మరో ట్రావెల్స్ బస్సు ‘టెర్రర్’!
ABN , Publish Date - Feb 08 , 2026 | 04:00 AM
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల వద్ద శనివారం ఉదయం ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. డ్రైవర్ అప్రమత్తతతో 39 మంది ప్రయాణికులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు.
హైదరాబాద్ నుంచి వస్తున్న ఏసీ స్లీపర్ బస్సు ఇంజిన్‌లో పొగలు, మంటలు
సైడ్ మిర్రర్ నుంచి గమనించిన డ్రైవర్, క్లీనర్
ప్రయాణికులను అప్రమత్తం చేసి దించేసిన సిబ్బంది
ఆ వెంటనే మంటల్లో దగ్ధమైన బస్సు
39 మంది ప్రయాణికులు సురక్షితం
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల వద్ద ఘటన
కంచికచర్ల, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల వద్ద శనివారం ఉదయం ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. డ్రైవర్ అప్రమత్తతతో 39 మంది ప్రయాణికులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. వివరాల ప్రకారం.. వరుణ్ ట్రావెల్స్‌కు చెందిన ఇంటర్ సీటీ ఏసీ స్లీపర్ బస్సు హైదరాబాద్ నుంచి 39 మంది ప్రయాణికులతో గుంటూరు బయలుదేరింది. బస్సులో ఒక డ్రైవర్, ఒక క్లీనర్ ఉన్నారు. శనివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో బస్సు నందిగామ దాటి కీసర టోల్‌గేట్ వద్దకు వచ్చింది. అక్కడినుంచి బయలుదేరిన తర్వాత 5.30 గంటల సమయంలో ఇన్వెంటా కెమికల్స్ సమీపానికి రాగానే బస్సు వెనుక భాగం ఇంజన్ వద్ద దట్టంగా పొగలు, మంటలు రావడం ప్రారంభమయ్యాయి. దీన్ని డ్రైవర్ మామిడాల చంద్రమౌళి, క్లీనర్ సైడ్ మిర్రర్ ద్వారా గమనించారు. వెంటనే బస్సును రోడ్డు మార్జిన్‌లో నిలిపి, ప్రయాణికులను అప్రమత్తం చేశారు. దీంతో అందరూ బస్సు నుంచి కిందకు దిగిపోయారు. సైడ్ బాక్సుల్లోని లగేజీ కూడా తీసుకున్నారు. తర్వాత మంటలు బస్సును చుట్టుముట్టాయి. స్లీపర్ కావటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. బస్సు వెనుక, పై భాగాలు పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే కంచికచర్ల, నందిగామ, టోల్‌గేట్ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపు చేశారు. పోలీస్, రవాణా శాఖల అధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. షార్ట్ సర్క్యూట్ లేదా ఇంజన్‌లో తలెత్తిన లోపం వల్ల మంటలు వ్యాపించి ఉంటాయని భావిస్తున్నారు.