మరో 2,200 ఎకరాలు!
ABN , Publish Date - Feb 14 , 2026 | 12:45 AM
మచిలీపట్నం పోర్టు విస్తరణకు సంబంధించిన భూసేకరణ పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. తొలి విడతగా పోర్టు నిర్మాణం నాలుగు బెర్తుల సామర్థ్యంతో 1,950 ఎకరాల విస్తీర్ణంలో జరుగుతోంది. పోర్టును భవిష్యతలో మరో 12 బెర్తులుగా నిర్మాణం చేస్తే 2,200 ఎకరాలను కేటాయించాలని ఏపీ మారీటైమ్ బోర్డుకు ప్రతిపాదనలు అందాయి. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు, మారీటైమ్‌బోర్డు అధికారులు శుక్రవారం సమావేశమై ఈ అంశంపై చర్చించారు. ఇప్పటికిపుడు భూసేకరణపై నిర్ణయం తీసుకోకున్నా, కొంతకాలం వేచి ఉండి రైతులను ఒప్పించి భూసేకరణ లేదా భూమి కొనుగోలు చేయాలని సూచనప్రాయంగా అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
-మచిలీపట్నం పోర్టు విస్తరణ కోసం ఏపీ మారీటైమ్ బోర్డుకు ప్రతిపాదన
- షిప్ బిల్డింగ్, షిప్ రిపేర్ ప్రాజెక్టు నిర్మాణానికి తొలి విడతగా 600 ఎకరాల సాల్ట్ భూములు
- త్వరలో భూసేకరణపై నిర్ణయం
- సముద్ర తీరంలోని చినకరగ్రహారం పల్లెపాలెం, క్యాంప్‌బెల్‌పేట గ్రామాలు ఖాళీ చేయాల్సిన పరిస్థితి
మచిలీపట్నం పోర్టు విస్తరణకు సంబంధించిన భూసేకరణ పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. తొలి విడతగా పోర్టు నిర్మాణం నాలుగు బెర్తుల సామర్థ్యంతో 1,950 ఎకరాల విస్తీర్ణంలో జరుగుతోంది. పోర్టును భవిష్యతలో మరో 12 బెర్తులుగా నిర్మాణం చేస్తే 2,200 ఎకరాలను కేటాయించాలని ఏపీ మారీటైమ్ బోర్డుకు ప్రతిపాదనలు అందాయి. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు, మారీటైమ్‌బోర్డు అధికారులు శుక్రవారం సమావేశమై ఈ అంశంపై చర్చించారు. ఇప్పటికిపుడు భూసేకరణపై నిర్ణయం తీసుకోకున్నా, కొంతకాలం వేచి ఉండి రైతులను ఒప్పించి భూసేకరణ లేదా భూమి కొనుగోలు చేయాలని సూచనప్రాయంగా అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:
మచిలీపట్నం పోర్టును 16 బెర్తులతో రూ.11,950 కోట్ల వ్యయంతో నిర్మాణం చేయాలని గతంలోనే డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను రూపొందించారు. వివిధ సంస్థలు గతంలో ఇచ్చిన డీపీఆర్‌లను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్న రైట్స్ సంస్థ తొలి విడతగా 1,950 ఎకరాల విస్తీర్ణంలో నాలుగు బెర్తులతో పోర్టు నిర్మాణం చేయాలని తుది నివేదికను ఇచ్చింది. దీని ప్రకారం రూ.4 వేల కోట్ల అంచనాలతో తొలి విడత గా పోర్టు పనులను ప్రారంభించారు. ఈ ఏడాది చివరి నాటికి పోర్టు పనులు పూర్తవుతాయని చెబుతున్నా, కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. తొలి విడత పనులు పూర్తయి పోర్టు నుంచి ఎగుమతులు దిగుమతులు ప్రారంభించి, పోర్టు రెండో విడత విస్తరణకు గాను మరో 2,200 ఎకరాలు భూమి కావాలనే ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో మచిలీపట్నం నార్త్ మండల పరిధిలోని కరగ్రహారం, గోపువానిపాలెం, చినకనరగ్రహారం, మంగినపూడి, గిలకలదిండి రెవెన్యూ గ్రామాల వెంబడి ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు, అసైన్డ్, రెవెన్యూ రికార్డులలో అనాధీనం భూములుగా నమోదై ఉన్న భూములను సేకరించడం, ప్రైవేటు భూములైతే ఎంతమేర ధర చెల్లించి కొనుగోలు చేయాలనే అంశంపై అధికారులు చర్చించినట్లు సమాచారం. ఈ గ్రామాల పరిధిలోని భూముల విలువ రిజిస్ర్టార్ కార్యాలయంలో ఉన్న ప్రకారం లెక్కలు తీసుకుని, దానికి రెండున్నర రెట్లు అధికంగా ధర చెల్లించేలా ఉన్న వెసులుబాటుపైనా అధికారులు చర్చించినట్లు సమాచారం. దీంతో పాటు పోర్టు నిర్మాణం జరిగే ప్రాంతానికి దగ్గరగా ఉన్న చినకరగ్రహారం పల్లెపాలెం, క్యాంప్‌బెల్‌పేటలలో కొన్ని గృహాలను ఖాళీ చేయించాల్సి వస్తోందని, వీరికి పునరావాసంపైనా ఆలోచన చేయాలని అధికారుల మధ్య చర్చ నడిచినట్లు సమాచారం. అయితే పోర్టు నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో బహిరంగ మార్కెట్‌లో ఎకరం భూమి విలువ రెండు నుంచి రెండున్నర కోట్ల రూపాయల వరకు ధర పలుకుతోంది. ఇంత ధర భూములకు పలుకుతున్న తరుణంలో రైతులు భూములు ఇచ్చేందుకు ఎంతమేర ముందుకు వస్తారనే అంశంపైనా సర్వత్రా చర్చ జరుగుతోంది.
షిప్ బిల్డింగ్, షిప్ రిపేర్ ప్రాజెక్టులకు 600 ఎకరాలు
మచిలీపట్నం పోర్టుకు అనుబంధంగా పోర్టు సమీపంలోనే షిప్ బిల్డింగ్, షిప్ రిపేర్ ప్రాజెక్టులు నిర్మాణం చేసే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అనుమతులు ఇచ్చింది. గోవా, గుజరాత రాష్ర్టాల్లో షిప్ బిల్డింగ్‌ల నిర్మాణం చేసిన అనుభవం ఉండి, అక్కడ ఈ తరహా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలకు మచిలీపట్నంలో ఈ షిప్ బిల్డింగ్ నిర్మాణ పనులను చేసే బాధ్యతలను అప్పగిస్తారనే ప్రచారం ఇటీవల కాలంలో ఊపందుకుంది. మచిలీపట్నం పోర్టు నిర్మాణం జరిగే ప్రాంతానికి అత్యంత సమీపంలో మంగినపూడి, తాళ్లపాలెం రెవెన్యూ గ్రామాల పరిధిలో 600 ఎకరాల సాల్ట్ భూములు ఉన్నాయి. ఈ భూములను షిప్ బిల్డింగ్‌కు కేటాయించాలని సూత్రప్రాయంగా అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. ఈ భూములు ప్రభుత్వానికి చెందినవే కాబట్టి, ఎలాంటి ఖర్చు లేకుండానే భూముల కేటాయింపు చేయవచ్చనే ఆలోచనతో అధికారులు ఉన్నట్లు తెలిసింది. భవిష్యతలో షిప్ బిల్డింగ్ విస్తరణకు మరింతగా భూమి అవసరమైతే అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చని, ముందస్తుగా షిప్ బిల్డింగ్‌కు 600 ఎకరాల సాల్ట్ భూములను కేటాయించాలని దాదాపుగా నిర్ణయించినట్లు రెవెన్యూ అధికారులు అంటున్నారు.