జగన్ పాపాలకు మరో అధికారి బలి!
ABN , Publish Date - Feb 03 , 2026 | 03:13 AM
వైఎస్ జగన్ తప్పులకు బలైపోయిన అఖిల భారత సర్వీసు అధికారులెందరో! సస్పెన్షన్లతోపాటు కొందరు ఏకంగా జైలుకూ వెళ్లాల్సి వచ్చింది.
నాడు అక్రమాస్తుల కేసుల్లో ఎందరో జైలుకు
నేడు కల్తీ నెయ్యి పాపానికి సింఘాల్‌పై వేటు
కల్తీని అడ్డుకోగలిగీ మౌనమే ఆయన పాపం
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
వైఎస్ జగన్ తప్పులకు బలైపోయిన అఖిల భారత సర్వీసు అధికారులెందరో! సస్పెన్షన్లతోపాటు కొందరు ఏకంగా జైలుకూ వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు.. జగన్ హయాంలో టీటీడీలో జరిగిన ‘కల్తీ నెయ్యి’ దందా వల్ల ఐఏఎస్ అధికారి అనిల్‌కుమార్ సింఘాల్‌పై బదిలీ వేటు పడింది. ఆయన శ్రీవెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడు. అవినీతికి ఆమడదూరంగా ఉంటా రు. కానీ ‘తప్పు చేయడం మాత్రమే కాదు! ఆ తప్పును అడ్డుకోగలిగిన స్థానంలో ఉండి మౌనంగా ఉండటమూ తప్పే!’ అనే సూత్రం ప్రకారం ఆయన తప్పు చేసినవారైపోయారు. ఆయన అక్రమాలకు పాల్పడలేదుకానీ, కల్తీ నెయ్యి విషయంలో అక్రమాలు జరిగేందుకు ఆస్కారం కల్పించారని సుప్రీంకోర్టు నియమించిన ‘సిట్’ నిర్ధారించింది. ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలన్న సిఫారసు మేరకు... సింఘాల్‌ను ప్రభుత్వం టీటీడీ ఈవోగా తప్పించింది.
నాడు సస్పెన్షన్లు, జైలు జీవితాలు
తాను తప్పులు చేసి అధికారులను బలితీసుకునే వారి జాబితాలో జగన్ పేరే ముందుంటుంది. తండ్రి అధికారంలో ఉండగా జగన్ పోగేసుకున్న అక్రమాస్తులు, క్విడ్‌ప్రో కో కేసుల్లో ఇరుక్కొని అనేక మంది ఐఏఎ్‌సలు బలయ్యారు. అరెస్ట్ అయి జైలుపాలయ్యారు. ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. నాడు తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకొని జగన్ వేలకోట్ల అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారని, ఇందుకు నాటి ప్రభుత్వంలో కీలక పాత్రలో ఉన్న ఐఏఎస్, ఐఆర్‌ఎస్ అధికారులు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించారని సీబీఐ 16 కేసుల్లో అభియోగాలు మోపింది. అంతా బాగుంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగానే కాదు, ఏకంగా కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ కూడా అయ్యే అవకాశమున్న 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మీ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. 1983 బ్యాచ్‌కు చెందిన బీపీ ఆచార్య కూడా అరెస్టయ్యారు. వీరు సర్వీసులో మంచి రికార్డ్‌తో సాగుతున్న సమయంలో జగన్ కారణంగా కేసుల్లో ఇరుక్కున్నారు. సీనియర్ ఐఏఎ్‌సలు మరో ఆరుగురిపై కూడా తీవ్ర అభియోగాలు వచ్చాయి. వారిని జగన్ అక్రమాస్తుల కేసుల్లో అనేక దఫాలుగా సీబీఐ పిలిచి విచారించింది. తరచూ విచారణలకు హాజరు కావాల్సి రావడం, కోర్టుల చుట్టూ తిరగడం వారి సర్వీసు, ప్రతిష్ఠపై మచ్చలుగా మిగిలిపోయాయి. ఓబుళాపురం మైనింగ్ కేసుతోపాటు, జగన్ అక్రమాస్తుల కేసు (పెన్నా సిమెంట్స్) కేసులో శ్రీలక్ష్మిపై, ఎమ్మార్ ప్రాపర్టీస్, ఇందూ ప్రాజెక్టులు, లేపాక్షి హబ్ కేసుల్లో బీపీ ఆచార్యపై సీబీఐ అభియోగాలను నమోదు చేసింది. ఐఏఎ్‌సలు ఎల్వీ సుబ్రహ్మణ్యం, శ్యామ్యూల్, సీవీఎ్‌సకే శర్మ, మన్మోహన్‌సింగ్, రత్నప్రభ వంటి వారు కూడా విచారణ ఎదుర్కొన్నారు. నాటి గనుల శాఖ డైరెక్టర్ వీడీ రాజగోపాల్ పరిస్థితి చెప్పనక్కరలేదు. ఓబుళాపురం మైనింగ్ కేసుతోపాటు జగన్ అక్రమాస్తుల కేసులో ఆయన సుదీర్ఘకాలం విచారణను ఎదుర్కొన్నారు. ఓఎంసీ కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లి వచ్చారు.
తలలూపితే అంతే...
జగన్ అక్రమాస్తుల కేసుల్లో అనేక మంది అఖిల భారత సర్వీసు అధికారులూ నిందితులుగా మారడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సర్వీసు నిబంధనల ప్రకారం వ్యవహరించకుండా, నేతలు చెప్పినదానికల్లా తలూపి, వారు సూచించిన చోటల్లా సంతకాలు చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో చెప్పేందుకు ఇవి నిదర్శనాలుగా నిలిచాయి. 2019లో జగన్ అధికారంలోకి రాగానే... అధికారులను తన స్వార్థానికి వాడుకోవడం మొదలుపెట్టారు. గత అనుభవాలను మరిచిపోయిన కొందరు అధికారులు, ఆ తప్పులకు యథాశక్తి సహకరించారు. ఆ ఫలితం నేడు అనుభవిస్తున్నారు. ఆనాడు బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన ఐఆర్‌ఎస్ అధికారి వాసుదేవ రెడ్డి ఇప్పుడు అక్రమ మద్యం కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు. జగన్ ప్రభుత్వంలో మరో సీనియర్ ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి ఈ కేసులో అరెస్టయి జైలుకు వెళ్లివచ్చారు. రక్షణ శాఖలో పని చేస్తూ రాష్ట్రానికి డిప్యుటేషన్‌పై వచ్చిన వెంకటరెడ్డిని నాడు జగన్ గనుల శాఖ డైరెక్టర్‌గా, ఏపీఎండీసీగా ఎండీగా నియమించారు. అక్రమ ఇసుక కేసులో వెంకటరెడ్డి కూడా అరెస్ట్‌అయి జైలుకు వెళ్లి వచ్చారు.
ఇప్పుడు టీటీడీ వంతు..
జగన్ హయాంలో జరిగే తప్పులకు అధికారులు బలైపోతున్న విషయాన్ని అనిల్ కుమార్ సింఘాల్ మరిచిపోయారో, ఏమో! తాను శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో జరగబోయే ఘోరమైన తప్పిదాన్ని నివారించగలిగీ... మిన్నకుండిపోయారు. ఆయన 2015లోనే టీటీడీ ఈఓగా నియమితులయ్యారు. 2019లో జగన్ ప్రభుత్వం వచ్చాక కూడా ఆయననే కొనసాగించారు. టీటీడీకి నెయ్యి సరఫరా టెండర్ల నిబంధనలను కఠిన తరం చేస్తూ అంతకుముందు కమిటీ చేసిన సిఫారసులను ఆయనే ఆమోదించారు. ఆ తర్వాత... వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన పూర్తిస్థాయి పాలకమండలి ఏర్పడింది. నెయ్యి సరఫరా చేసే కంపెనీలు పాల సేకరణే చేయాల్సిన అవసరం లేదన్నట్లుగా నిబంధనలు సడలించారు. కార్యనిర్వహణాధికారి హోదాలో దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయాల్సింది. ఎందుకంటే... అంతకుముందున్న నిబంధనలు, మరింత కఠినతరం చేయాలంటూ కమిటీ ఇచ్చిన సిఫారసులను ఆమోదించింది ఆయనే. ఆ నిబంధనలను సరళీకరిస్తే నాణ్యత దెబ్బతినే అవకాశముందని చెప్పాల్సిన బాధ్యత ఆయనదే. అభ్యంతరం వ్యక్తం చేసినా పాలకమండలి పట్టించుకోకుంటే... తన ‘డిసెంట్’ను తెలియజేసి, ఆ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించే అవకాశమూ ఉంది. కానీ... సింఘాల్ మౌనంగా ఉండటంవల్లే ‘నెయ్యి’ పేరిత ‘రసాయనాల మిశ్రమం’ సరఫరా జరిగిందని ‘సిట్’ పేర్కొంది. సింఘాల్‌పై తగు చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. ప్రస్తుతం టీటీడీ ఈఓగా కూడా సింఘాల్‌నే ఉన్నారు. ‘సిట్’ నివేదిక నేపథ్యంలో ప్రభుత్వం ఆయనపై బదిలీ వేటు వేసింది. సింఘాల్ అనంతరం ఈఓగా వచ్చిన ధర్మారెడ్డి, అక్కడి ఆర్థిక సలహాదారులపై కూడా తగు చర్యలు తీసుకోవాలని సిట్ సిఫారసు చేసింది. ధర్మారెడ్డి ఇప్పటికే రిటైర్ అయ్యారు. కాబట్టి ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.