Share News

నా ఇన్సూరెన్స్‌ డబ్బుతో వైద్యం చేయించుకోండి

ABN , Publish Date - Jul 24 , 2026 | 05:20 AM

తన మరణానంతరం వచ్చే ఇన్సూరెన్స్‌ డబ్బుతో తల్లిదండ్రులను వైద్యం చేయించుకోవాలంటూ ఓ యువతి లేఖ రాసి బలవన్మరణానికి పాల్పడింది.

నా ఇన్సూరెన్స్‌ డబ్బుతో వైద్యం చేయించుకోండి

  • తల్లిదండ్రులకు లేఖ రాసి ఏఎన్‌ఎం బలవన్మరణం

చిల్లకూరు, జూలై 23 (ఆంధ్రజ్యోతి): తన మరణానంతరం వచ్చే ఇన్సూరెన్స్‌ డబ్బుతో తల్లిదండ్రులను వైద్యం చేయించుకోవాలంటూ ఓ యువతి లేఖ రాసి బలవన్మరణానికి పాల్పడింది. తిరుపతి జిల్లా ఓజిలి మండలం రాజుపాళెం గ్రామానికి చెందిన సాయిచందన (27) సంవత్సరం కాలంగా నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తొణుకుమాల తొణుకుమాల సచివాలయంలో ఏఎన్‌ఎంగా విధులు నిర్వహిస్తోంది. గురువారం ఉదయం ఆమె సచివాలయానికి వచ్చింది. ఒంటరిగా ఉన్న సమయంలో సాయిచందన చున్నీతో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్‌ఐ సురేష్ బాబు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సాయిచందన రాసిన సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ‘మమ్మీ, డాడీ నన్ను క్షమించండి. నా చావుకు ఎవరూ కారణం కాదు. నేను రూ.60 లక్షలకు ఇన్సూరెన్స్‌ చేశాను. నా మరణానంతరం వచ్చే డబ్బుతో మీరు వైద్యం చేయించుకోండి.’ అని రాసి ఉంది. సాయిచందన తండ్రి రమణయ్య అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలో వైద్యం చేయించుకుంటున్నారు. ఆమె తల్లి సుకుమారి అంగన్వాడీ కార్యకర్తగా పని చేస్తున్నారు. ఆమె కూడా అరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తల్లిదండ్రుల ఆరోగ్య సమస్యలతో మనస్తాపానికి గురైన సాయిచందన ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

Updated Date - Jul 24 , 2026 | 05:22 AM