వ్యవ‘సాయం’ పెంపు
ABN , Publish Date - Feb 15 , 2026 | 05:14 AM
రాష్ట్రంలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు 2026-27 బడ్జెట్‌లో రూ.53,752.12 కోట్లను కూటమి ప్రభుత్వం కేటాయించింది. శనివారం శాసనసభలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈ మేరకు వ్యవసాయ బడ్జెట్‌ను ప్రత్యేకంగా ప్రవేశపెట్టారు.
రూ.53,752 కోట్లతో ప్రత్యేక బడ్జెట్
గతేడాది కన్నా 5,410 కోట్లు ఎక్కువ
అమరావతి, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు 2026-27 బడ్జెట్‌లో రూ.53,752.12 కోట్లను కూటమి ప్రభుత్వం కేటాయించింది. శనివారం శాసనసభలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈ మేరకు వ్యవసాయ బడ్జెట్‌ను ప్రత్యేకంగా ప్రవేశపెట్టారు. శాసనమండలి ముందు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యవసాయ బడ్జెట్‌ను ఉంచారు. వ్యవసాయ, అనుబంధ రంగాలకు ఈ ఏడాది కూడా ప్రాధాన్యం ఇచ్చారు. 2025-26 బడ్జెట్‌లో వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.48,341.14 కోట్లు కేటాయించిన కూటమి ప్రభుత్వం.. ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.5,410 కోట్లు పెంచింది. కీలక రంగాలకు నిధులను పెంచింది. ఉచిత వ్యవసాయ విద్యుత్‌కు గతేడాది రూ.12,773.25 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది రూ.13,722 కోట్లు ప్రతిపాదించింది. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణకు నిరుడు రూ.12,903.41 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది రూ.14,276 కోట్లు ప్రతిపాదించింది. వ్యవసాయ శాఖకు గతేడాది రూ.12, 401.58 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది రూ.12, 152 కోట్లు కేటాయించింది. పశుసంవర్థక శాఖకు గతేడాది రూ.1, 112.07 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది రూ.1,121 కోట్లు, ఉద్యాన శాఖకు గతేడాది రూ.931 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది రూ.1,123 కోట్లు, మత్స్యశాఖకు గతేడాది రూ.540.19 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది రూ.523 కోట్లు, మార్కెటింగ్ శాఖకు నిరుడు రూ.315.32 కోట్లు కేటాయించగా, ఈ సారి రూ.515 కోట్లు ప్రతిపాదించింది. రైతులకు నేరుగా లబ్ధి కలిగించే అన్నదాత-సుఖీభవ పథకానికి రూ.6,600 కోట్లు, ధరల స్థిరీకరణ నిధికి రూ.500 కోట్లు, పంటల బీమాకు రూ.250 కోట్లు, వడ్డీ లేని రుణాలకు రూ.250 కోట్లు ప్రస్తుత బడ్జెట్‌లో కేటాయించింది.