Share News

ఇక పట్టా భూములపై ‘నిషేధం’ ఉండదు

ABN , Publish Date - Jul 23 , 2026 | 05:33 AM

ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఇకపై పట్టా భూములు నిషేధ జాబితా 22(ఏ)లో ఉంచకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి అనగాని సత్యప్రసాద్‌ భరోసా ఇచ్చారు.

ఇక పట్టా భూములపై ‘నిషేధం’ ఉండదు

  • 22(ఏ) మార్గదర్శకాలు మరింత సులభతరం

  • డాక్యుమెంట్‌ రైటర్లకు ఏ ఇబ్బందీరాదు

  • రెవెన్యూ మంత్రి అనగాని వెల్లడి

అమరావతి, జూలై 22 (ఆంధ్రజ్యోతి): ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఇకపై పట్టా భూములు నిషేధ జాబితా 22(ఏ)లో ఉంచకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి అనగాని సత్యప్రసాద్‌ భరోసా ఇచ్చారు. ప్రైవేటు భూములను నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా అధికారులు నిషేధ జాబితాలో చేర్చకుండా నిబంధనలను పకడ్బందీగా రూపొందించామని తెలిపారు. ఎవరైనా వాటిని ఉల్లంఘించి ప్రజలకు ఇబ్బంది కలిగించినట్లు తేలితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. స్టాంప్స్‌, రిజిస్ట్రేషన్‌ శాఖ ఐజీ అంబేద్కర్‌తో కలిసి మంత్రి అనగాని బుధవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. భూముల పరిరక్షణ, సమస్యల పరిష్కారంలో జవాబుదారీ తీసుకొచ్చేందుకు పాత నిబంధనలు, మార్గదర్శకాలను సవరించి కొత్తగా విధివిధానాలు తీసుకొస్తున్నామన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ‘‘22(ఏ) నిబంధనలను సరళీకరించి, కొత్త మార్గదర్శకాలను విడుదల చేస్తున్నాం. భూమి రికార్డుల్లో అక్రమ మార్పులకు ఆస్కారమిచ్చే మాన్యువల్‌ ఎంట్రీలకు స్వస్తిపలుకుతున్నాం. తాజా మార్గదర్శకాల ప్రకారం కొన్ని రకాల భూములను నిషేధ జాబితా నుంచి తొలగిస్తాం. ఇకపై ఏ ఆస్తినైనా 22(ఏ)లో చేర్చేముందు యజమానికి రిజిస్టర్డ్‌ పోస్టు, లిఖితపూర్వక నోటీసు పంపించేలానిబంధన తెచ్చాం. నిషేధ భూముల జాబితాలో భూముల చేర్పు, తొలగింపు అధికారాలు కేవలం సబ్‌ కలెక్టర్‌, ఆర్డీఓ స్థాయి అధికారులకే పరిమితం చేశాం. అభ్యంతరాలపై అప్పీల్‌ చేసే విధానం తీసుకొచ్చాం.


వైసీపీ విష ప్రచారం చేస్తోంది.

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ప్రైవేటీకరణ జరుగుతోందంటూ వైసీపీ విషప్రచారం చేస్తోంది. గొడ్డలిపార్టీ ఆరోపణలకు డాక్యుమెంట్‌ రైటర్లు ఆందోళనకు గురవుతున్నారు. డాక్యుమెంట్‌ రైటర్లకు ఎలాంటి నష్టం జరగదు. డాక్యుమెంట్‌ రైటర్ల వృత్తికి రూపాయి కూడా నష్టం జరగకుండా ప్రభుత్వం సంపూర్ణ రక్షణ కల్పిస్తుంది. టీడీపీ సీనియర్‌నేత, గోవా గవర్నర్‌ అశోక గజపతిరాజు భూమి విషయంలో తప్పు జరిగింది. తహశీల్దార్‌ స్థాయిలోనే నిర్ణయం తీసుకొని తప్పుచేశారు. ఈ విషయంలో అధికారుల పాత్ర, వారి వైఫల్యంపై విచారణ చేసి చర్యలు తీసుకుంటాం’’ అని మంత్రి వెల్లడించారు.

Updated Date - Jul 23 , 2026 | 05:35 AM