Share News

గంజాయిపై సంయుక్త పోరు

ABN , Publish Date - Mar 03 , 2026 | 03:46 AM

గంజాయిపై ఉమ్మడిగా పోరాడాలని ఏపీ, ఒడిసా రాష్ట్రాలు నిర్ణయించాయి. ఇప్పటికే రాష్ట్రంలో గంజాయి సాగు లేకుండా చేసిన ఏపీ పోలీసులు..

గంజాయిపై సంయుక్త పోరు

  • చేతులు కలిపిన ఏపీ-ఒడిశా రాష్ట్రాలు

  • ఉత్తరాంధ్ర ఐజీ జెట్టితో ఒడిశా ఐపీఎస్‌ల చర్చలు

అమరావతి, మార్చి 2(ఆంధ్రజ్యోతి): గంజాయిపై ఉమ్మడిగా పోరాడాలని ఏపీ, ఒడిసా రాష్ట్రాలు నిర్ణయించాయి. ఇప్పటికే రాష్ట్రంలో గంజాయి సాగు లేకుండా చేసిన ఏపీ పోలీసులు.. ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రం మీదుగా రవాణా అవుతున్న గంజాయిని కూడా కట్టడి చేసి.. ఆ మహమ్మారిని సమూలంగా నిర్మూలించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. జనవరి-ఫిబ్రవరిలో జరిగిన సమన్వయ చర్చల మేరకు ఆంధ్రా-ఒడిసా పోలీసులు ఉమ్మడి పోరుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ఐజీ గోపీనాథ్‌ జెట్టి మాట్లాడుతూ ‘ఏపీలో గంజాయి మొక్క లేకుండా చేయాలని 2024 జూలైలో అనుకున్నాం. ఈ లక్ష్యాన్ని 2026జనవరికి సాధించాం. ఏపీ-ఒడిశా సరిహద్దుల్లోని దట్టమైన అటవీ ప్రాంతంలోకి మా డ్రోన్లు వెళ్లి చూశాయి. ఎక్కడా చిన్న మొక్క కనిపించలేదు. మీ(ఒడిసా) దగ్గరి నుంచి గంజాయి వస్తోంది. ఇక్కడి(ఏపీలో) యువతను నాశనం చేస్తోంది. చేతులు కలుపుదాం.. ఉమ్మడిగా గంజాయిని అంతం చేద్దాం’ అని సూచించారు. ‘గంజాయిని అంతం చేయాలనే పట్టుదలతో మేమూ ఉన్నాం. మాకు మీ సహకారం కావాలి’ అని ఒడిసా పోలీసులు ముందుకొచ్చారు. గంజాయి రవాణాలో 25కీలక నెట్‌వర్క్‌లు పనిచేస్తున్నాయని, గ్యాంగుల్లో కింగ్‌ పిన్లు, స్మగ్లర్లు, క్యారియర్ల సమాచారం పంచుకోవాలని ఏపీ అధికారులు ఒడిసా పోలీసుల్ని కోరారు. అందుకు సమ్మతించిన కోరాపుట్‌ పోలీసులు డ్రోన్లు, టెక్నాలజీ, ఉమ్మడి ఆపరేషన్‌లో ఉత్తరాంధ్ర పోలీసుల సహకారం అడిగారు. ప్రస్తుత సవాళ్లు, సమాచార మార్పిడి, భవిష్యత్తు కార్యాచరణ, ఉమ్మడి ఆపరేషన్‌కు సంబంధించి ‘సంయుక్త’ పేరుతో ఇరు రాష్ట్రాల పోలీసులు కీలక అడుగు వేశారు.


ఇక ఒడిసాలోకి ఏపీ పోలీస్‌..

ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు మావోయిస్టుల వేటకు ఒడిసాలోకి చొచ్చుకెళ్లేవారు. ఇప్పుడు గంజాయి అంతు తేల్చేందుకు ఆ రాష్ట్రంలోకి వెళ్లబోతున్నారు. ఉత్తరాంధ్ర- ఒడిసా సరిహద్దు ఉన్నతాధికారుల మధ్య కుదిరిన అవగాహన మేరకు ఒడిసాలో ఎక్కడ గంజాయి సాగు సమాచారం అందినా వెంటనే అక్కడికి వెళ్లి దాడులు చేస్తారు. స్మగ్లర్ల ఆచూకీ లభిస్తే.. నేరుగా వెళ్లి అరెస్టు చేస్తారు. ఇదే సమయంలో ఏపీలో గంజాయి కార్యకలాపాలపై ఒడిసా పోలీసులకు సమాచారం అందినా దాడి చేస్తారు. కాగా, గంజాయి సాగుకు విత్తనాల సరఫరా నుంచి మొక్క చేతికి వచ్చాక స్మగ్లింగ్‌లో పాల్గొంటున్న 700మంది కీలక వ్యక్తుల్ని గుర్తించిన ఉత్తరాంధ్ర పోలీసులు.. వారి ఆచూకీ కోసం పొరుగు రాష్ట్రాల పోలీసుల్ని సంప్రదిస్తున్నారు.

Updated Date - Mar 03 , 2026 | 03:47 AM