మెట్ట ప్రాంతాలకు కంటింజెన్సీ ప్లాన్
ABN , Publish Date - May 11 , 2026 | 05:00 AM
ఈ ఏడాది ముంద స్తు నీటి విడుదల నేపథ్యంలో ఇప్పటి నుంచే ఖరీఫ్ సన్నద్ధతపై దృష్టి సారించాలని వ్యవసాయశాఖ డైరెక్టర్ మనజీర్ జిలానీ జిల్లా వ్యవసాయ అధికారులను ఆదేశించారు.
అగ్రి డైరెక్టర్ మనజీర్ జిలానీ వెల్లడి
అమరావతి, మే 10(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది ముంద స్తు నీటి విడుదల నేపథ్యంలో ఇప్పటి నుంచే ఖరీఫ్ సన్నద్ధతపై దృష్టి సారించాలని వ్యవసాయశాఖ డైరెక్టర్ మనజీర్ జిలానీ జిల్లా వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావం చూపే మెట్ట ప్రాంతాల్లో ప్రత్యామ్నాయంగా కంటింజెన్సీ ప్లాన్‌తో సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. ఆదివారం జిల్లా వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముందస్తు నీటి విడుదలపై రైతులకు అవగాహన కల్పించి, ముందుగా సాగు చేపడితే.. పంట కోత సమయంలో ప్రకృతి వైపరీత్యాల నుంచి తప్పించుకోవచ్చని, ఏపీ ఎయిమ్స్ యాప్‌ను రోజూ గమనించాలని, ఫార్మర్స్ యాప్‌ను ప్రతి రైతు డౌన్‌లోడ్ చేసుకునేలా చూడాలని, రైతులందరినీ రైతు రిజిస్ర్టీలో నమోదు చేయించాలని సూచించారు. సోమశిల, కండలేరు ప్రాజెక్టుల నీటి విడుదలపై నెల్లూరు, తిరుపతి జిల్లా అధికారులు మాట్లాడుతూ గతేడాది కన్నా ఈసారి ముందుగానే నీటిని విడుదల చేశారని, ఈనెల 25లోపు వరి నాట్లు పూర్తవుతాయని చెప్పారు.