లిక్కర్ స్కామ్‌లో మరో ‘స్కీమ్’
ABN , Publish Date - Feb 14 , 2026 | 03:14 AM
ఒక పెద్ద కుంభకోణం... దానికి అనుగుణంగా మరిన్ని కుంభకోణాలు! జగన్ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌లో తవ్వే కొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. డిపోల నుంచి మద్యం దుకాణాలకు లిక్కర్ బాక్సుల సరఫరా.....
మద్యం రవాణాలో రూ.400 కోట్ల దోపిడీ
సూత్రధారుల కథ తేల్చాలని సిట్‌కు ఆదేశం
బాక్స్ రవాణా చార్జీ 13 నుంచి 34కు పెంపు
టెండర్ దక్కించుకున్న కసిరెడ్డి బినామీ కంపెనీ
తర్వాత పలువురు వైసీపీ నేతలకు సబ్ కాంట్రాక్టు
సీఐడీ కేసు నమోదు.. దర్యాప్తు బాధ్యత ‘సిట్’కు!
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
ఒక పెద్ద కుంభకోణం... దానికి అనుగుణంగా మరిన్ని కుంభకోణాలు! జగన్ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌లో తవ్వే కొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. డిపోల నుంచి మద్యం దుకాణాలకు లిక్కర్ బాక్సుల సరఫరా పేరుతో రూ.400 కోట్లు దోచేసినట్లు తేలింది. దీని వెనుక ఎవరున్నారో తేల్చాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. రూ.3200కోట్ల లిక్కర్ స్కామ్‌ను వెలికి తీసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికే (సిట్) ఈ బాధ్యతను అప్పగించింది. దీనిపై ఈ నెల 10న సీఐడీ కేసు (11/2026) నమోదు చేయగా... పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి, అక్రమాలు నిగ్గు తేల్చే బాధ్యతను ప్రభుత్వం సిట్‌పై పెట్టింది. ఐపీసీలోని 420, 409, 468, 471, 120(బి), సెక్షన్లతో పాటు బీఎన్‌ఎస్ చట్టంలోని సెక్షన్ 111, 212, 217, 317 కింద పలువురిపై సీఐడీలో కేసు నమోదైంది.
అసలేం జరిగింది...
2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యం షాపులు ప్రభుత్వమే నిర్వహించేలా లిక్కర్ పాలసీ రూపొందించారు. ముడుపులు ఇచ్చిన వారికే ఆర్డర్లు వెళ్లేలా చేసి... భారీ కుంభకోణానికి తెరలేపారు. ఇందులో... మద్యం రవాణాలోనూ కోట్లు గిల్లుకున్నారు. మద్యం తయారీదారులు డిపోల వరకూ సరుకును చేరవేస్తారు. అక్కడి నుంచి షాపులకు చేర్చేందుకు ప్రతి మద్యం కేసుకు రూ.13 చొప్పున ఏపీఎస్‌బీసీఎల్ చెల్లించేది. దానిని జగన్ హయాంలో ఏకంగా రూ.34కు పెంచేశారు. మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారి రాజ్ కసిరెడ్డికి సన్నిహితుడైన తుకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి అప్పటికే కార్గో వ్యాపారం చేసేవాడు. కిరణ్ కుమార్ రెడ్డిని బినామీగా పెట్టుకుని రాజ్ కసిరెడ్డి ‘సిగ్మా’ పేరుతో ఒక ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని మద్యం షాపులకు లిక్కర్ సరఫరా చేసే టెండర్లు ట్యాంపరింగ్ చేశారు. రూ.13ఉన్న కేసు సరఫరా ధరను ఏకంగా రూ.34కు పెంచి టెండర్ దక్కించుకున్నారు. దీనిని... జిల్లాల వారీగా కొందరు ముఖ్యమైన వైసీపీ నేతలకు సబ్ కాంట్రాక్టు ఇచ్చేశారు. అనంతపురం జిల్లాలో ‘గుడ్ మార్నింగ్ స్టార్’గా పేరొందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. ఇటీవల ముఖ్యమంత్రిని దూషించి జైలు పాలైన గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, రైతులను బూతులు తిట్టి వివాదం చెలరేగడంతో ‘బుజ్జికన్నా’ అంటూ బూతులకు కొత్త అర్థాన్ని తీసిన గోదావరి జిల్లాలకు చెందిన మాజీ మంత్రి కుమారుడు, శాసనమండలిలో వైసీపీకి పెద్ద దిక్కైన ఉత్తరాంధ్ర నాయకుడి మేనల్లుడు... ఇలా పలువురికి సబ్‌కాంట్రాక్టులు దక్కాయి. సరుకు రవాణా చార్జీలను ఒకేసారి రూ.13 నుంచి 34కు పెంచి... మొత్తంగా రూ.400 కోట్లు దోచేసినట్లు అంచనా. ఈ విషయం ఇప్పటికే సిట్ విచారణలో వెలుగులోకి వచ్చింది. ఆయా నేతలకు నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉందని గత ఏడాది సెప్టెంబరు రెండో వారంలోనే ‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని ప్రచురించింది. అన్ని ఆధారాలు సేకరించిన సిట్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన తర్వాత కేసు నమోదుకు ఈ నెల మొదటి వారంలో సీఐడీకి ఆదేశాలు జారీ అయ్యాయి. నమోదైన కేసు దర్యాప్తు బాధ్యతలు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నేతృత్వంలోని సిట్‌కు అప్పగిస్తూ శుక్రవారం హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజీత్ ఉత్తర్వులు జారీ చేశారు.