Share News

Andhra Pradesh Deputy CM Pawan Kalyan: జీవ వైవిధ్య రక్షణలో ఆంధ్ర రోల్‌ మోడల్‌ కావాలి

ABN , Publish Date - Jan 09 , 2026 | 05:46 AM

మడ అడవుల్లో జీవ వైవిధ్యాన్ని రక్షించడంలో జాతీయ స్థాయిలోనే ఏపీ రోల్‌ మోడల్‌గా నిలవాలి. ఇందుకోసం అటవీశాఖ సమష్టిగా కృషి చేయాలి’ అని....

Andhra Pradesh Deputy CM Pawan Kalyan: జీవ వైవిధ్య రక్షణలో ఆంధ్ర రోల్‌ మోడల్‌ కావాలి

  • మడ అడవుల పెంపుదలకు చర్యలు

  • తీరంలో గ్రేట్‌ గ్రీన్‌ వాల్‌ ప్రాజెక్టు

  • వీటి పెంపకంతో తీర ప్రజలకు ఆదాయ మార్గాల కల్పనకు కృషి: డిప్యూటీ సీఎం

అమరావతి/విజయవాడ, జనవరి 8(ఆంధ్రజ్యోతి): ‘మడ అడవుల్లో జీవ వైవిధ్యాన్ని రక్షించడంలో జాతీయ స్థాయిలోనే ఏపీ రోల్‌ మోడల్‌గా నిలవాలి. ఇందుకోసం అటవీశాఖ సమష్టిగా కృషి చేయాలి’ అని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో ‘మడ అడవులు పెంపుదల-వాటి నుంచి సుస్థిర ఆదాయం’ అనే అంశంపై రెండు రోజుల జాతీయ స్థాయి వర్క్‌షాప్‌ గురువారం విజయవాడలో ప్రారంభమైంది. ఉప ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ‘తీర ప్రాంత రక్షణకు, ప్రకృతి వైపరిత్యాల నుంచి నష్ట నివారణకు మడ అడవులు కీలకం. ఏపీ తీర ప్రాంత రక్షణకు బలమైన గోడల్లా ఉండే మడ అడవులను రక్షించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోంది. రాష్ట్రానికి తుఫానుల ప్రభావం ఎక్కువ. గోదావరి, కృష్ణా బేసిన్లలో తుఫాన్ల నుంచి నష్టాన్ని నివారించేందుకు మడ అడవుల్ని విరివిగా పెంచడం చాలా అవసరం. మడ అడవుల్ని కొత్తగా పెంచడంతో పాటు ఇప్పటికే ఉన్న వాటిని కాపాడుకోవడం అవసరం. 2025లో తీరప్రాంతంలో 700 హెక్టార్లలో మడ అడవుల్ని ప్రభుత్వం పెంచింది. ఇదే స్పూర్తిని భవిష్యత్‌లోనూ కొనసాగిస్తాం. తీర ప్రాంత వాసులకు ఆదాయం అందించే ప్రయత్నంలో భాగంగా మడ అడవుల పెంపకం, తీర ప్రాంతాన్ని రక్షించడానికి మూడు దశలుగా గ్రీన్‌ బెల్టు అభివృద్ధి చేయడంలోనూ వారిని భాగస్వాములను చేయాలని నిర్ణయించాం. ఎకో టూరిజం ద్వారా ఆదాయ మార్గాలు తయారు చేస్తాం. రాష్ట్రంలో 50ు గ్రీన్‌ కవర్‌ ఉండాలనే బలమైన సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. తీర ప్రాంతంలో గ్రేట్‌ గ్రీన్‌ వాల్‌ ప్రాజెక్ట్‌ను చేపట్టాం. పచ్చదనం నుంచి ఆర్థిక ఫలాలు రావాలనే కొత్త ఆలోచనతో ముందుకెళ్తున్నాం.


అటవీ నర్సరీలను ప్రోత్సహించి, గిరిజనులకు ఆదాయం పెంచే చర్యలు తీసుకుంటున్నాం. వైవిధ్యమైన దేశవాళీ మొక్కలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. మడ అడవుల పెంపుదలకు సమగ్ర కార్యాచరణ తెస్తాం. అటవీ సిబ్బంది సంక్షేమ నిధికి రూ.5 కోట్లు అందించాం’ అని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేషనల్‌ క్యాంపా (సీఏఎంపీఏ) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ఆనంద్‌ మోహన్‌ మాట్లాడుతూ.. సముద్ర తీర ప్రాంతాల్లో క్షీణిస్తున్న మడ అడవులను పునరుద్ధరించి ఆ ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవనోపాధిని మెరుగుపరచడమే మిస్టీ పథకం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. సముద్రతీర ప్రాంతాల్లో క్షీణిస్తున్న మడ అడవులను రక్షించి, సముద్రం కోత నుంచి కాపాడడమే లక్ష్యంగా మిస్టీ పథకం పనిచేస్తుందన్నారు. ఈ పథకాన్ని సుమారు రెండున్నర ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తుందన్నారు. ఈ పథకానికి జాతీయ క్యాంపా నిధుల నుంచి 10 శాతం కేటాయిస్తున్నారని చెప్పారు. మొత్తం రూ.825 కోట్ల కేటాయింపుల్లో ఇప్పటివరకు కేవలం రూ.100 కోట్లు మాత్రమే వినియోగించినట్టు తెలిపారు. చీఫ్‌ కన్సర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌, హెడ్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ ఫోర్స్‌ డాక్టర్‌ పీవీ చలపతిరావు మాట్లాడుతూ, గత నాలుగు దశాబ్దాలుగా రాష్ట్రంలో మడ అడవుల విస్తీర్ణం పెరుగుతూ ఉండడం ఒక సానుకూల అంశమని తెలిపారు. భవిష్యత్తులో తీర ప్రాంతాన్ని మరింత సురక్షితంగా మార్చడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. అటవీ శాఖ ముఖ్యక కార్యదర్శి కాంతిలాల్‌ దండే, అటవీశాఖ సలహాదారు మల్లిఖార్జునరావు, ఎన్‌ఏఈబీ అదనపు జనరల్‌ రమేశ్‌ కుమార్‌ పాండే తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2026 | 05:46 AM