ఇష్టానుసారంగా వ్యవహరిస్తే..ఊరుకోం!
ABN , Publish Date - Feb 21 , 2026 | 04:49 AM
సమాజంలో మా ఇష్టం వచ్చినట్లుగా ఎలా పడితే అలా ప్రవర్తిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హోంమంత్రి అనిత హెచ్చరించారు. ఇష్టానుసారంగా వ్యవహరించేవారు ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
గుర్తుపెట్టుకోండి... ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదు
తప్పు చేస్తే ఎంతటి వారికైనా శిక్ష తప్పదు
శాసనసభలో హోంమంత్రి అనిత
అమరావతి, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): సమాజంలో మా ఇష్టం వచ్చినట్లుగా ఎలా పడితే అలా ప్రవర్తిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హోంమంత్రి అనిత హెచ్చరించారు. ఇష్టానుసారంగా వ్యవహరించేవారు ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ‘తప్పు చేస్తే ఏ పార్టీ అయినా, ఎంతటి వారైనా శిక్ష అనుభవించాల్సిందే’ అని స్పష్టం చేశారు. అలాగే సోషల్ మీడియా అసభ్య కామెంట్ల నియంత్రణకు త్వరలో చట్టం తీసుకొస్తామన్నారు. శుక్రవారం అసెంబ్లీలో హోంశాఖ పద్దుపై జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. ‘‘గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలను మర్చిపోలేం... మర్చిపోకూడదు. చంద్రబాబు ఇంటిపైనే దాడి చేసిన దుర్మార్గపు పాలన అది. పవన్ కల్యాణ్‌ను వాహనం దించి రోడ్డుపై అవమానించారు. లోకేశ్ పాదయాత్రలో దాడులు చేయించారు. పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారు. గంజాయికి ఏపీ చిరునామాగా మారింది’’ అని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేశామని, 20 నెలల్లో 1.4 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. గత ప్రభుత్వంలో దెబ్బతిన్న పోలీసు వ్యవస్థ గౌరవాన్ని పునరుద్ధరించాలని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. పోలీసులు సైబర్ నేరాలను ఎప్పటికప్పుడు గుర్తిస్తున్నా.. బాధితులకు కోల్పోయిన నగదు పెద్దగా అందడం లేదని కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. ప్రతి జిల్లాలో సైబర్ స్టేషన్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రజాప్రతినిధుల్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ మానసిక వేధింపులకు గురిచేస్తున్నారని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఇటీవల అంబటి రాంబాబు అంశంలో సంబంధం లేని తన ఫొటో పెట్టి ట్రోలింగ్ చేశారన్నారు. దీనిపై ఎవరికి ఫిర్యాదు చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్‌ను నియంత్రించాలన్నారు.
జీరో అవర్‌లో ఎమ్మెల్యేలు
గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన పాఠశాలల్లో మౌలిక సదుపాయాల పనులు పూర్తిచేయాలి. పాఠశాలలకు ప్రహరీ గోడలు నిర్మించేలా చర్యలు ప్రారంభించాలి
- బగ్గు రమణమూర్తి, నరసన్నపేట.
పీ4, దేవదాయ శాఖలను ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేయా లి. పీ4ద్వారా ఆలయాలను అభివృద్ధి చేసే అవకాశం ఉంది.
- అదితి గజపతిరాజు, విజయనగరం.
22(ఎ) భూములను సాగు చేస్తున్న రైతులకు వారికి దక్కాల్సిన మూడింట రెండో వంతు భూమిని వారి పేరుపైకి మార్చాలి. ఇనాందారులు ముందుకు రాని కేసుల్లో ప్రత్యామ్నాయ పరిష్కారం చూపాలి
- ఎన్.ఈశ్వరరావు, ఎచ్చెర్ల.
ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలి. బ్యాంకులు రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకుని, రాయితీలు ఇవ్వాలి
- పల్లె సింధూరరెడ్డి, పుట్టపర్తి