Share News

రేపే అన్నదాత సుఖీభవ చెల్లింపులు

ABN , Publish Date - Jun 19 , 2026 | 04:11 AM

‘అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్‌’ పథకం రెండో ఏడాది (2026-27) మొదటి విడత నిధులు, పీఎం కిసాన్‌ 23వ విడత నిధులను ఈ నెల 20వ తేదీన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేయనున్నాయి.

రేపే అన్నదాత సుఖీభవ చెల్లింపులు

  • బెంగాల్‌లో ప్రధాని, లింగంగుంట్లలో సీఎం నిధుల విడుదల

  • రాష్ట్రంలో 46,85,838 మంది రైతుల ఖాతాల్లో నగదు జమ

అమరావతి, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): ‘అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్‌’ పథకం రెండో ఏడాది (2026-27) మొదటి విడత నిధులు, పీఎం కిసాన్‌ 23వ విడత నిధులను ఈ నెల 20వ తేదీన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేయనున్నాయి. పీఎం కిసాన్‌ నిధులను పశ్చిమబెంగాల్‌లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్‌లో ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా 20న దేశవ్యాప్తంగా ‘పీఎం కిసాన్‌ ఉత్సవ్‌ దివ్‌స’గా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. అలాగే అన్నదాత సుఖీభవ నిధులను అదే రోజు పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేసి, లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 3.45గంటలకు ప్రారంభమౌతుందని వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ మనజీర్‌ జిలానీ తెలిపారు. రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పథకం కింద 2026-27లో మొదటి విడతగా ప్రతి లబ్ధిదారుకి రూ.7వేలు చొప్పున జమ కానున్నది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.5వేలు, కేంద్రం రూ.2వేలు చెల్లించనున్నాయి. రాష్ట్రంలో 46,85,838 మంది రైతుల ఖాతాల్లో మొత్తం రూ.3,125.47కోట్లు జమ కానున్నాయి. ఇందులో పట్టాదారు రైతు కుటుంబాలు 45,69,817, అటవీ భూసాగు హక్కుదారులు రూ.1,16,021 మంది ఉన్నారు. రాష్ట్ర వాటా కింద రూ.2,342.92కోట్లు, కేంద్ర వాటా రూ.782.5కోట్లు విడుదల కానున్నాయి.

Updated Date - Jun 19 , 2026 | 04:12 AM