ఏపీ ‘ఏఐ’ మోడల్ భేష్..!
ABN , Publish Date - Aug 22 , 2026 | 04:52 AM
పన్నుల నిర్వహణ ఒక క్లిష్టమైన ప్రక్రియ..! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వచ్చాక.. ఈ ప్రక్రియ చాలా సులభమైపోయింది. కొన్ని వారాలపాటు పట్టే పనులు సైతం గంటల్లోనే పూర్తవుతున్నాయి.
6 నెలల్లో రూ.743 కోట్ల అదనపు రాబడి
22వేల కోర్టు తీర్పులతో కూడిన ఏఐ లీగల్ అసిస్టెంట్
వాణిజ్య పన్నుల శాఖలో ‘ఏఐ’పై సర్వత్రా ప్రశంసలు
అధ్యయనం కోసం పలు రాష్ట్రాల నుంచి బృందాలు
అమరావతి, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): పన్నుల నిర్వహణ ఒక క్లిష్టమైన ప్రక్రియ..! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వచ్చాక.. ఈ ప్రక్రియ చాలా సులభమైపోయింది. కొన్ని వారాలపాటు పట్టే పనులు సైతం గంటల్లోనే పూర్తవుతున్నాయి. ఖజానాకు ఆదాయం కూడా వస్తోంది. అందుకే ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ రూపొందించిన ఏఐ ఆధారిత జీఎస్టీ పరిపాలన మోడల్ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోందని ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. పన్ను ఎగవేతలను అరికట్టడం, పన్ను వసూళ్లను పారదర్శకం చేయ డం, పన్ను చెల్లింపుదారుల సేవలను మెరుగుపరచడంలో ఏఐని వాడుతున్న తీరును పలు రాష్ట్రాలు అభినందించినట్లు పేర్కొంది. వాణిజ్య పన్నుల విభాగంలో ఏఐ వాడకంపై రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మోడల్‌ను ఇటీవల కేంద్ర రెవెన్యూ కార్యదర్శి సమక్షంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంతోపాటు ఇతర రాష్ట్రాలు ఈ మోడల్‌ను అభినందించాయని, తమ రాష్ట్రాల్లో అమలు చేసేందుకు వారు ఆసక్తిగా ఉన్నారని ప్రభుత్వం తెలిపింది.
ఏపీ వాడుతున్న ఏఐ మోడల్‌లోని కీలకాంశాలు
కేసు ఎంపిక నుంచి లిటిగేషన్ వరకూ మొత్తం ప్రక్రియను ఏఐ పర్యవేక్షిస్తుంది. జీఎస్టీ రిటర్నుల పరిశీలన (సెక్షన్ 61), ఆడిట్ (సెక్షన్ 65), తనిఖీలు (సెక్షన్ 67), కోర్టు కేసుల (జీఎ్‌సటీఏటీ, హైకోర్టు, సుప్రీంకోర్టు) వరకు మొత్తం వ్యవహారాన్ని ఏఐ పర్యవేక్షిస్తుంది. ఈ వ్యవస్థలోని 4 విభిన్న మార్గాల నుంచి వచ్చే డేటాను అనుసంధానించడం ద్వారా 19 ఆటోమేటెడ్ ఎనలిటికల్ రిపోర్టులు, 35 సూచీలతో కూడిన రిస్క్ మ్యాట్రిక్స్ ఉన్నాయి. ఇవి అనుమానాస్పద కేసులను గుర్తిస్తాయి.
కోర్టు తీర్పుల విశ్లేషణ, చట్టపరమైన సమాధానాల ముసాయిదా తయారీ కోసం సుమారు 22,000 కోర్టు తీర్పుల డేటాతో కూడిన ప్రత్యేక ఏఐ అసిస్టెంట్‌ను వినియోగిస్తున్నారు.
మాన్యువల్ విధానంతో పోల్చితే ఏఐ ఆధారిత పరిశీలన ద్వారా కేవలం 6 నెలల కాలంలోనే రూ.743.43 కోట్ల అదనపు రాబడిని గుర్తించారు. ప్రతి కేసు పరిశీలన ద్వారా సగటున వచ్చే రాబడి మాన్యువల్ విధానంలో రూ.3.08 లక్షలు ఉండగా... ఏఐ విధానం ద్వారా అది రూ.27.63 లక్షలకు పెరిగింది. ఈ వ్యవస్థ మానవ ప్రమేయాన్ని తగ్గించినప్పటికీ... తుది నోటీసులు, డిజిటల్ సంతకాలు, ఆదేశాల జారీ పూర్తిగా అధికారుల పర్యవేక్షణలోనే జరుగుతాయి.
ఏపీలో అనుసరిస్తున్న ఈ అత్యాధునిక విధానాన్ని తమ రాష్ట్రాల్లోనూ అమలు చేసేందుకు తమిళనాడు, బిహార్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, కేరళ, మేఘాలయా ఆసక్తి చూపించాయి. ఈ మోడల్‌ను అధ్యయనం చేయడానికి వారు తమ బృందాలను ఏపీకి పంపుతున్నారు.
రిఫండ్‌లు, రిజిస్ర్టేషన్ల రద్దుల పరిశీలనలో కూడా రిస్క్ స్కోరింగ్ వ్యవస్థను విస్తరించనున్నారు. కేంద్ర ప్రభుత్వం జీఎ్‌సటీఎన్‌ల ద్వారా నేరుగా జీఎ్‌సటీఎన్‌ఏపీఐ యాక్సెస్ పొందడం ద్వారా ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఏపీ వాణిజ్య పన్నుల శాఖ భావిస్తోంది.