వేతనాలు పెంచే వరకూ కదలం!
ABN , Publish Date - Mar 03 , 2026 | 04:03 AM
‘ప్రజాప్రతినిధులు వారి వేతనాలను 30 శాతం పెంచుకున్నారు. కనీస వేతనాలు కూడా అందుకోని అంగన్వాడీలకు జీతాలు పెంచలేరా? పెంచితే మీకు వచ్చే ఇబ్బంది, నష్టమేంటి?’
విజయవాడలో కదం తొక్కిన అంగన్వాడీలు
సమస్యల పరిష్కారానికి పోరుబాట
ధర్నా ప్రారంభం.. పాల్గొన్న వేల మంది
రాత్రి కూడా శిబిరంలోనే ఆందోళన కొనసాగింపు
విజయవాడ (ధర్నాచౌక్), మార్చి 2(ఆంధ్రజ్యోతి): ‘ప్రజాప్రతినిధులు వారి వేతనాలను 30 శాతం పెంచుకున్నారు. కనీస వేతనాలు కూడా అందుకోని అంగన్వాడీలకు జీతాలు పెంచలేరా? పెంచితే మీకు వచ్చే ఇబ్బంది, నష్టమేంటి?’ అని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు ప్రశ్నించారు. వేతనాలు పెంచాలని, మిగిలిన మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, తదితర సమస్యల పరిష్కారానికి అంగన్వాడీలు పోరుబాట పట్టారు. విజయవాడ ధర్నాచౌక్ వేదికగా సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎ్‌ఫటీయూ అనుబంధ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ల ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో అంగన్వాడీలు తరలివచ్చారు. ధర్నాను ప్రారంభించిన అనంతరం సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు మాట్లాడుతూ.. పేద గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలకు సేవలందిస్తున్న అంగన్వాడీలు, హెల్పర్లు, మినీ వర్కర్లకు న్యాయం చేయడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడం బాధాకరమన్నారు. పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా 2019 నుంచి వీరికి వేతనాలు పెరగలేదన్నారు. అంగన్వాడీల వేతనాలు పెంచడంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరిస్తామని గత ప్రభుత్వం పేర్కొందన్నారు. తాము అధికారంలోకి రాగానే వేతనాలు పెంచుతామని అప్పటి ప్రతిపక్షంలోని టీడీపీ నేతలు కూడా హామీ ఇచ్చారని గుర్తుచేశారు.
అయితే అధికారం చేపట్టి రెండేళ్లు గడుస్తున్నా.. వేతనాలు పెంచలేదని విమర్శించారు. వచ్చే బడ్జెట్‌లోనైనా అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బేబిరాణి, సుబ్బరావమ్మ మాట్లాడుతూ.. వేతనాల పెంపుతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 2024 మార్చిలో గ్రాట్యూటీ అమలు చేస్తామని జీవో 8 ఇచ్చినా.. నేటికీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ చట్టాన్ని అమలు చేసేందుకు గైడ్‌లైన్స్ రూపొందించలేదన్నారు. మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ పీడీఎఫ్ ఎమ్మెల్సీ ద్వారా అంగన్వాడీల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే సుబ్బరావ మ్మ మాట్లాడుతూ జీతాలు పెంచే వరకు విజయవాడ నుంచి వెనక్కి వెళ్లేది లేదని స్పష్టం చేశారు.
సానుకూలంగా స్పందించే వరకు ధర్నా
తమ సమస్యలను పరిష్కరించేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని అంగన్వాడీలు రాత్రి కూడా దీక్షా శిబిరంలోనే తమ ఆందోళన కొనసాగించారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించే వరకు ధర్నా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.రవీంద్రనాథ్, వెంకటసుబ్బయ్య, ఐఎ్‌ఫటీయూ రాష్ట్ర నాయకులు హరికిషోర్, అంగన్వాడీ సంఘాల రాష్ట్ర నాయకులు జె.లలితమ్మ, జ్యోతి, ప్రేమ, భారతీ, ప్రత్యేక హోదా సాధన సమితి నాయకుడు చలసాని శ్రీనివాస్ పాల్గొన్నారు.