Share News

కదం తొక్కిన అంగన్వాడీలు

ABN , Publish Date - Jul 11 , 2026 | 04:46 AM

అఖిల భారత అంగన్వాడీల కోరికల దినోత్సవాన్ని పురస్కరించుకుని వేతనాల పెంపు, ‘నవ చేతన’ యాప్‌ రద్దు సహా పలు డిమాండ్ల సాధన కోసం ఏపీ అంగన్వాడీ..

కదం తొక్కిన అంగన్వాడీలు

  • రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్‌ల వద్ద ఆందోళన

  • వేతనాల పెంపు సహా పలు సమస్యల పరిష్కారానికి డిమాండ్‌

  • 31లోగా పరిష్కరించకుంటే కలెక్టరేట్‌లు దిగ్బంధిస్తామని హెచ్చరిక

ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌, జూలై 10: అఖిల భారత అంగన్వాడీల కోరికల దినోత్సవాన్ని పురస్కరించుకుని వేతనాల పెంపు, ‘నవ చేతన’ యాప్‌ రద్దు సహా పలు డిమాండ్ల సాధన కోసం ఏపీ అంగన్వాడీ వర్కర్క్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) ఆధ్వర్యంలో అంగన్వాడీ సిబ్బంది శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. అంగన్వాడీలకు రూ.26 వేల కనీస వేతనాలు చెల్లించాలని, పెన్షన్‌, పీఎఫ్‌, సామాజిక భద్రత సౌకర్యాలు కల్పించాలనే డిమాండ్లతో విజయవాడ ధర్నాచౌక్‌లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవీ.నాగేశ్వరరావు మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనాలు పెంచాలని లేనిపక్షంలో ఈ నెల 31న రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. విశాఖపట్నంలో జగదాంబ జంక్షన్‌ నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్న అంగన్వాడీ సిబ్బంది తమ ఇబ్బందులను పరిష్కరించాలని, గతంలో సీఎం చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచాలని కలెక్టరేట్‌ వద్ద బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం డీఆర్వో విశ్వేశ్వరనాయుడుకి వినతిపత్రాన్ని అందించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోనూ కలెక్టరేట్‌ ముందు అంగన్‌వాడీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కేవలం రూ.11 వేలు మాత్రమే వేతనం ఇస్తున్నప్పటికీ, ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తించడం వల్ల ఎటువంటి సంక్షేమ పథకాలను పొందలేని పరిస్థితి నెలకొందని, తక్షణమే ప్రభుత్వ ఉద్యోగి అనే పదాన్ని తొలగించాలని, సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. శ్రీకాకుళంలోనూ అంగన్వాడీ సిబ్బంది, సహాయకులు ఆర్‌అండ్‌బీ బంగ్లా రోడ్డులో బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం అక్కడి నుంచి ప్రదర్శనగా కలెక్టరేట్‌ గేటు వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు.


రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలుచేయాలని కోరుతూ విజయనగరంలో అంగన్వాడీలు జిల్లా కలెక్టరేట్‌ ఎదుట నిరసన చేపట్టారు. అధికారులు స్పందించకపోవడంతో కలెక్టరేట్‌ ఎదుట ఉన్న నాలుగు రోడ్ల జంక్షన్‌లో రాస్తారోకో నిర్వహించారు. ఐసీడీఎస్‌ పీడీ కేవీ బాలామణి అక్కడికి రావడంతో, ఆమెకు వినతిపత్రం అందజేశారు. కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లోనూ కలెక్టరేట్‌ల వద్ద అంగన్వాడీలు నిరసన చేపట్టారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఏలూరు జిల్లా కేంద్రం ఏలూరులో శుక్రవారం అంగన్వాడీలు భారీ నిరసన ప్రదర్శన చేపట్టి జిల్లా రెవెన్యూ అధికారి మైథిలికి వినతిపత్రం అందజేశారు. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరంలోనూ అంగన్వాడీ సిబ్బంది తమ సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో నిరసన చేపట్టి, కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేశారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ర్యాలీలు నిర్వహించి కలెక్టరేట్‌ల వద్ద ధర్నా చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో 18 ఏళ్లుగా పనిచేస్తున్నామని, వేతనాల్లో ఎలాంటి పెంపులేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు తమ వేతనాలను రూ.26 వేలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. పనిభారాన్ని తగ్గించాలని, నవచేతన యాప్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కర్నూలు జిల్లా కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. అనంతరం డీఆర్వో వెంకట నారాయణమ్మకు వినతిపత్రం అందజేశారు. నంద్యాల జిల్లా నంద్యాల టెక్కె మార్కెట్‌ యార్డు నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించిన అంగన్వాడీ కార్యకర్తలు కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఒంగోలు కలెక్టరేట్‌ ఎదుట జరిగిన ధర్నాకు జిల్లా నలుమూలల నుంచి అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు తరలివచ్చారు. ప్రకాశం భవనం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన అంగన్‌వాడీలను పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు నెల్లూరు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వీఆర్సీ గ్రౌండ్‌ నుంచి ర్యాలీగా తరలివచ్చి కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారికి వినతిపత్రం అందజేశారు.

Updated Date - Jul 11 , 2026 | 04:47 AM