Share News

ఏపీ... గ్లోబల్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ హబ్‌!

ABN , Publish Date - Jul 17 , 2026 | 04:40 AM

ప్రపంచ ఆహార రంగానికి అవసరమైన ముడిసరుకును అందిస్తూ, అత్యాధునిక సాంకేతికతతో వాటిని శుద్థి (ప్రాసెస్‌) చేయడంలో ఆంధ్రప్రదేశ్‌ ‘గ్లోబల్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ హబ్‌’గా ఆవిర్భవిస్తోందని..

ఏపీ... గ్లోబల్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ హబ్‌!

  • ఆహార శుద్ధి రంగంలో 9శాతం వాటాతో రాష్ట్రం నంబర్‌ వన్‌

  • రూ.30వేల కోట్ల పెట్టుబడులు.. 3 లక్షల ఉద్యోగాలే లక్ష్యం

  • ఫుడ్‌ వరల్డ్‌ ఇండియా సదస్సులో మంత్రి టీజీ భరత్‌

న్యూఢిల్లీ, జూలై 16(ఆంధ్రజ్యోతి): ప్రపంచ ఆహార రంగానికి అవసరమైన ముడిసరుకును అందిస్తూ, అత్యాధునిక సాంకేతికతతో వాటిని శుద్థి (ప్రాసెస్‌) చేయడంలో ఆంధ్రప్రదేశ్‌ ‘గ్లోబల్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ హబ్‌’గా ఆవిర్భవిస్తోందని రాష్ట్ర భారీ పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్‌ చెప్పారు. గురువారం, ఫిక్కి, డెలాయిట్‌ సంయుక్తంగా నిర్వహించిన 17వ ‘ఫుడ్‌ వరల్డ్‌ ఇండియా 2026’ జాతీయ సదస్సుకు మంత్రి టీజీ భరత్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రస్తుత దశాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, స్పేస్‌ టెక్నాలజీ వంటి రంగాల గురించి మాట్లాడుకుంటున్నారనీ కానీ ఈ దశాబ్దంలో అత్యంత భారీ ఆర్థిక వ్యాపార అవకాశం మన డైనింగ్‌ టేబుల్‌పై ఉన్న ‘ఆహారం’ రూపంలోనే ఉందని భరత్‌ అన్నారు. నేడు ఆహారం అంటే కేవలం వ్యవసాయం మాత్రమే కాదని అది ఆర్థిక వ్యవస్థ, సాంకేతికత, ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ, అంతర్జాతీయ భౌగోళిక వ్యూహాత్మక అంశాలతో ముడిపడి ఉందన్నారు. ప్రపంచ ఆహార ప్రాసెసింగ్‌ రంగం 8.1 ట్రిలియన్‌ డాలర్ల మార్కెట్‌ కలిగి ఉండగా, అందులో భారత్‌ వాటా 543 బిలియన్‌ డాలర్లని, కేవలం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం వాటానే 49 బిలియన్‌ డాలర్‌లు(దాదాపు 9శాతం) అని మంత్రి చెప్పారు. దేశంలోనే అత్యధిక రిజిస్టర్డ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలు కలిగిన రాష్ట్రంగా ఏపీ నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచిందని వివరించారు. ఇకపై ఏపీ కేవలం పంటలు పండించడానికే పరిమితం కాదని, ప్రాసెసింగ్‌ రంగంలో ప్రపంచ బ్రాండ్‌గా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - Jul 17 , 2026 | 04:41 AM