‘పది’లో మంత్రులు, ఎమ్మెల్యేల సత్తా!
ABN , Publish Date - May 03 , 2026 | 04:19 AM
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో స్పీకర్, డిప్యూటీ సీఎం, ప్రతిపక్ష నేత, మంత్రులు, ఎమ్మెల్యేలు అదరకొట్టారు! రాష్ట్రస్థాయిలో టాప్ మార్కులతో విజృంభించారు!! ఏంటి ఇదంతా? వారంతా పరీక్షలు రాయడం ఏంటి? టాప్ మార్కులు సాధించడం ఏంటి? అని అనుకుంటున్నారా..!
గత నవంబరులో జరిగిన ‘మాక్ అసెంబ్లీ’లో పాల్గొన్న విద్యార్థులకు అత్యుత్తమ మార్కులు
594 మార్కులతో ‘అసెంబ్లీ స్పీకర్’ స్వాతి టాప్
‘డిప్యూటీ సీఎం’ వీర ఉదయశ్రీ 592 మార్కులు
571 మార్కులతో ‘ప్రతిపక్ష నేత’ సౌమ్య
580పైగా మార్కులు సాధించిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల పాత్రధారులు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో స్పీకర్, డిప్యూటీ సీఎం, ప్రతిపక్ష నేత, మంత్రులు, ఎమ్మెల్యేలు అదరకొట్టారు! రాష్ట్రస్థాయిలో టాప్ మార్కులతో విజృంభించారు!! ఏంటి ఇదంతా? వారంతా పరీక్షలు రాయడం ఏంటి? టాప్ మార్కులు సాధించడం ఏంటి? అని అనుకుంటున్నారా..! రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని గతేడాది నవంబరు 26న రాజధాని అమరావతిలోని అసెంబ్లీ ఆవరణలో విద్యార్థులతో ‘మాక్ అసెంబ్లీ’ నిర్వహించిన విషయం గుర్తుంది కదా! ఆ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రభుత్వ పాఠశాలల నుంచి ఎంపిక చేసిన విద్యార్థులు సీఎం, ప్రతిపక్ష నేత, స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేల పాత్రలు పోషించారు. అసెంబ్లీ కార్యకలాపాలు సాగినట్టే.. ఆ రోజున మాక్ అసెంబ్లీ కూడా అసక్తికరంగా సాగింది. అధికార, విపక్ష సభ్యుల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో దద్దరిల్లింది. ప్రజా సమస్యలను ఎమ్మెల్యేల స్థానంలో విద్యార్థులు ఎత్తిచూపడం ఆకట్టుకుంది. నాడు మాక్ అసెంబ్లీలో పాల్గొన్న విద్యార్థుల్లో చాలామంది ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్షల ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ చాటారు. కొంతమంది రాష్ట్ర స్థాయిలో టాపర్లుగా నిలిచారు. స్పీకర్ స్థానంలో సభా వ్యవహారాలు నడిపిన కాకినాడ జిల్లా శంఖవరం మండలం ఏపీ మోడల్ హైస్కూల్‌కు చెందిన సైపిరెడ్డి స్వాతి 594 మార్కులతో టాపర్‌గా నిలిచింది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మోడల్ పాఠశాలల్లో ప్రథమ స్థానం సాధించింది. డిప్యూటీ సీఎం పాత్ర పోషించిన కడప జిల్లా శెట్టివారిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని పసల వీర ఉదయశ్రీ 592 మార్కులతో అదరగొట్టింది. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఉదయశ్రీ.. ప్రభుత్వ పాఠశాలల వారీగా జిల్లాలో రెండోస్థానంలో నిలిచింది. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ జడ్పీ హైస్కూల్‌కు చెందిన విద్యార్థిని సాయి సౌమ్య ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ఆమెకు 571 మార్కులు వచ్చాయి. రవాణాశాఖ మంత్రిగా వ్యవహరించిన చిత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎన్.ప్రియదర్శిని 572 మార్కులు సాధించి స్కూల్ ఫస్టుగా నిలిచింది. అనంతపురం ఎమ్మెల్యేగా చేసిన విద్యార్థిని సదాఫ్ నాజ్ 588 మార్కులతో సత్తాచాటింది. తాడిపత్రి ఎమ్మెల్యే పాత్ర పోషించిన యాడికికి చెందిన విద్యార్థి అనిల్ కుమార్ 584 మార్కులతో అదరకొట్టాడు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా చేసిన తలారి అభిజ్ఞ 583 మార్కులు సాధించారు. ఇంకా మాక్ అసెంబ్లీలో పాల్గొన్న శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ జడ్పీ హైస్కూల్‌కు చెందిన రెడ్డి చంద్ర లాస్యకు 586, తమ్మినాన నవ్యశ్రీకి 587 మార్కులు వచ్చాయి. టెక్కలి జడ్పీ బాలికోన్నత పాఠశాల ప్లస్‌కు చెందిన ఆర్.రష్మిక సంతోషి 585 మార్కులు సాధించింది. నరసన్నపేట మండలం కంబకాయిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన వైశ్యరాజు భరత్‌సాయి 583 మార్కులు సాధించాడు. ఎమ్మెల్యేగా వ్యవహరించిన పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం ఎం.సింగుపురం జడ్పీ హైస్కూలు విద్యార్థిని గంధారపు నిహారికకు 586 మార్కులు వచ్చాయి.
25 మంది టాపర్లకు విహారయాత్ర ఆఫర్
ఎమ్మెల్యే మాధవి ప్రకటన
గుంటూరు, మే 2(ఆంధ్రజ్యోతి): గుం టూరు పశ్చిమ నియోజకవర్గంలోని ప్రభు త్వ పాఠశాలల్లో టెన్త్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన 25 మంది విద్యార్థులను ప్రత్యేకంగా ప్రోత్సహిస్తూ ఎమ్మెల్యే గళ్ళా మాధవి కీలక ప్రకటన చేశారు. గతం లో ఇచ్చిన హామీ మేరకు టాపర్ విద్యార్థులను త్వరలో విహారయాత్రకు తీసుకెళ్లనున్నట్లు శనివారం ఆమె తన కార్యాలయంలో జరిగిన విద్యార్థుల అభినందన కార్యక్రమం లో ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు కృషి, పట్టుదలతో గొప్ప విజయాలు సాధించగలరని నిరూపించారని అభినందించారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వా సం పెంపొందించేందుకు, మరింత ఉత్సాహాన్ని కలిగించేందుకు విహారయా త్రను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.