చేనేతలో ఏపీని నంబర్ వన్‌గా నిలుపుతాం
ABN , Publish Date - Jul 18 , 2026 | 05:07 AM
చేనేత రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే నంబర్‌వన్‌గా నిలపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర చేనేత, జౌళి మంత్రి ఎస్.సవిత తెలిపారు.
అంతర్జాతీయ మార్కెట్‌కు ఏపీ హస్తకళలు: మంత్రి సవిత
భారత్ టెక్స్ ప్రదర్శనలో 3 సంస్థలతో ఒప్పందాలు
ఢిల్లీలో లేపాక్షి షోరూమ్ పునఃప్రారంభం
న్యూఢిల్లీ, జూలై 17(ఆంధ్రజ్యోతి): చేనేత రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే నంబర్‌వన్‌గా నిలపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర చేనేత, జౌళి మంత్రి ఎస్.సవిత తెలిపారు. నాలుగు రోజులపాటు జరిగిన భారత్ టెక్స్-2026 ప్రదర్శనలో మూడు ఒప్పందాలు చేసుకున్నామని తెలిపారు. ఢిల్లీలో జరుగుతున్న భారత్ టెక్స్‌లో చివరి రోజైన శుక్రవారం.. మంత్రి సవిత పలువురు పెట్టుబడిదారులు, కొనుగోలుదారులతో భేటీ అయ్యారు. హవాక్ గ్రూప్ ఆఫ్ ఎండీ ప్రవీణ్ సంగ్వాన్ తదితర పెట్టుబడిదారులతో చర్చించారు. భారత్ టెక్స్ ప్రదర్శనలో ఏపీ చేనేత, జౌళి శాఖాధికారులు మూడు సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. రాష్ట్రంలో ఆధునిక టెక్స్‌టైల్ రీసైక్లింగ్ ఎకోసిస్టమ్ ఏర్పాటు చేయడానికి తిరువూరుకు చెందిన బీకేఎస్ ఫ్యాబ్రిక్స్‌తో అవగాహన ఒప్పందం జరిగింది. ఈ సంస్థ రాష్ట్రంలో రూ.4 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. పది ఎకరాల్లో టెక్స్‌టైల్ రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటు చేయనుంది. వినియోగానంతర వస్త్ర వ్యర్థాలను శాస్త్రీయంగా సేకరించి, వర్గీకరించి, పునర్వినియోగానికి అనువుగా ఈ యూనిట్ మార్చనుంది. ఈ యూనిట్ ఏర్పాటుతో రాష్ట్రంలో సర్క్యులర్ టెక్స్‌టైల్ ఎకానమీ, పర్యావరణ పరిరక్షణ, వనరుల సమర్థ వినియోగంతోపాటు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. విశాఖలో రూ.100 కోట్లతో ఆధునిక గార్మెంట్ తయారీ యూనిట్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్టు ద్వారా 3 వేల మందికి ఉపాధి లభిస్తుంది. చేనేత ఉత్పత్తులకు మార్కెట్ లభించేలా నాసిక్‌కు చెందిన కేప్స్ ఫౌండేషన్‌తో ఒప్పందం కుదిరింది.
లేపాక్షి షోరూమ్ ప్రారంభం
ఢిల్లీలో ఆధునీకరించిన లేపాక్షి షోరూమ్‌ను చేనేత, జౌళి శాఖ సలహాదారు సుచిత్ర ఎల్లా, ఏపీహెచ్‌డీసీ చైర్మన్ పసుపులేటి హరిప్రసాదరావు, చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి, లేపాక్షి ఎండీ ఎం.విశ్వతో కలిసి మంత్రి సవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏపీ హస్తకళలకు అంతర్జాతీయ మార్కెట్ కల్పించడానికి కృషి చేస్తున్నామన్నారు. లేపాక్షి షోరూమ్‌లను పలు దేశాల్లో ప్రారంభించే ఆలోచన చేస్తున్నామన్నారు.