Share News

డిజిటల్‌ బాటలో వ్యవసాయ శాఖ

ABN , Publish Date - May 08 , 2026 | 05:40 AM

రాష్ట్రంలో వ్యవసాయాన్ని పూర్తిగా డిజిటల్‌ బాట పట్టించేందుకు వ్యవసాయ శాఖ అగ్రిటెక్‌ సేవలను విస్తృతం చేసింది. వ్యవసాయ రంగం బలోపేతానికి సీఎం చంద్రబాబు నిర్ధేశించిన...

డిజిటల్‌ బాటలో వ్యవసాయ శాఖ

  • అన్నదాతకు ఆసరాగా అగ్రిటెక్‌.. ఎరువుల సరఫరాకు ప్రత్యేక పోర్టల్‌

  • ఏపీఎయిమ్స్‌ యాప్‌తో రైతుకు విభిన్న సేవలు

అమరావతి, మే 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వ్యవసాయాన్ని పూర్తిగా డిజిటల్‌ బాట పట్టించేందుకు వ్యవసాయ శాఖ అగ్రిటెక్‌ సేవలను విస్తృతం చేసింది. వ్యవసాయ రంగం బలోపేతానికి సీఎం చంద్రబాబు నిర్ధేశించిన పది సూత్రాల్లో అగ్రిటెక్‌ ఒకటి. డిజిటల్‌ సేవలపై రైతులకు అవగాహన కల్పించడం, వాటిని అందుబాటులోకి తేవడం, వాటి వినియోగం ద్వారా మెరుగైన సేవలు అందించడం లక్ష్యంగా వ్యవసాయ శాఖ ముందుకెళ్తొంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ అగ్రికల్చర్‌ ఇన్ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌(ఏపీఏఐఎంఎస్‌) అనే కొత్త యాప్‌ను వ్యవసాయ శాఖ రైతులకు అందుబాటులోకి తెచ్చింది. ‘ఏపీఎయిమ్స్‌-2.0’ యాప్‌ను రైతులు తమ మొబైల్‌ ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసుకోవడం ద్వారా పంటలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవడంతోపాటు ఉపగ్రహ చిత్రాల ద్వారా పంటల ఆరోగ్యం, రియల్‌టైమ్‌లో వాతావరణ సమాచారం, మార్కెట్‌ ధరలు, కిసాన్‌ డ్రోన్‌ సేవలు, యంత్రపరికరాల సేవలను తేలిగ్గా తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. జాతీయ స్థాయిలో ఐఎఫ్ఎంఎస్‌ పోర్టల్‌తో అనుసంధానం చేస్తూ, కొత్త డిజిటల్‌ విధానాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ తీసుకొచ్చింది. ఈ విధానంలో రైతులు తమకు కావాల్సిన ఎరువుల్ని ముందుగానే ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. ప్రతి రైతుకు గరిష్ఠంగా 50 బస్తాల ఎరువులు అందేలా ఈ టెక్నాలజీ పని చేస్తుంది. ఈ అధునాతన డిజిటల్‌ సేవలను క్షేత్రస్థాయిలో సమర్ధంగా అమలు కావటానికి రైతుసేవా కేంద్రాల్లో పని చేసే సహాయకులకు ప్రత్యేకంగా ఆర్‌ఎ్‌సకే అసిస్టెంట్స్‌ మొబైల్‌ యాప్‌ను ఏర్పాటు చేశారు. ఈ యాప్‌ వాడకంలో గత 30 రోజుల్లో విశాఖ, అనకాపల్లి, తిరుపతి జిల్లాల సిబ్బంది 96 శాతం లాగిన్స్‌తో ఉత్తమ పనితీరు కనబర్చారు.

Updated Date - May 08 , 2026 | 05:41 AM