రుబ్బురాయితో భర్త తలపై బాది..
ABN , Publish Date - Jul 01 , 2026 | 05:16 AM
ప్రియుడితో కలిసి ఓ మహిళ భర్తను హతమార్చింది. అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగుచూసింది.
అన్నమయ్య జిల్లాలో ప్రియుడి మోజులో ముగ్గురు పిల్లల తల్లి ఘాతుకం
కొన ఊపిరితో ఉండగా సుత్తితో కొట్టిన ప్రియుడు
మదనపల్లె క్రైం, జూన్ 30(ఆంధ్రజ్యోతి): ప్రియుడితో కలిసి ఓ మహిళ భర్తను హతమార్చింది. అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగుచూసింది. మదనపల్లె ఏఎస్పీ వెంకటాద్రి కథనం ప్రకారం.. కోటవారిపల్లె పంచాయతీ నారమాకులతాండాకు చెందిన రైతు బుక్కే చిన్నబుడ్డన్న నాయక్(37)కు భార్య రమీల, ముగ్గురు కుమారులు ఉన్నారు. రమీల ఆశా కార్యకర్తగా పనిచేస్తూ అదే ఊరికి చెందిన రెడ్డెప్ప నాయక్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ విషయం భర్తకు తెలియడంతో.. తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే జూన్ 18 రాత్రి గొడవ జరిగింది. చిన్నబుడ్డన్న నిద్రిస్తుండగా రమీల రుబ్బురోలుతో అతడి తలపై గట్టిగా మోదింది. దాంతో చిన్నబుడ్డన్న అపస్మారకస్థితికి చేరుకున్నాక ఆమె రెడ్డెప్పకు ఫోన్ చేసి రప్పించింది. రమీల సాయంతో చిన్నబుడ్డన్నను వాహనం ముందువైపు కూర్చోబెట్టుకున్న రెడ్డెప్ప.. దండువారిపల్లె సమీపంలోని అల్లనేరేడుతోపు వద్దకు తీసుకొచ్చాడు. కొనఊపిరితో ఉన్న చిన్నబుడ్డన్న తలపై సుత్తితో మోది హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని రహదారిపై పడేశాడు. వాహనాన్ని కిందపడేసి సుత్తితో డ్యామేజ్ చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు. చిన్నబుడ్డన్న ద్విచక్రవాహనంపై మదనపల్లెకు వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతి చెందినట్లు రమీల మదనపల్లె తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిన్నబుడ్డన్న మృతిపై అతడి సోదరుడు పెద్దబుడ్డన్న నాయక్ అనుమానం వ్యక్తం చేసినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో ఆయన రెండుసార్లు ఎస్పీ ధీరజ్‌ను కలిసి అర్జీ ఇచ్చాడు. ఎస్పీ స్పందించి కేసును వన్‌టౌన్ సీఐ రాజారెడ్డికి అప్పగించారు. ఆయన ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేసి గుట్టు రట్టు చేశారు. నిందితులు నేరం అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.