాటుపై టీడీపీ సభ్యులు రాంగోపాల్‌రెడ్డి, బీటీ నాయుడు, బీద రవిచంద్ర వేసిన ప్రశ్నకు పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ సమాధానం చెప్పారు. స్వాతంత్య్ర సమరంలో వీరోచితంగా పోరాడిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, కరువు సమయంలో పేద ప్రజలకు యావదాస్తి దానం చేసిన బుడ్డా వెంగళరెడ్డి పేరిట స్మారకాల ఏర్పాటుపై పరిశీలిస్తామని చెప్పారు. వారిద్దరి జయంతి, వర్ధంతిలను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని చెప్పారు.
వారు లోక్‌భవన్‌కు ఎందుకు వెళ్తారో?: టీడీపీ
గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తెలిపే తీర్మానాన్ని మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ ప్రతిపాదించారు. తీర్మానాన్ని బలపరుస్తూ టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని గవర్నర్ ప్రసంగంలో స్పష్టం చేశారని, గవర్నర్ ప్రసంగాన్ని వినలేని వారు వారోనికోసారి లోక్‌భవన్‌కు ఎందుకు వెళ్తున్నారో చెప్పాలన్నారు.
ప్రభుత్వం సరైన సమాధానం చెప్పలేదు: బొత్స
అసెంబ్లీ బయట బొత్స మీడియాతో మాట్లాడుతూ.. 99 పైసలకు ఇష్టారాజ్యంగా భూములు ఇవ్వడంపై ప్రశ్నించామని, ప్రభుత్వం సరైన సమాధానం చెప్పలేదన్నారు. అందుకే వాకౌట్ చేశామని పేర్కొన్నారు. స్వయానా సీఎం కుటుంబసభ్యులు రూ.5 వేల కోట్ల విలువైన భూములు సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
సవాల్ చేస్తే.. పారిపోయారు!
విశాఖలో రూ.కోట్ల విలువైన భూముల్ని రియల్ ఎస్టేట్, ప్రైవేట్ సంస్థలకు ఎలా కేటాయిస్తారని వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. మంత్రి లోకేశ్ స్పందిస్తూ.. ‘ఎస్‌ఐపీబీ, మంత్రివర్గ ఉపసంఘం, కేబినెట్ తీర్మానంతోనే భూములు కేటాయించాం. వేరే కంపెనీలకు 99 పైసలకే భూములిచ్చామని నిరూపిస్తే, రాజీనామా చేస్తానని గతంలో సవాల్ చేస్తే.. మీరంతా (వైసీపీ సభ్యులను ఉద్దేశించి) పారిపోయారన్నారు.