మట్టిలో మాణిక్యాలు!
ABN , Publish Date - May 03 , 2026 | 04:14 AM
మట్టిలో మాణిక్యాలు.. అనే దానికి సరైన అర్థం ఆ విద్యార్థులు! నిరుపేద కుటుంబాల్లో పుట్టిన వారంతా.. తమ తల్లిదండ్రులు ఏళ్లుగా పడుతున్న కష్టానికి తగిన ఫలితం అందించి, వారికి మర్చిపోలేని సంతోషాన్నిచ్చారు.
స్టేట్ టాపర్లుగా రైతులు, కూలీల బిడ్డలు
పదో తరగతి ‘ప్రభుత్వ’ టాపర్లలో సగం మంది నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన వారే
కార్పొరేట్‌కు దీటైన మార్కులు సాధించి శభాష్ అనిపించుకుంటున్న విద్యార్థులు
సర్కార్ బడిని సగర్వంగా నిలబెట్టిన చిన్నారులు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
మట్టిలో మాణిక్యాలు.. అనే దానికి సరైన అర్థం ఆ విద్యార్థులు! నిరుపేద కుటుంబాల్లో పుట్టిన వారంతా.. తమ తల్లిదండ్రులు ఏళ్లుగా పడుతున్న కష్టానికి తగిన ఫలితం అందించి, వారికి మర్చిపోలేని సంతోషాన్నిచ్చారు. ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షల ఫలితాల్లో పలువురు రైతులు, కూలీల బిడ్డలు, చిరుద్యోగుల పిల్లలు ‘రాష్ట్రస్థాయి టాపర్లు’గా నిలిచారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వీరంతా.. కార్పొరేట్ స్కూళ్లతో సమానంగా అత్యుత్తమ మార్కులు సాధించి అందరి చేతా ‘శభాష్’ అనిపించుకుంటున్నారు! ప్రభుత్వ బడుల్లో చదివి.. స్టేట్ టాపర్లుగా నిలిచిన విద్యార్థుల్లో సగం మంది నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన వారున్నారు. పేదరికం అడ్డుగా ఉన్నప్పటికీ.. ఉపాధ్యాయుల శిక్షణలో కష్టపడి చదివి అత్యుత్తమ మార్కులు సాధించారు. నిరుపేద, చిన్నా చితకా ఉద్యోగాలు చేసుకొనే వారి కుటుంబాలకు చెందిన 13 మంది విద్యార్థులు 600 మార్కులకు గానూ 596, 595 మార్కులు సాధించారు. లక్షలకు లక్షలు ఫీజులు కట్టి చదివించే స్తోమత లేని కుటుంబాల్లో పుట్టిన వారంతా.. ఎలాగైనా సాధించాలనే పట్టుదలతో కార్పొరేట్ స్కూళ్ల విద్యార్థులకు దీటుగా మార్కులు సాధించారు.
టాపర్లుగా నిలిచిన పేద విద్యార్థులు వీరే...
దుల్ల చిన్నారి: కాకినాడ జిల్లాలోని సంపర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివి 596 మార్కులు సాధించించి టాపర్‌గా నిలిచింది. ఆమె తండ్రి శ్రీనివాస్ దినసరి కూలీగా ఉంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.
సిరిగినీడి రిషిత లక్ష్మీ నిహారిక: అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని సమంతకుర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివి 596 మార్కులు సాధించింది. విద్యార్థిని తండ్రి వెంకట దుర్గారావు పెయింటర్‌గా పనిచేస్తున్నారు.
బవిరెడ్డి దివ్య తేజశ్రీ: బాపట్ల జిల్లాలోని కొల్లూరు బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివి 596 మార్కులు సాధించింది. ఈ బాలిక తండ్రి వరప్రసాద్ వ్యవసాయం చేసుకొనే ఓ రైతు.
తనకంటి సాయిశ్రీ: నంద్యాల జిల్లాలోని నెరవాడ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలో చదివి 596 మార్కులు సాధించింది. సాయిశ్రీ తండ్రి చక్రపాణి ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు.
ఎస్.దిషిత సాయి: తిరుపతి జిల్లాలోని వరదయ్యపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివి 595 మార్కులు తెచ్చుకుంది. దిషిత తండ్రి జగన్నాథం సెకండరీ గ్రేడ్ టీచర్‌గా ఉద్యోగం చేస్తున్నారు.
నంద్యాల కార్తీక: అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పి.లక్ష్మీవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివి 595 మార్కులు సాధించింది. ఆమె తండ్రి బ్రహ్మానందం జనరల్ స్టోర్‌ను నడుపుతుంటారు.
పత్రి హర్షిణి: కాకినాడ జిల్లాలోని తుని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివి 595 మార్కులు తెచ్చుకుంది. ఆమె తండ్రి రవి కిషోర్ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.
ఆర్.డి.వైష్ణవి: అన్నమయ్య జిల్లాలోని హెచ్.ఎ్‌స.కోటపల్లి బాలికల జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదివి 595 మార్కులు సాధించింది. వైష్ణవి తండ్రి మునిరాజా ఇండియన్ గ్యాస్ కంపెనీలో పనిచేస్తున్నారు.
కోల లక్ష్మీ వెంకటేశ్వర్: కడప జిల్లాలోని నాగులగుట్టపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివి 595 మార్కులు సాధించాడు. ఈ విద్యార్థి తండ్రి కులశేఖర్ దినసరి కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.
గాలిదేవర హర్షిణి సత్యదుర్గ: బీఆర్ అంబేద్కర్ కోనసీమలోని పి.లక్ష్మీవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివి 595 మార్కులు సాధించింది. సత్యదుర్గ తండ్రి శ్రీనివాసు హెచ్‌పీ గ్యాస్ కంపెనీలో డెలివరీ వర్కర్‌గా పనిచేస్తున్నారు.
కొర్రకూటి యశ్విత: నెల్లూరు జిల్లాలోని నాగుల వెల్లటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివి 595 మార్కులు సాధించింది. యశ్విత తండ్రి వెంకటేశ్వర్లు ఓ రైతు.
వేగిరాజు కావ్య హాసిని: కాకినాడలోని శ్రీనగర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో చదివి 595 మార్కులు సాధించింది. ఆమె తండ్రి రామలింగరాజు ఓ ప్రైవేటు కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు.
మహమ్మద్ ఏ ఫర్హీన్: విజయవాడలోని ఎస్‌టీబీ ఉన్నత పాఠశాలలో చదివి 595 మార్కులు సాధించింది. ఈ విద్యార్థిని తండ్రి ఫరూక్ అలీ ఓ షాపింగ్ మాల్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు.