‘ఆదరణ’తో శాశ్వత ఉపాధి
ABN , Publish Date - May 20 , 2026 | 05:54 AM
ఆదరణ 3.0 పథకం ద్వారా బీసీలకు శాశ్వత ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎస్.సవిత అన్నారు.
బీసీలను వ్యాపారవేత్తలుగా చేయడమే లక్ష్యం
ఆదరణ 3.0 అమలుపై మంత్రి సవిత సమీక్ష
అమరావతి, మే 19 (ఆంధ్రజ్యోతి): ఆదరణ 3.0 పథకం ద్వారా బీసీలకు శాశ్వత ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎస్.సవిత అన్నారు. మంగళవారం సచివాలయంలో ఆదరణ 3.0 అమలుపై ఆ శాఖ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. బీసీలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ పథకం ద్వారా వారికి ఆధునిక పనిముట్లు అందజేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధికారులు ఆదరణ 3.0 పథకంలో భాగంగా కుల వృత్తులకు ఎలాంటి పరికరాలు ఇవ్వనున్నారో వివరించారు. యువతకు ఉపాధి లభించేలా యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మంత్రి సవిత మాట్లాడుతూ.. ఆదరణ 3.0 పథకం కోసం రూ.1000 కోట్లు వ్యయం చేస్తున్నామని తెలిపారు. వ్యక్తిగతంగా, గ్రూపులుగా లబ్ధి కలిగేలా ఆదరణ యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు. కులవృత్తిదారులకు ఆధునిక పనిముట్లు అందచేస్తామని, వృత్తి నైపుణ్యం పెంచుకునేలా శిక్షణ అందజేస్తామని తెలిపారు. లబ్ధిదారులకు రూ.10 నుంచి రూ.50 వేల వరకు ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆదరణ ఉత్పత్తులకు ప్రభుత్వమే మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తుందని తెలిపారు.