Share News

298.96 టీఎంసీలకే ఆమోదిస్తాం

ABN , Publish Date - May 21 , 2026 | 04:29 AM

తెలంగాణకు ట్రైబ్యునల్‌ గతంలో కేటాయించిన 298.96 టీఎంసీల కృష్ణా జలాల వినియోగానికి మాత్రమే సమ్మతిస్తామని, అంతకుమించి ఆమోదించబోమని కృష్ణా జలవివాద ...

298.96 టీఎంసీలకే ఆమోదిస్తాం

  • బ్రిజేష్ కుమార్‌ ట్రైబ్యునల్‌ ముందు ఏపీ

అమరావతి, మే 20(ఆంధ్రజ్యోతి): తెలంగాణకు ట్రైబ్యునల్‌ గతంలో కేటాయించిన 298.96 టీఎంసీల కృష్ణా జలాల వినియోగానికి మాత్రమే సమ్మతిస్తామని, అంతకుమించి ఆమోదించబోమని కృష్ణా జలవివాద ట్రైబ్యునల్‌ (బ్రిజేష్‌ కుమార్‌)-2కు ఆంధ్రప్రదేశ్‌ స్పష్టం చేసింది. ఏఎంఆర్‌ ఎస్‌ఎల్‌బీసీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు సమర్పించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలు అసమగ్రంగా ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేసింది. వాటిని పరిగణనలోనికి తీసుకోవద్దని అభ్యర్థించింది. బుధవారం ఢిల్లీలో బ్రిజేష్ కుమార్‌ ట్రైబ్యునల్‌-2 ఎదుట ఏపీ తరఫున సీనియర్‌ కౌన్సిల్‌ జయదీప్‌ గుప్తా వాదనలు వినిపించారు. తెలంగాణ చెబుతున్న ఏడు ప్రాజెక్టుల్లో 2 మాత్రమే విభజన చట్టం పరిధిలోనికి వస్తాయని, అవన్నీ 75 శాతం డిపెండబిలిటీ పరిధిలోనికి రావని ఏపీ వాదించింది. నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల విస్తరణకు తెలంగాణ సమర్పించిన డీపీఆర్‌ను ట్రైబ్యునల్‌ స్వీకరించింది. అయితే 2020 అక్టోబరు 16న కేంద్ర జలశక్తి మంత్రి అధ్యక్షన జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ మార్గదర్శకాల మేరకు ఈ రెండు ప్రాజెక్టులూ కొత్తవేనని, వీటిని ఇప్పటికే వినియోగంలో ఉన్న ప్రాజెక్టులుగా పేర్కొనడాన్ని ఏపీ తప్పుబట్టింది. కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతల 1.62 టీఎంసీలపైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రతిపాదనలకు 2017, 2024లో జరిగిన సమావేశాల్లో ఆమోదం లభించలేదని గుర్తుచేసింది. నారాయణపేట- కొడంగల్‌ ఎత్తిపోతల పథకాన్ని కూడా జయదీప్‌ గుప్తా వ్యతిరేకించారు. ఈ ప్రాజెక్టు కూడా కొత్తదేనని, అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదం పొందాల్సిందేనని పట్టుబట్టారు.

Updated Date - May 21 , 2026 | 04:29 AM