ఎస్‌ఈసీగా బాధ్యతలు స్వీకరించిన పునేఠా
ABN , Publish Date - Apr 22 , 2026 | 05:38 AM
రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ)గా నియమితులైన విశ్రాంత సీఎస్ అనిల్ చంద్ర పునేఠా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో...
అమరావతి, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ)గా నియమితులైన విశ్రాంత సీఎస్ అనిల్ చంద్ర పునేఠా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో ఉదయం 10.41 గంటలకు ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పునేఠా మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్ర ప్రభుత్వం నాపై ఉంచిన గురుతర బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తా. మీడియా, రాజకీయ పార్టీలు, స్థానిక సంస్థల ప్రతినిధులు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను సజావుగా చేపట్టేందుకు నాకు సహకరించాలి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నన్ను నియమించిన గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబులకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. కాగా రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్‌గా ఉన్న పునేఠా ఆ పదవికి రాజీనామా చేయగా, గవర్నర్ ఆమోదించడంతో ఎస్‌ఈసీగా బాధ్యతలు చేపట్టేందుకు లైన్ క్లియర్ అయింది.