రాష్ట్ర సరిహద్దులు దాటొద్దు!
ABN , Publish Date - Mar 25 , 2026 | 05:59 AM
వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో నిందితుడు అనిల్ చోక్రాకు (ఏ49) హైకోర్టు పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరుచేసింది.
‘వైసీపీ మద్యం’ స్కాం కేసులో అనిల్ చోక్రాకు హైకోర్టు బెయిల్
అమరావతి, మార్చి 24(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో నిందితుడు అనిల్ చోక్రాకు (ఏ49) హైకోర్టు పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరుచేసింది. ట్రయల్ కోర్టు సంతృప్తి మేరకు రూ.లక్షతో రెండు పూచీకత్తులు సమర్పించాలని స్పష్టంచేసింది. పాస్‌పోర్టును ట్రయల్ కోర్టుకు స్వాధీనపరచాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. దర్యాప్తు అధికారికి సమాచారం ఇవ్వకుండా రాష్ట్ర సరిహద్దులు దాటి వెళ్లడానికి వీల్లేదని పేర్కొంది. విచారణకు సహకరించాలని ఆదేశించింది. ‘‘సాక్షులను బెదిరించడం, లోబరుచుకోవడం, ప్రభావితం చేయడం వంటివి చేయడానికి వీల్లేదు. రెండు వారాల్లోగా స్థిర, చరాస్తులు సహా బ్యాంకు ఖాతాల వివరాలు సమర్పించాలి. దర్యాప్తు అధికారికి ఎప్పుడూ అందుబాటులో ఉండే ఫోన్‌నెంబర్ ఇవ్వాలి. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ప్రతి ఆదివారం ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 మధ్య దర్యాప్తు అధికారి (పోలీసు స్టేషన్) ముందు హాజరుకావాలి.’’ అని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు.