Share News

ఏసీబీ దూకుడు

ABN , Publish Date - Jun 30 , 2026 | 05:16 AM

ఈ ఏడాది అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) దూకుడు పెంచింది. రాష్ట్రంలో దాదాపుగా ప్రతి రెండు రోజులకు ఒకసారి ఎక్కడో ఒక చోట లంచం తీసుకుంటున్న అవినీతి అధికారుల్ని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంటోంది.

ఏసీబీ దూకుడు

  • రాష్ట్రంలో 6 నెలల్లో 78 మంది అరెస్ట్‌

  • లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా 60 మంది

  • 13 మంది అవినీతి తిమింగలాలు జైలుపాలు

  • కేసుల్లో విశాఖ టాప్‌.. తర్వాత కర్నూలు, అనంత

  • ఆకస్మిక తనిఖీలు, పెరిగిన శిక్షలతో అక్రమార్కుల బెంబేలు

  • లంచం అడిగితే 1064కు కాల్‌ చేయండి: డీజీ

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఈ ఏడాది అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) దూకుడు పెంచింది. రాష్ట్రంలో దాదాపుగా ప్రతి రెండు రోజులకు ఒకసారి ఎక్కడో ఒక చోట లంచం తీసుకుంటున్న అవినీతి అధికారుల్ని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంటోంది. జనవరి నుంచి జూన్‌ వరకూ రాష్ట్రవ్యాప్తంగా 78కి పైగా కేసులు నమోదు చేసి రికార్డు సృష్టించింది. నెలకు పదికి తగ్గకుండా ఏసీబీ అధికారులు ట్రాప్‌ కేసులు నమోదు చేస్తున్నారు. ఆరు నెలల్లో పదమూడు మంది అవినీతి తిమింగలాల్ని అక్రమాస్తుల కేసుల్లో జైలుకు పంపారు. ఏ ప్రభుత్వ అధికారి లంచం అడిగినా తమకు ఫిర్యాదు చేస్తే చాలు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంటామని భరోసా ఇస్తున్నారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు, మున్సిపాలిటీల్లోని పట్టణ ప్రణాళిక విభాగాల్లో ప్రజల్ని పీడించే అవినీతి జలగలపై ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. గతేడాది రాష్ట్రంలో ఏసీబీ పనితీరును ఈ జనవరి మొదటి వారంలో డీజీ అతుల్‌ సింగ్‌ వివరిస్తూ.. తమ పనితీరులో వేగం, శైలి మారుతుందని చెప్పిన విధంగానే ఏసీబీ అధికారులు మార్పు చూపిస్తున్నారు. పక్కా ప్రణాళికతో ఉచ్చు బిగించి అవినీతి చేపల్ని పడుతున్నారు. రెవెన్యూ, పోలీసు, మున్సిపాలిటీ, వ్యవసాయశాఖ, ఆఖరికి కార్మిక శాఖను సైతం వదలకుండా పట్టి పీడిస్తున్న అవినీతి చీడను వదిలించే ప్రయత్నం చేస్తున్నారు.


ముఖ్యంగా అవినీతి కేసుల్లో శిక్షలు పెరగడం వెనుక అవినీతి నిరోధక శాఖలోని లీగల్‌ టీమ్‌ పనితీరుకు నిదర్శనం. కోర్టుల్లో కేసులు వీగిపోతాయన్న అపవాదును చెరిపేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద నగరమైన విశాఖపట్నంలో అవినీతి కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఆరు నెలల్లో 9 అవినీతి కేసులు విశాఖపట్నంలో నమోదయ్యాయి. ఆ తర్వాత రాయలసీమలో ఉమ్మడి కర్నూలు జిల్లా 8 కేసులతో రెండో స్థానంలో, ఉమ్మడి అనంతపురం జిల్లా 7 అవినీతి కేసులతో మూడో స్థానంలో నిలిచాయి. అక్రమార్జన కేసుల్లో తిమింగలాల నుంచి ఆస్తుల పత్రాలతో పాటు బంగారు, నగదు స్వాధీనం చేసుకుని జైలుకు పంపారు.


కోర్టుల్లో పెరిగిన శిక్షలు

అవినీతి కేసుల్లో అరెస్టయిన వారికి శిక్షలు పడటం బాగా తక్కువ. ఏదో ఒక రూపంలో కేసులు కోర్టుల్లో వీగి పోతుంటాయి. సరైన ఆధారాలు చూపించలేక పోవడంతో చాలా కేసులను టెక్నికల్‌ ఎవిడెన్స్‌ లేవంటూ కోర్టులు కొట్టేస్తుంటాయి. మరికొన్ని కేసుల్లో ఫిర్యాదుదారులే రాజీపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఏడాది ఆర్నెల్లలోనే 9 కేసుల్లో అవినీతిపరులకు శిక్షలు పడ్డాయి. లంచం తీసుకొంటూ పట్టుబడిన 8మందితో పాటు భారీగా అవినీతి సొమ్ము పోగేసిన ఆనకొండ సైతం జైలు పాలయ్యారు. అత్యధికంగా కర్నూలు ఏసీబీ కోర్టు నలుగురిని శిక్షించగా.. విజయవాడ ఏసీబీ కోర్టు ముగ్గురికి.. విశాఖపట్నం, రాజమహేంద్రవరం కోర్టులు ఒక్కొక్కరికి జైలు శిక్ష విధించాయి. జైలు పాలైన వారిలో తహసీల్దార్‌, సబ్‌ రిజిస్ట్రార్‌, సహాయ కార్మిక అధికారి, పంచాయతీ రాజ్‌ ఇంజనీరు, ఏపీఎస్‌హెచ్‌సీ సహాయ ఇంజనీరు, జిల్లా ఆసుపత్రి సేవల సమన్వయకర్త, వీఆర్‌వోతో పాటు కొన్ని కేసుల్లో ప్రైవేటు వ్యక్తులు(మధ్యవర్తి) కూడా ఉన్నారు.

బాధితులకు పరిహారం

అవినీతిపరుల్ని శిక్షించిన కోర్టులు గతంలో ఎన్నడూ లేని విధంగా బాధితులకు పరిహారం ఇప్పించడం ఈ ఏడాది వెలువరించిన తీర్పుల్లో అరుదైన పరిణామం. ఒక కేసులో గరిష్ఠంగా ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించడంతో పాటు బాధితుడికి రూ.2లక్షలు పరిహారం చెల్లించాలంటూ తీర్పు వెలువరించింది.

లంచం అడిగితే ఫిర్యాదు చేయండి: డీజీ

ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ డీజీ అతుల్‌ సింగ్‌ ప్రజలకు సూచించారు. ఎక్కడి నుంచైనా ఏసీబీ టోల్‌ ఫ్రీ నంబర్‌ 1064కు కాల్‌ చేయవచ్చన్నారు. కనీస ఆధారాలతో ముందుకు వస్తే ఏసీబీ చర్యలు తీసుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందని, వ్యక్తిగత కక్షతో చేసే ఫిర్యాదులకు విలువ ఉండదని అన్నారు. ఎంతో కష్టపడి పోటీ పరీక్షల్లో ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకున్న వారు లంచాలకు ఆశపడి జైలు పాలు కావొద్దని హెచ్చరించారు.

Updated Date - Jun 30 , 2026 | 05:17 AM