Share News

ఖాళీ స్థలాలపై పన్ను రాయితీ

ABN , Publish Date - Feb 19 , 2026 | 04:33 AM

రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ఊతమిచ్చేలా ఖాళీల స్థలాల పన్ను(వీఎల్‌టీ)పై ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.

ఖాళీ స్థలాలపై పన్ను రాయితీ

  • నిర్మాణం పూర్తయ్యేవరకూ 50శాతం చెల్లిస్తే చాలు.. సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

  • పురపాలక చట్టాల సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

అమరావతి, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ఊతమిచ్చేలా ఖాళీల స్థలాల పన్ను(వీఎల్‌టీ)పై ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. నిర్మాణాలకు ముందు ఖాళీ స్థలాలపై విధించే పన్నులో 50శాతం రాయితీ ఇవ్వనుంది. ఈమేరకు పురపాలక చట్టాల సవరణ బిల్లుకు బుధవారం శాసనసభ ఆమోదం తెలిపింది. పురపాలక మంత్రి పి.నారాయణ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం నిర్మాణాలకు ముందు ఖాళీ స్థలాలపై వంద శాతం పన్ను విధించే విధానం ఉందని, ఇకపై నిర్మాణ అనుమతులు పొందిన నాటి నుంచి నిర్మాణం పూర్తయ్యేవరకూ 50శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుందన్నారు. ఈ బిల్లుపై రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హర్షం వ్యక్తంచేశారు. ఈ నిర్ణయం రియల్‌ఎస్టేట్‌ రంగానికి జీవం పోస్తుందన్నారు. తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ.. ఈ బిల్లుతో పట్టణీకరణ శరవేగంగా వ్యాప్తి చెందుతుందన్నారు. అయితే నిర్మాణం పేరుతో సుదీర్ఘకాలం రాయితీ పొందాలనుకునే వారికి అడ్డుకట్ట వేయాలన్నారు. నిర్మాణానికి కాలపరిమితి నిర్ణయించాలన్నారు. నిర్మాణం మధ్యలో నిలిచిపోతే రాయితీ రికవరీ చేయాలన్నారు. యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్‌ మాట్లాడుతూ ఈ పన్ను రాయితీ పేద, మధ్య తరగతి వర్గాలకు కూడా మేలు చేకూరుస్తుందన్నారు. అయితే అనుమతులు లేని లేఅవుట్లపై చర్యలు చేపట్టాలన్నారు.


విద్యుత్‌ సుంకం జీవోలు సభ ఆమోదం పొందాలి

ఏపీ విద్యుత్‌ డ్యూటీ చట్టంపై తీసుకొచ్చిన సవరణ బిల్లును మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ శాసనసభలో ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది. విద్యుత్‌ చట్టం-2003 ప్రకారం వినియోగదారుల కేటగిరీలను చట్టంలో చేర్చామని, వాలిడేషన్‌ సెక్షన్‌ను కొత్తగా జత చేశామని మంత్రి వివరించారు. అలాగే ఇకపై విద్యుత్‌ సుంకం చట్టం కింద ప్రభుత్వం జారీచేసే ఏ జీవో అయినా ఉభయసభల ఆమోదం పొందాల్సి ఉంటుందని తెలిపారు.

చట్టాల నుంచి ‘కుష్ఠు వ్యాధి’ తొలగింపు

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పలు చట్టాల నుంచి ‘కుష్ఠు వ్యాధి’ అనే పదాన్ని తొలగిస్తూ చేసిన సవరణ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. మున్సిపల్‌ చట్టాలు, దేవదాయ చట్టం, శ్రీవెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం నిబంధనల నుంచి ఈ పదాన్ని తొలగిస్తూ ఆయా శాఖల మంత్రులు పి.నారాయణ, ఆనం రాంనారాయణరెడ్డి ప్రవేశపెట్టిన బిల్లులను సభ ఆమోదించింది.

Updated Date - Feb 19 , 2026 | 04:33 AM