ఆదర్శంగా ఏపీ అంగన్వాడీలు
ABN , Publish Date - Mar 10 , 2026 | 04:12 AM
ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీ కేంద్రాలకు 100 శాతం తాగునీరు అందించడం, పార్వతీపురం మన్యం లో మలేరియా నియంత్రణ వంటివి ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని నీతి ఆయోగ్ అడిషనల్ సెక్రటరీ రోహిత్‌కుమార్ కొనియాడారు.
మన్యంలో మలేరియా నియంత్రణ భేష్
దేశ గ్రామీణ అభివృద్ధిలో ఏడీపీ విప్లవాత్మక మార్పులు తెచ్చింది
నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి రోహిత్‌కుమార్
విశాఖలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు
సాగర్‌నగర్ (విశాఖపట్నం), మార్చి 9(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీ కేంద్రాలకు 100 శాతం తాగునీరు అందించడం, పార్వతీపురం మన్యం లో మలేరియా నియంత్రణ వంటివి ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని నీతి ఆయోగ్ అడిషనల్ సెక్రటరీ రోహిత్‌కుమార్ కొనియాడారు. సోమవారం విశాఖపట్నంలో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సును ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో ప్రారంభమైన ఆస్పిరేషనల్ డిస్ర్టిక్ట్స్ ప్రోగ్రామ్ (ఏడీపీ) దేశ గ్రామీణాభివృద్ధిలో విప్లవాత్మక మార్పులు తెచ్చిందన్నారు. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో నిర్ణీత లక్ష్యాలను సాధించడమే పథకం ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ఏపీ ప్లానింగ్ శాఖ జాయింట్ సెక్రటరీ అనంతశంకర్ మాట్లాడుతూ జీరో పేదరికం దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. 2025లో నిర్వహించిన సంపూర్ణ అభియాన్‌లో కడప జిల్లా దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవడం గర్వకారణమని పేర్కొన్నారు. గిరిజన విద్యార్థుల కోసం చేపట్టిన నిర్మాణ్ కార్యక్రమంపై అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ నివేదిక సమర్పించారు. కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్.. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం స్మార్ట్ కిచెన్ విధానాలను, కర్నూలు జిల్లా కలెక్టర్ ఎ.సిరి ఉల్లిసాగు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లోని ఉత్తమ పద్ధతులను వివరించారు. కార్యక్రమంలో నీతి ఆయోగ్ డిప్యూటీ సెక్రటరీ గౌరవ్ కటియార్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, అండమాన్ నికోబార్ దీవుల ప్రతినిధులు పాల్గొన్నారు.