ఎవరికీ పట్టని ‘అంబేడ్కర్’
ABN , Publish Date - Aug 10 , 2026 | 04:11 AM
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ... ఈ పేరు వింటే ఇప్పటికీ హైదరాబాదే గుర్తుకొస్తుంది!. 2024 తర్వాత అక్కడి యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్‌లోని స్టడీ సెంటర్ల సేవలు నిలిపివేసింది.
రాష్ట్రానికి దక్కిన ఓపెన్ వర్సిటీ
ఏపీ విభజన తర్వాత ఏలూరుకు కేటాయించినా అవగాహన ఏదీ?
1 నుంచే రిజిస్ర్టేషన్లు ప్రారంభం
మరో ఐదు రోజుల్లో ముగింపు
అమరావతి, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ... ఈ పేరు వింటే ఇప్పటికీ హైదరాబాదే గుర్తుకొస్తుంది!. 2024 తర్వాత అక్కడి యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్‌లోని స్టడీ సెంటర్ల సేవలు నిలిపివేసింది. దీంతో ఏలూరులో ఓపెన్ యూనివర్సిటీ ఏ ర్పాటుకు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఎట్టకేలకు ఈ ఏడాది యూజీసీ గుర్తింపు సాధించింది. దీంతో ఈ నెల 1 నుంచి యూనివర్సిటీలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. కానీ, ఇప్పటికీ ఏలూరులో వర్సిటీ ప్రారంభమైన విషయం కానీ, అడ్మిషన్ల ప్రక్రియ మొదలైన అంశం గురించి కానీ అధికారులు యువతకు అవగాహన కల్పించలేదు. 2024లో హైదబాద్‌లోని ఉమ్మడి ఓపెన్ యూనివర్సిటీ ఏపీకి సేవలు ఆపేయడంతో రాష్ట్రంలో సార్వత్రిక విధానంలో ఉన్నత విద్యా కోర్సులు చేయాలనుకున్న యువతకు అవకాశం లేకుండాపోయింది. రెండేళ్లుగా ఎలాంటి అడ్మిషన్లు లేకపోవడంతో రాష్ట్రంలో ఎప్పుడు యూనివర్సిటీ ఏర్పాటుచేస్తారా? అని ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో ఓపెన్ యూనివర్సిటీ కోసం అధికారులు తీవ్రంగా శ్రమించారు. పదే పదే ఢిల్లీకి వెళ్లి రాష్ర్టానికి చెందిన ఎంపీల సహకారంతో గుర్తింపు సాధించారు. అయితే, అడ్మిషన్ల ప్రక్రియ సమయంలో మౌనం దాల్చారు. అధికారికంగా దీనికి సంబంధించి ఎలాంటి ప్రకటన జారీచేయలేదు. అందరికీ తెలిసేలా నోటిఫికేషన్లు కూడా విడుదల కాలేదు. మరోవైపు ఇప్పటికే దాదాపు పది రోజుల గడువు ముగిసింది. మరో ఐదు రోజుల్లో రిజిస్ర్టేషన్ల ప్రక్రియ కూడా ముగియనుంది.
అయినప్పటికీ.. ఈ వర్సిటీపై అధికార యంత్రాంగం ఎలాంటి ప్రచారం చేయకపోవడం గమనార్హం. ఓపెన్ యూనివర్సిటీకి రాష్ట్రంలో 76 స్టడీ సెంటర్లు ఉన్నాయి. బీఏలో రెండు కోర్సులు, బీకాంలో ఒక కోర్సు, బీఎస్సీలో రెండు కోర్సులు ప్రారంభించారు. ఇవి మూడేళ్ల కాల వ్యవధి కోర్సులు. ఇవి కాకుండా ఏడాది కాలంలో పూర్తిచేసేలా లైబ్రరీ అండ్ ఇన్‌ఫర్మేషన్ సైన్స్ కోర్సును ప్రారంభించారు. స్టడీ సెంటర్లలో విద్యార్థులకు బోధన జరుగుతుంది. ఈ విధానంలో అయినా డిగ్రీ పట్టా పొందాలని అనేక మంది ఎదురుచూస్తుంటే అధికారులు మాత్రం తమకు పట్టదన్నట్లుగా దీనిపై మౌనంగా ఉండటం గమనార్హం. దీంతో ఓపెన్ యూనివర్సిటీలో రిజిస్ర్టేషన్లు తగ్గే అవకాశం కనిపిస్తోంది.