సింఘాల్‌పై బదిలీ వేటు
ABN , Publish Date - Feb 02 , 2026 | 04:03 AM
గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంలో టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌పై బదిలీ వేటు పడింది.
వెంటాడిన ఆరేళ్ల నాటి ‘మౌనం’
కల్తీ నెయ్యి వ్యవహారంలో చర్యలు
అవినీతి ఆరోపణలు లేకున్నా.. అసమర్థత ఫలితంగా ‘ఔట్’.. ఆయనపై సిట్ నివేదిక
ముద్దాడ రవిచంద్రకు అదనపు బాధ్యతలు
ఈలోగా వెంకయ్యకు తాత్కాలిక బాధ్యతలు
అమరావతి, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంలో టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌పై బదిలీ వేటు పడింది. ఆయన స్థానంలో సీఎం కార్యాలయంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న ముద్దాడ రవిచంద్రకు టీటీడీ ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా రెండోసారి ఈవో పదవి దక్కించుకున్న సింఘాల్‌ను పాత పాపం వెంటాడింది. ఆరేళ్ల క్రితం అంటే.. 2020 ఫిబ్రవరిలో తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం ఇప్పుడు ఆయనను స్వామి వారి సేవకు దూరం చేసింది. రాజకీయ నాయకులు తప్పులు చేస్తుంటే దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ఐఏఎస్ అధికారులపై ఉంటుంది. తప్పును తప్పు అని చెప్పకపోవడం కూడా తప్పే. సింఘాల్ విషయంలో అదే జరిగింది. అప్పటి టీటీడీ పాలక మండలి నెయ్యి సేకరణ పాలసీని అడ్డగోలుగా మార్చినప్పుడు ‘ఇది తప్పు’ అని చెప్పడానికి ఆయన సాహసించలేదు. అదే విషయాన్ని సీబీఐ సిట్ ప్రభుత్వానికి నివేదించింది. సింఘాల్ అసమర్థతను సృష్టంగా ఎత్తి చూపడంతో ప్రభుత్వం ఆయనపై బదిలీ వేటు వేసింది. 2020 ఫిబ్రవరి 29వ తేదీన తీర్మానం 371 ద్వారా నెయ్యి సేకరణ నిబంధనలను పూర్తిగా మార్చేసి, టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా కావడానికి బీజం వేశారు. ఈ వ్యవహారంలో అప్పటి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పాత్ర గురించి కూటమి పక్షం ఎత్తి చూపుతూ వస్తోంది. చైర్మన్‌తో పాటు ఈ తీర్మానం ఆమోదం పొందడానికి కారణమైన ఈవోకు కూడా సమాన బాధ్యత ఉంటుంది. ప్రభుత్వం అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాత సింఘాల్‌పై బదిలీ వేటు వేసింది.
నాలుగు నెలలకే...
వాస్తవానికి టీటీడీ చరిత్రలో ఎవరికి దక్కని గౌరవం సింఘాల్‌కు దక్కింది. ఈవో పోస్టులో పని చేసేందుకు చాలా మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ కొంత మందికే అవకాశం దక్కుతుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన సింఘాల్ గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీటీడీ ఈవోగా నియమితులయ్యారు. ఏపీలో ఉన్న ఐఏఎ్‌సలను కాదని కేంద్ర సర్వీ్‌సలో ఉన్న సింఘాల్‌ను ప్రత్యేకంగా పిలిపించి బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ కూడా ఆయనను ఈవోగా కొనసాగించారు. 2020 మార్చి వరకూ ఆయన ఈవోగా కొనసాగారు. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లిన ఆయనను ప్రభుత్వం వెనక్కి పిలిచి మరీ రెండోసారి ఈవోగా నియమించింది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆయనకు కర్తవ్యబోధ చేస్తూనే వచ్చింది. కానీ ఇప్పుడు కూడా రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు లొంగిపోయారు. టీటీడీ నిబంధనలు అనుకూలించకపోయినా యనమల రామకృష్ణుడికి చెందిన గుడిని టీటీడీ పరిధిలోకి తీసుకోవడం, జంగా కృష్ణమూర్తికి కొండ మీద స్థలం కేటాయించడంతో పాటు అలిపిరి దగ్గర టౌన్‌షిప్ వ్యవహారంలోనూ పాలక మండలి ఏది చెబితే దానికి తలూపారు. ఇంతలో పాత కేసు మళ్లీ తెరపైకి రావడంతో సింఘాల్ మెడకు చుట్టుకుంది. తొలిసారి టీటీడీ ఈవోగా ఐదు సంవత్సరాలా నాలుగు నెలల పాటు పని చేసి రికార్డు సృష్టించి ఆయన రెండోసారి మాత్రం కేవలం నాలుగు నెలలకే టీటీడీ నుంచి బయటకు రావాల్సి వచ్చింది.
ఇన్‌చార్జి ఈవోగా వెంకయ్య బాధ్యతలు
అనిల్‌కుమార్ సింఘాల్‌కు వీడ్కోలు
టీటీడీ ఇన్‌చార్జి ఈవోగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం సాయంత్రం ఆలయంలో వెంకయ్య చౌదరికి అనిల్‌కుమార్ సింఘాల్ బాధ్యతలు అప్పగించారు. అనంతరం శ్రీవారిని దర్శించుకుని రంగనాయక మండపానికి సింఘాల్ చేరుకోగా వేదపండితులు ఆశీర్వచనం చేశారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు శ్రీవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం అధికారులు, సిబ్బంది, అర్చకులు అనిల్‌కుమార్ సింఘాల్‌కు వీడ్కోలు పలికారు.