Share News

ఆక్వా రైతులందరికీ విద్యుత్‌ రాయితీ: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Jun 10 , 2026 | 04:16 AM

కష్టకాలంలో ఉన్న ఆక్వా రైతులను ఆదుకునేందుకు.. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది.

ఆక్వా రైతులందరికీ విద్యుత్‌ రాయితీ: సీఎం చంద్రబాబు

  • ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు!

  • ప్రభుత్వంపై రూ.1,100 కోట్ల భారం

  • జగన్‌ హయాంలో ఈ సబ్సిడీకి తిలోదకాలు

  • ఆక్వా, నాన్‌ ఆక్వాగా విభజన

  • నాన్‌ ఆక్వాజోన్‌లో యూనిట్‌ ధర 3.85

  • 30 వేల కరెంటు బిల్లు 80-90 వేలకు చేరిన వైనం

  • సీఎం తాజా నిర్ణయంతో రైతులకు ఉపశమనం

కైకలూరు, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): కష్టకాలంలో ఉన్న ఆక్వా రైతులను ఆదుకునేందుకు.. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి వస్తే ఆక్వా రంగానికి జోన్‌తో నిమిత్తం లేకుండా యూనిట్‌ విద్యుత్‌ రూ.1.50కే అందిస్తామన్న హామీ అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదముద్ర వేశారు. రైతులందరికీ దీనిని అమలు చేస్తారు. ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీకానున్నాయి. దీనివల్ల ప్రభుత్వంపై రూ.1100 కోట్ల భారం పడనుంది. రాష్ట్ర విభజన అనంతరం టీడీపీ ప్రభుత్వం ఆక్వా రైతులను ఆదుకునేందుకు యూనిట్‌ విద్యుత్‌ను రూ.1.50కే అందించింది. తర్వాత వచ్చిన జగన్‌ ప్రభుత్వం దీనిని తుంగలో తొక్కింది. ఆక్వా, నాన్‌ ఆక్వా జోన్‌లుగా విడదీసి పది ఎకరాలలోపు ఉన్న రైతులకు మాత్రమే సబ్సిడీ వర్తించేలా చేసింది. నాన్‌ ఆక్వా జోన్‌లో ఉన్న రైతులు యూనిట్‌కు రూ.3.85 చెల్లించాల్సి వచ్చేది. రూ.30 వేలు వచ్చే కరెంటు బిల్లు.. రూ.80-.90 వేలకు చేరింది. ఉచితంగా ఇచ్చే విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లను సైతం గత ప్రభుత్వం ఎత్తివేసింది. తాజాగా అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఇప్పటికే అనేక రకాలుగా ఆక్వా రంగం ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది. ఓ వైపు మేతల ధరలు పెరగడం, మరోవైపు నాణ్యమైన సీడ్‌ దొరక్కపోవడం.. కౌంటు దశకు చేరుకున్న రొయ్యల ధరల పతనం ..ఇలాంటి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల విజయవాడలో వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, ఫిషరీస్‌ కమిషనర్‌ రాంశంకర్‌ నాయక్‌, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌.. రైతు సంఘాలు, రైతులు, మేతల కంపెనీల యజమానులతో సమావేశం నిర్వహించారు.


సబ్సిడీపై యూనిట్‌ విద్యుత్‌ రూ.1.50కు ఇచ్చేందుకు ప్రభుత్వం ఈ సందర్భంగా ఆమోదం తెలిపింది. ఆక్వా, నాన్‌ ఆక్వా జోన్‌ పరిధి లేకుండా ఆక్వా రంగం మొత్తాన్నీ ఆక్వా జోన్‌లోకి తీసుకుని 12 వేల అదనపు కనెక్షన్లకు కూడా రూ.1.50కే యూనిట్‌ విద్యుత్‌ను అందించాలని నిర్ణయించారు. రెండ్రోజుల క్రితమే సీఎం చంద్రబాబు ఆమోదముద్ర వేశారు. దీనిపై రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. 2 లక్షల మంది రైతులకు రూ.కోట్లలో ఖర్చు తగ్గుతుందని అంటున్నారు. ఇప్పటికే నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు గ్రామాల్లో ప్రభుత్వం నూతన విద్యుత్‌ సబ్‌స్టేషన్లను నిర్మిస్తున్నారు. అవి పూర్తయితే మరింత నాణ్యమైన విద్యుత్‌ సరఫరాకు వీలవుతుంది. కైకలూరు మండలం గోపవరంలో 220/33 కేవీ సబ్‌స్టేషన్‌ను రూ.32 కోట్లతో నిర్మిస్తున్నారు. మరో నెల రోజుల్లో పనులు పూర్తయి విద్యుత్‌ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.


విద్యుత్‌ సబ్సిడీ రైతులకు సంజీవని..

యూనిట్‌ రూ.1.50కే ఆక్వారంగానికి సబ్సిడీపై విద్యుత్‌ అందించడం రైతులకు ఎంతో మేలు చేస్తుంది. సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతుల పాలిట సంజీవనిలా పనిచేస్తుంది. మేతలు, రొయ్యల ధరల నియంత్రణ దిశగానూ ప్రయతాలు జరుగుతున్నాయి. త్వరగా రైతులకు మేలు జరిగేలా నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాం.

- నంబూరి వెంకటరామరాజు,

రాష్ట్ర చేపల రైతుల సంఘం అధ్యక్షుడు.

Updated Date - Jun 10 , 2026 | 05:57 AM