విమానాశ్రయాల్లో బార్లు, మద్యం షాపులు
ABN , Publish Date - Jun 28 , 2026 | 06:27 AM
ఇతర రాష్ర్టాల తరహాలో రాష్ట్రంలోని విమానాశ్రయాల్లో బార్లు, మద్యం షాపుల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించింది.
కొత్త పాలసీ అమల్లోకి.. 24 గంటల అమ్మకాలకు అనుమతి
అమరావతి, జూన్ 27(ఆంధ్రజ్యోతి): ఇతర రాష్ర్టాల తరహాలో రాష్ట్రంలోని విమానాశ్రయాల్లో బార్లు, మద్యం షాపుల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించింది. ఈమేరకు కొత్త పాలసీని తీసుకొస్తూ ఎక్సైజ్ శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. విమానాశ్రయాల్లోని టెర్మినల్ భవనం, ప్లాజాల్లో వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్ సిఫారసు చేసిన వారికి ఎక్సైజ్ శాఖ లైసెన్స్‌లు మంజూరు చేస్తుంది. బార్‌కు డిప్యూటీ కమిషనర్, షాపునకు ఎక్సైజ్ సూపరింటిండెంట్‌కు దరఖాస్తు చేసుకోవాలి. బార్లు, షాపులు 24 గంటలూ తెరిచి ఉంచొచ్చు. దరఖాస్తు ఫీజు రూ.5లక్షలు చెల్లించాలి. ఏడాదికి 20లక్షల కంటే ఎక్కువ మంది ప్రయాణించే విమానాశ్రయాల్లో రూ.25లక్షలు, అంత కంటే తక్కువ మంది ప్రయాణించే విమానాశ్రయాల్లో రూ.15లక్షలు ఏడాదికి రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్‌ను బార్ కోసం చెల్లించాలి. షాపులకు ఏడాదికి రూ.ఒక కోటి చొప్పున ఫీజు చెల్లించాలి. మూడేళ్లకోసారి ప్రయాణికుల సంఖ్య ఆధారంగా పాలసీని సమీక్షిస్తారు.