Share News

పట్టణ వ్యర్థాలతో గ్యాస్‌ ఉత్పత్తి

ABN , Publish Date - Mar 22 , 2026 | 03:52 AM

పట్టణ వ్యర్థాల నిర్వహణలో స్థిరత్వం సాధించడంతో పాటు శుభ్ర ఇంధన ఉత్పత్తిని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

పట్టణ వ్యర్థాలతో గ్యాస్‌ ఉత్పత్తి

  • 59.85 కోట్లతో 5 సీబీజీ ప్లాంట్ల ఏర్పాటు

  • రాజమహేంద్రవరం, నెల్లూరు, గుంటూరు, ఒంగోలు ప్రాంతాల్లో కొత్తగా స్థాపన

  • విజయవాడలో అప్‌గ్రేడ్‌.. ప్రభుత్వం ఆమోదం

అమరావతి, మార్చి 21(ఆంధ్రజ్యోతి): పట్టణ వ్యర్థాల నిర్వహణలో స్థిరత్వం సాధించడంతో పాటు శుభ్ర ఇంధన ఉత్పత్తిని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల్లో 5 కంప్రెస్సుడ్‌ బయో గ్యాస్‌ (సీబీజీ) ప్లాంట్ల ఏర్పాటు కోసం రూ.59.85 కోట్లకు పరిపాలనా ఆమోదం మంజూరు చేసింది. రోజుకు మొత్తంగా 125 టన్నుల సామర్థ్యంతో మున్సిపల్‌ ఘన వ్యర్థాల ఆధారిత బయో ఎనర్జీ ప్రాజెక్టులను అమలు చేయనుంది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీచేసింది. రాజమహేంద్రవరం, నెల్లూరు, గుంటూరు, ఒంగోలు ప్రాంతాల్లో కొత్తగా ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయనుండగా.. విజయవాడలో ఇప్పటికే ఉన్న ప్లాంట్‌ను పునరుద్ధరించి, అప్‌గ్రేడ్‌ చేయనున్నారు. ప్రతి సీబీజీ ప్లాంట్‌ సామర్థ్యం రోజుకు 25 టన్నులు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం సవరించిన అంచనాల ప్రకారం 100 టీపీడీ (టన్స్‌ పర్‌ డే) ప్లాంట్‌ ఖర్చు రూ.32 కోట్లు, 25 టీపీడీ ప్లాంట్‌ ఖర్చు రూ.12.60 కోట్లు, విజయవాడ ప్లాంట్‌ అప్‌గ్రేడ్‌ వ్యయం రూ.9.45 కోట్లుగా ఉంది. ఈ ప్రాజెక్టులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పట్టణ స్థానిక సంస్థలతో పాటు ప్రైవేట్‌ డెవలపర్లు కలిసి నిధులు సమకూర్చనున్నారు. ప్రైవేట్‌ డెవలపర్లు 36 శాతం పెట్టుబడి పెట్టి, 20 ఏళ్ల పాటు ప్లాంట్‌ నిర్వహిస్తే సీబీజీ అమ్మకం ద్వారా ఆదాయం పొందనున్నారు. ఈ ప్రాజెక్టులకు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరించనుంది. సీఎ్‌సఐఆర్‌-ఐఐసీటీ హైదరాబాద్‌ సాంకేతిక మార్గదర్శకత్వం అందిస్తుంది. పట్టణ స్థానిక సంస్థలు ప్లాంట్ల కోసం భూమి, రోడ్లు, నీరు, విద్యుత్‌ సదుపాయాలు కల్పించాలి. ఈ ప్రాజెక్టులు స్వచ్ఛ భారత్‌ మిషన్‌ లక్ష్యాల సాధనలో కీలకంగా నిలవడంతో పాటు పట్టణ వ్యర్థాల్ని వనరులుగా మలచడంలో ఆదర్శంగా నిలుస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.

Updated Date - Mar 22 , 2026 | 03:53 AM