వెస్ట్ బైపాస్ డిజైన్‌లో లోపాలున్నాయి
ABN , Publish Date - Jun 04 , 2026 | 04:13 AM
చిన్నఅవుటుపల్లి-గొల్లపూడి-కాజ వరకూ విజయవాడ వెస్ట్ బైపాస్ రహదారి నిర్మాణం డిజైన్‌లో లోపాలున్నాయని రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పనా శాఖ అంగీకరించింది.
కాజ వద్ద అడ్డంకుల్లేని ఫ్లైఓవర్ కడతాం
పాత సెట్‌టాప్ బాక్సుల్లోని సాఫ్ట్‌వేర్ వల్లే ఫైబర్‌నెట్ టీవీ ప్రసారాల్లో జగన్ బొమ్మ
ఈ లోపాలను సరిదిద్దుతాం
2000 కోట్లతో భారత్‌నెట్ 2 కింద టెండర్లు
రాష్ట్రంలో పోర్టులు అభివృద్ధి చేస్తున్నాం
ఐఅండ్‌ఐ శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి
అమరావతి, జూన్ 3(ఆంధ్రజ్యోతి): చిన్నఅవుటుపల్లి-గొల్లపూడి-కాజ వరకూ విజయవాడ వెస్ట్ బైపాస్ రహదారి నిర్మాణం డిజైన్‌లో లోపాలున్నాయని రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పనా శాఖ అంగీకరించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయిన సందర్భంగా రాష్ట్రంలో చేపడుతున్న మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధిపై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ ఎండీ ప్రవీణ్ ఆదిత్య, ఫైబర్‌నెట్ ఎండీ గీతాంజలి శర్మతో కలసి మంత్రి బీసీ జనార్దనరెడ్డి బుధవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసిన వెస్ట్ బైపాస్ కాజ ప్రారంభంలో విజయవాడ వైపునకు వెళ్లడంలో ఎదురయ్యే గందరగోళం, సర్వీసు రోడ్డును తొలగించడం వంటి అవస్థల కారణంగా రోజూ ప్రమాదాలు జరగడం వంటి అంశాలను విలేకరులు ప్రస్తావించారు. ‘వెస్ట్ బైపాస్ డిజైన్‌లోనే లోపాలున్నాయి. అందుకే వాటిని సరిదిద్దే కార్యాచరణను చేపట్టాం. నిరంతరాయంగా వాహనాలు వెళ్లేలా వెస్ట్‌బైపాస్ కాజ ముగింపు వద్ద ఫ్లైఓవర్‌ను నిర్మించాలని నిర్ణయించాం’ అని కృష్ణబాబు స్పందించారు. ఇంకా ఫైబర్‌నెట్ ప్రసారాల్లో జగన్‌ను ముఖ్యమంత్రిగా చూపడంపై అధికారులు సహేతుకమైన సమాధానం చెప్పలేకపోయారు. కొత్త సెట్‌టాప్ బాక్సుల్లో సాఫ్ట్‌వేర్‌ను మార్చామని, కొన్ని బాక్సులను సస్పెండ్ చేశామని, వాటిలో సాఫ్ట్‌వేర్ మార్చకపోవడం వల్ల ఫైబర్‌నెట్ ప్రసారాల్లో జగన్ కన్పించారని ఎండీ గీతాంజలి శర్మ వెల్లడించారు. ఈ తప్పునూ సరిదిద్దుతామన్నారు. మంత్రి జనార్దనరెడ్డి జోక్యం చేసుకుంటూ.. ఇలాంటి తప్పులు పునరావృత్తం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భారత్ నెట్ 2 కింద రూ.2000 కోట్లతో ఫైబర్‌నెట్ ప్రసారాల్లో నాణ్యత కోసం టెండర్లను పిలిచామని గీతాంజలి శర్మ వెల్లడించారు. బోగాపురం ఎయిర్‌పోర్టుకు అనుసంధానం చేసే రహదారి అంశంలో ఇబ్బందులు వాస్తవమేనని కృష్ణబాబు అంగీకరించారు.
పోర్టులు, ఎయిర్‌పోర్టుల అభివృద్ధి
రాష్ట్రంలో పోర్టులు, ఎయిర్‌పోర్టులను రెండేళ్లలోనే అభివృద్ధి చేస్తున్నామని జనార్దనరెడ్డి వివరించారు. గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులను ఈపీసీ విధానంలో నిర్మిస్తున్నామని చెప్పారు. మౌలిక సదుపాయాల రంగంలో భారీ పెట్టుబడులు వస్తున్నాయన్నారు. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట వంటి ఓడరేవులకు ఒక్కొక్కటి రూ.3,000 కోట్ల నుంచి రూ.5,000 కోట్లు దాకా వ్యయం చేస్తున్నామని తెలిపారు. రామాయపట్నం పోర్టు పనులు 79 శాతం పూర్తయ్యాయని వివరించారు. కాకినాడ గేట్‌వే పోర్టును రూ.2,620 కోట్లతో నిర్మిస్తున్నామని వెల్లడించారు. వీటిని 2028నాటికి పూర్తి చేస్తామన్నారు. పలు ప్రాంతాల్లో రూ.1522 కోట్లతో ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తున్నామని తెలిపారు. ఉప్పాడ హార్బర్‌ను రూ.361 కోట్లతో, నిజాంపట్నం హార్బర్‌ను రూ.451 కోట్లతో, మచిలీపట్నం హార్బర్‌ను రూ.422 కోట్లతో నిర్మిస్తున్నామని చెప్పారు.
పీపీపీలో 6 రహదారి ప్రాజెక్టులు
రాష్ట్రంలో 405 కి.మీ. పొడవైన ఆరు కీలక రహదారి ప్రాజెక్టులను పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానంలో చేపట్టనున్నట్లు మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి వెల్లడించారు. మొత్తం రూ.2,506 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)లు సిద్ధం చేశామని తెలిపారు. వాటిని త్వరలో కేంద్రానికి సమర్పించి ఆమోదం లభించిన వెంటనే పనులు చేపట్టేందుకు టెండర్లు పిలుస్తామని చెప్పారు. జగన్ హయాంలో ఐదేళ్ల పాటు రహదారుల విధ్వంసం జరిగితే, తమ ప్రభుత్వంలో రూ.861 కోట్లతో 20వేల కి.మీ. రహదారులపై గుంతలను పూడ్చివేసి, కాంట్రాక్టర్ల బిల్లులు కూడా చెల్లిస్తున్నామని తెలిపారు. జగన్ ప్రభుత్వంలో ఆర్‌అండ్‌బీకి పనిలేకుండా పోయిందని ఎద్దేవా చేశారు.