ఇక జడ్పీలకు ఒక్కరే ఉపాధ్యక్షుడు
ABN , Publish Date - Aug 21 , 2026 | 04:18 AM
జిల్లా పరిషత్, మండల పరిషత్‌లలో ఇకపై ఒక్కరే ఉపాధ్యక్షుడు ఉంటారు. ఇద్దరు ఉపాధ్యక్షుల స్థానంలో ఒక్కరినే వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకునేలా ప్రభుత్వం..
మండల పరిషత్‌లకు కూడా..
సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణ బిల్లుకూ..
అమరావతి, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): జిల్లా పరిషత్, మండల పరిషత్‌లలో ఇకపై ఒక్కరే ఉపాధ్యక్షుడు ఉంటారు. ఇద్దరు ఉపాధ్యక్షుల స్థానంలో ఒక్కరినే వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకునేలా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్ట రెండో సవరణ బిల్లుకు అసెంబ్లీ గురువారం ఆమోదం తెలిపింది. దీనిప్రకారం.. ప్రతి జిల్లా పరిషత్‌కు, మండల పరిషత్‌కు ఒక్కో చైర్‌పర్సన్‌ను, వైస్ చైర్‌పర్సన్‌ను ఎన్నుకోవడం తప్పనిసరి. 2021లో అప్పటి వైసీపీ ప్రభుత్వం రెండు పరిషత్‌లకు ఇద్దరేసి ఉపాధ్యక్షులను ఎన్నుకునేలా చట్టానికి సవరణ చేసింది. దీంతో గత స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఇద్దరు చొప్పున వైస్‌చైర్మన్లను ఎన్నుకున్నారు. ఈ పద్ధతి వల్ల పరిపాలనాపరంగా ఎలాంటి ప్రయోజనమూ లేదని భావించిన ప్రస్తుత కూటమి ప్రభుత్వం జిల్లా, మండల పరిషత్‌లలో రెండో వైస్ ప్రెసిడెంట్ పదవి నిబంధనను ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పవన్‌కల్యాణ్ తరఫున మంత్రి నాదెండ్ల మనోహర్ శాసనసభలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్ట రెండో సవరణ బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై జరిగిన చర్చలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. జిల్లా, మండల పరిషత్‌లలో రెండో వైస్‌ప్రెసిడెంట్ పదవులు అలంకారప్రాయంగామారాయన్నారు. బిల్లుపై స్పీకర్ ఓటింగ్ నిర్వహించగా.. సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.
కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణ
ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణ చట్ట సవరణ బిల్లు-2026 కు కూడా అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరించేందుకు ప్రతిపాదించిన ఈ బిల్లును ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గురువారం ప్రవేశపెట్టారు. చర్చ లేకుండానే సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. బిల్లు సభ ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రకటించారు.