గ్రామాల్లో 70 అన్న క్యాంటీన్లకు 181 కోట్లు
ABN , Publish Date - Aug 08 , 2026 | 04:55 AM
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న 70 అన్న క్యాంటీన్ల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల కాలానికి రూ.181.91 కోట్ల పరిపాలనా అనుమతి మంజూరు చేసింది.
హెచ్‌కేఎం చారిటబుల్ ఫౌండేషన్‌కు బాధ్యత
అమరావతి, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న 70 అన్న క్యాంటీన్ల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల కాలానికి రూ.181.91 కోట్ల పరిపాలనా అనుమతి మంజూరు చేసింది. ఆ మేరకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వం ఇప్పటికే రెండో దశలో 70 అన్న క్యాంటీన్లను ఏర్పాటుచేసి పేదలకు రాయితీ ధరలకు భోజనం అందించాలని నిర్ణయించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఒప్పందాన్ని విస్తరించే అవకాశం లేకపోవడంతో కొత్త టెండర్లు పిలిచారు. టెండర్ ప్రక్రియలో హెచ్‌కేఎం చారిటబుల్ ఫౌండేషన్ సాంకేతికంగా అర్హత సాధించగా, మూడేళ్లపాటు గ్రామీణ అన్న క్యాంటీన్లలో భోజన సరఫరా బాధ్యతలను అప్పగించారు. ప్రభుత్వం పలు షరతులను విధించింది. ‘సీఎ్‌సఆర్ నిధులను, దాతల విరాళాలను సరైన విధంగా లెక్కల్లో చూపించి ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గించాలి. భోజన సబ్సిడీ బిల్లులను రియల్‌టైం బయోమెట్రిక్ డేటా ఆధారంగానే చెల్లించాలి. ప్రతి ఏడాది స్వతంత్ర సంస్థతో ఆర్థిక, నాణ్యతా ఆడిట్ నిర్వహించాలి’ అని ప్రభుత్వం స్పష్టం చేసింది.