కర్షకుల కోసం కొత్త వంగడాలు
ABN , Publish Date - Apr 01 , 2026 | 05:32 AM
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తయారు చేసిన చెరకు, మినుముతోపాటు ఐదు రకాల వరి వంగడాలు, బెంగళూరులోని ఐటీసీ లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ సెంటర్ రూపొందించిన పొగాకు విత్తనాలను వ్యవసాయ శాఖ విడుదల చేసింది.
రాష్ట్ర విత్తన సబ్ కమిటీ ఆమోదం
వరిలో ఐదు రకాలు.. మినుము, చెరకు, పొగాకు ఒక్కొక్క రకం
అమరావతి, మార్చి 31(ఆంధ్రజ్యోతి): ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తయారు చేసిన చెరకు, మినుముతోపాటు ఐదు రకాల వరి వంగడాలు, బెంగళూరులోని ఐటీసీ లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ సెంటర్ రూపొందించిన పొగాకు విత్తనాలను వ్యవసాయ శాఖ విడుదల చేసింది. మంగళవారం మంగళగిరిలోని వ్యవసాయశాఖ డైరెక్టరేట్‌లో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, ఇన్‌చార్జి డైరెక్టర్ శ్రీనివాసులు 9రకాల నూతన వంగడాలను విడుదల చేశారు. వరిలో ఎంసీఎం 125, ఎంటీయూ 1290, ఎంటీయూ1282, జేఎంపీ 132, ఆర్‌జీఎల్ 7016, యూటీఆర్ 181, మినుములో ఎల్‌బీజీ 932, చెరకులో 2006ఏ223(సీవోఏ12323), పొగాకులో ఎఫ్‌సీఆర్‌హెచ్7 (ఎల్‌ఎ్‌సటీసీ7) రకాలను రైతు స్థాయిలో పరీక్షలు పూర్తి చేసి, మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు రాష్ట్ర విత్తన సబ్‌కమిటీ ఆమోదం తెలిపింది. రానున్న ఖరీఫ్, రబీ సీజన్లకు అనువైన ఈ రకాలను త్వరలో రైతులకు సరఫరా చేయనున్నారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ ‘ఏదైనా విత్తనం విడుదలకు ముందు వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగా ప్రతికూల పరిస్థితుల్ని, తెగుళ్లను తట్టుకుని, నేల వాలిపోకుండా, నీటి విడుదల ఆధారంగా పంట సాగు కాలం ఉండేలా సిఫారసులు ఉండాలి. రానున్న ఖరీఫ్‌కు ముందస్తు నీటి విడుదల దృష్ట్యా క్లస్టర్ల వారీగా వరి పంట రకాలను సిఫారసు చేయాలి. అక్టోబరు, నవంబరు నెలల్లో తుఫానులు తట్టుకునే వరి రకాల సమాచారాన్ని నాట్లు వేయక ముందే రైతులకు సూచించాలి. క్షేత్ర పరిశోధన గణాకంకాలతో సాంకేతిక సిఫారసులు ఉండాలి’ అని శాస్త్రవేత్తలను కోరారు. వ్యవసాయ, ఉద్యానశాఖల డైరెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ, చౌడు, తెగుళ్లను తట్టుకునే రకాలను రైతులకు అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో రంగా వర్సిటీ రీసెర్చ్ డైరెక్టర్ సత్యనారాయణ, విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ సతీష్, అదనపు డైరెక్టర్ వినయ్‌చంద్, జేడీ కృపాదాస్ పాల్గొన్నారు.
ఎంటీయూ 1290 వరి: మార్టేరు వరి పరిశోధన స్థానంలో రూపొందించారు. పంటకాలం 120రోజులు. ప్రతికూల పరిస్థితుల్లో హెక్టారుకు 5000-5500 కిలోల దిగుబడి వస్తుంది. సాధారణ పరిస్థితుల్లో 6500-7000కిలోలు ఉండవచ్చు.
ఎంసీఎం 125 వరి: మచిలీపట్నం పరిశోధన స్థానంలో తయారైంది. పంట కాలం 145రోజులు. లవణ భూముల్లో హెక్టారుకు 5000-5800 కిలోల దిగుబడి. సాధారణ భూముల్లో 6000-7300కిలోలు వస్తుంది.
యూటీఆర్ 181 వరి: ఊటుకూరు పరిశోధన స్థానంలో తయారైంది. పంట కాలం 150-155రోజులు. హెక్టారుకు 7000-7500 కిలోల దిగుబడి వస్తుంది.
జేఎంపీ 132 వరి: జంగమహేశ్వరపురం పరిశోధన స్థానంలో తయారైంది. పంట కాలం 150-155 రోజులు. హెక్టారుకు 6500-7000కిలోల దిగుబడి వస్తుంది.
ఆర్‌జీఎల్ 7016 వరి: రాగోలు పరిశోధన స్థానంలో తయారైంది. పంట కాలం 145-150 రోజులు. హెక్టారుకు 6000-6500కిలోల దిగుబడి వస్తుంది.
ఎల్‌బీజీ 932 మినుము: లాం పరిశోధన స్థానంలో తయారైంది. పంట కాలం 85-90 రోజులు. హెక్టారుకు 20-25క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.
2006ఏ223 చెరకు: అనకాపల్లి పరిశోధన స్థానంలో తయారైంది. 10నెలల స్వల్పకాలికరకం. హెక్టారుకు 128.32టన్నుల దిగుబడి వచ్చింది.
ఎఫ్‌సీఆర్‌హెచ్7 హైబ్రీడ్ రకం పొగాకు: బెంగళూరులోని ఐటీసీ లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ సెంటర్‌లో తయారైంది. ఈ రకం పొగాకు రైతులకు అధిక స్థూల రాబడినిస్తుంది. హెక్టారుకు 3932కిలోల దిగుబడినిస్తుంది.
ఎంటీయూ1282 వరి: మార్టేరు వరి పరిశోధన స్థానంలో రూపొందించారు. పంట కాలం ఖరీ్‌ఫలో 135 రోజులు, రబీలో 125రోజులు. ఖరీఫ్‌లో హెక్టారుకు 6500-7000కిలోలు, రబీలో 7000-7500కిలోల దిగుబడి వస్తుంది.