Share News

తప్పుడు బిల్లులతో స్వాహా

ABN , Publish Date - Mar 15 , 2026 | 05:19 AM

అన్నమ య్య జిల్లాలో కొందరు పోలీసుల అవినీతి వ్యవహారం కలకలం రేపుతోంది. జిల్లా పోలీసు కార్యాలయం కేంద్రంగా ప్రత్యేక అలవెన్సులు, వేతనాల రూపంలో తప్పుడు బిల్లులుపెట్టి సుమారు రూ.1.50 కోట్లు స్వాహా చేశారు.

తప్పుడు బిల్లులతో స్వాహా

  • జాబితాలో సీఐ, 90 మంది కానిస్టేబుళ్లు?

  • అన్నమయ్య జిల్లా పోలీసు కార్యాలయం కేంద్రంగా దందా

  • ప్రత్యేక అలవెన్సులు, జీతాల కింద రూ.1.50 కోట్లకు బిల్లులు

అన్నమయ్య, మార్చి 14(ఆంధ్రజ్యోతి): అన్నమ య్య జిల్లాలో కొందరు పోలీసుల అవినీతి వ్యవహారం కలకలం రేపుతోంది. జిల్లా పోలీసు కార్యాలయం కేంద్రంగా ప్రత్యేక అలవెన్సులు, వేతనాల రూపంలో తప్పుడు బిల్లులుపెట్టి సుమారు రూ.1.50 కోట్లు స్వాహా చేశారు. నిందితుల్లో ఒక సీఐ, 90 మంది వరకు కానిస్టేబుళ్లు ఉన్నట్లు సమాచారం. అయితే 15మంది కానిస్టేబుళ్లకే ప్రమేయం ఉందని, రూ.37లక్షలే దుర్వినియోగం జరిగినట్లు నిర్ణయించి.. వారిపై కేసునమోదు చేసి సస్పెండ్‌ చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేసే జయకుమార్‌రెడ్డి సిబ్బందితో కుమ్మక్కై తప్పుడు బిల్లులు పెట్టి రూ.37లక్షలు కాజేశాంటూ కేసు నమోదుచేశారు. అయితే ఈ మొత్తం దాదాపు రూ.75 లక్షల వరకు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. కానిస్టేబుల్‌ టి.హరిప్రసాద్‌కు 2022 నుంచి ఇప్పటివరకు పడిన జీతాన్ని పరిశీలిస్తే బేసిక్‌ పే రూ.51,140, డీఏ రూ.13,496, ఇంటి అద్దె రూ.5,114, కిట్‌ మెయింటెన్స్‌ రూ.200.. ‘దిశ’లో పనిచేస్తున్న కారణంగా 30శాతం ఇన్సెంటివ్‌పే కింద రూ.15,342, అదనపు హెచ్‌ఆర్‌ఎ 8శాతం రూ.2,000 కలిపి మొత్తం రూ.87,292 రావాలి. అయితే అదనపు అలవెన్సు రూ.15,342 కలిపి ట్రెజరీకి పంపించారు. రూ.1,02,634 బిల్లు చేశారు. ఇలా 15 మందికి జమయింది. అనధికార సమాచారం ప్రకారం 18మందికి తప్పుడు అలవెన్సులతో 2025 డిసెంబరు వరకు బిల్లులు పాస్‌ అయినట్లు తెలుస్తోంది. 2024 ఫిబ్రవరిలో జిల్లా పోలీసు కేంద్రంలో దిశ విభాగంలో పనిచేసిన ఓ సీఐ కూడా 4నెలలు తప్పుడు అలవెన్సులతో జీతం తీసుకున్నారనే ఆరోపణలున్నాయి.


ఈయన ప్రస్తుతం వేరే జిల్లాకు బదిలీ అయ్యారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఉండే రికార్డు మేరకే క్లర్కు జీతం నమోదు చేశారు. సబ్‌ ట్రెజరీ కార్యాలయంలోని పేలీప్‌ రిజిస్టర్‌లోనూ అంతే నమోదు చేశారు. ఆన్‌లైన్‌లో మాత్రం అదనపు అలవెన్సు డ్రా చేశారు. యాంటీ నక్సల్స్‌ అలవెన్సు పేరుతోనూ స్వాహా చేసినట్లు తెలుస్తోంది. ఇందులో 60-70 మంది కానిస్టేబుళ్లు ఉన్నట్లు సమాచారం. అదనపు అలవెన్సు పొందిన నలుగురు పోలీసులు కలకడ స్టేషన్‌కు చెందినవారని ప్రచారం ఉంది. 2019లో నక్సల్స్‌ ప్రభావం తగ్గిన జిల్లాల్లో యాంటీ నక్సల్స్‌ అలవెన్సు రద్దు చేశారు. అయినా ఆ పేరుతో దోపిడీ చేశారు. సదరు క్లర్కు అదనంగా వేతనం వేయించి కమీషన్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. జిల్లా సబ్‌ ట్రెజరీ కార్యాలయంలో ఇక్కడ పనిచేసే కొందరు అధికారులు, సిబ్బందికి తెలిసే ఈ బాగోతం జరిగినట్లు ఆరోపణలున్నాయి. వారిపై ఎలాంటి చర్యలూ లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.

Updated Date - Mar 15 , 2026 | 05:25 AM