Share News

1543 కోట్లతో ‘పుష్కర’ దారులు

ABN , Publish Date - Jun 14 , 2026 | 04:38 AM

త్వరలో జరిగే గోదావరి పుష్కరాల కోసం ఉమ్మడి గోదావరి జిల్లాల పరిధిలో 1581 కిలోమీటర్ల మేర రహదారులను యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని రోడ్లు భవనాల శాఖ నిర్ణయించింది.

1543 కోట్లతో ‘పుష్కర’ దారులు

  • గోదావరి జిల్లాల్లో 1581 కి.మీ రోడ్ల అభివృద్ధి

  • ఇప్పటికే 800 కిలోమీటర్ల పనులకు అనుమతి

  • వేగంగా పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బీ నిర్ణయం

అమరావతి, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): త్వరలో జరిగే గోదావరి పుష్కరాల కోసం ఉమ్మడి గోదావరి జిల్లాల పరిధిలో 1581 కిలోమీటర్ల మేర రహదారులను యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని రోడ్లు భవనాల శాఖ నిర్ణయించింది. ఇందుకోసం రూ.1543 కోట్లు ఖర్చు అవుతుందని భావిస్తోంది. ఇప్పటికే 800 కిలోమీటర్ల రోడ్ల పనులకు అనుమతులు ఇచ్చింది. తొలుత రూ.400 కోట్లు, రెండో దఫా రూ.600 కోట్లు ఇచ్చేందుకు ఆర్థిక శాఖ కూడా సూత్రప్రాయంగా ఆమోదించించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పుష్కరాలు జరిగే ప్రాంతాల్లో రహదారి పనులను వేగంగా చేపట్టాలని జిల్లాల సూపరింటెండెంట్‌ ఇంజనీర్లను ఆర్‌అండ్‌బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు ఆదేశించారు. కొన్ని చోట్ల పనులు ఇప్పటికే ప్రారంభం కాగా, మరికొన్ని చోట్ల ప్రతిపాదన దశల్లో ఉన్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధి రాజమండ్రి, పోలవరం ఏరియాలో 223 కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కాకినాడ పరిధిలో 45 కి.మీ, అమలాపురం పరిధిలో 470 కి.మీ మేర వర్క్‌లు చేపడుతున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పరిధిలో 352 కి.మీ, కొవ్వూరు ప్రాంతంలో 232 కి.మీ, బీమవరం డివిజన్‌లో 254 కి.మీ రహదారులను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆర్‌అండ్‌బీలో ఉన్న ఇతర వనరులు, నిఽధులను ఉపయోగించి పుష్కరాలు జరిగే ప్రాంతాల్లోని రహదారులను అత్యవసరంగా అభివృద్ధి చేయాలని అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. ఈ వర్క్‌ల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కొంత మేర నిధులు కోరాలని నిర్ణయించారు.

Updated Date - Jun 14 , 2026 | 04:39 AM