వ్యవసాయ యాంత్రీకరణకు మార్గదర్శకాలు జారీ
ABN , Publish Date - Apr 08 , 2026 | 04:31 AM
సబ్‌మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ (ఎస్‌ఎంఏఎం) 2025-26 అమలు కోసం వ్యవసాయ కార్యాచరణ మార్గదర్శకాలు, జిల్లాలకు నిధుల కేటాయింపు కోసం అనుసరించిన విధానాన్ని...
లాటరీ విధానంలో లబ్ధిదారుల ఎంపిక
ఎస్సీ, ఎస్టీ, చిన్న, మహిళా రైతులకు 50 శాతం సబ్సిడీ
అమరావతి, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): సబ్‌మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ (ఎస్‌ఎంఏఎం) 2025-26 అమలు కోసం వ్యవసాయ కార్యాచరణ మార్గదర్శకాలు, జిల్లాలకు నిధుల కేటాయింపు కోసం అనుసరించిన విధానాన్ని ప్రభుత్వం ఆమోదించింది. ఈమేరకు వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ మంగళవారం మెమో జారీ చేశారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్ అనుమతితో ట్రాక్టర్ పరికరాలు, ఇతర వర్గాల డిమాండ్‌ను బట్టి నిధులను మార్పిడి చేసుకోవడానికి జిల్లా వ్యవసాయ అధికారులను అనుమతించారు. లాటరీ విధానాన్ని అవలంబించి, ఎస్సీ, ఎస్టీల వారీగా, మండలాల వారీగా ఈ పథకం లబ్ధిదారులను ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆమోదంతో అర్హులైన దరఖాస్తుదారుల జాబితాను ఖరారు చేసి, ఆమోదించిన దరఖాస్తుల మధ్య లాటరీ నిర్వహించి, ఎంపికైన లబ్ధిదారులతో ప్రాధాన్యత ఆధారిత జాబితా రూపొందించాలన్నారు. చిన్న, మధ్యస్థ, మహిళ, ఎస్సీ, ఎస్టీ రైతులకు 50 శాతం, ఇతర వర్గాల రైతులకు 40 శాతం సబ్సిడీ అందించనున్నట్లు తెలిపారు. ఒక పరికరానికి సబ్సిడీ రూ.50 వేల వరకు, లబ్ధిదారులు రెండు పరికరాలు ఎంపిక చేసుకుంటే రూ.50వేల వరకే సబ్సిడీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. లబ్ధిదారులు చెల్లించాల్సిన నాన్ సబ్సిడీ మొత్తాన్ని ఎంప్యానల్ లిస్టులోని సరఫరాదారులకు చెల్లించాలని పేర్కొన్నారు. నిర్ధేశిత సమయంలో చెల్లింపు చేయకపోయినా, ఇతరత్రా అనర్హులుగా తేలినా.. కొత్త వారిని ఎంపిక చేయడానికి ఈ జాబితాను ప్రామాణికంగా తీసుకోవాలన్నారు. ఈ జాబితా ఏడాదిపాటు చెల్లుబాటులో ఉంటుందని, ఈవిధంగా సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌ను సవరించాలని డైరెక్టర్‌ను ఆదేశించారు. 2025 ఖరీఫ్‌లో సాగైన విస్తీర్ణం, ఈ-పంటలో నమోదైన డేటా ప్రకారం జిల్లాలకు నిధులు కేటాయింపును పరిగణలోకి తీసుకుని, ప్రభుత్వ లక్ష్యం మేరకు యంత్ర పరికరాలను కేటాయించనున్నట్లు మెమోలో స్పష్టం చేశారు. ట్రాక్టర్ పరికరాలు, విత్తనం నాటడం, తవ్వడం, మొక్కల రక్షణ పరికరాలు, చేతి పరికరాలు, మినీ ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు, పంట కోత, నూర్పిడి పరికరాలు, పంట అవశేషాల నిర్వహణ, గడ్డి, పశుగ్రాస కోత పరికరాల కోసం రూ.136.62కోట్లు వ్యయానికి ప్రభుత్వం ఆమోదం తెలపగా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న నిధులు రూ.112.5కోట్లు జిల్లాలకు కేటాయింపు శాతం ప్రకారం ఖర్చు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.