రోడ్డెక్కిన అంగన్‌వాడీలు
ABN , Publish Date - Feb 04 , 2026 | 06:23 AM
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అంగన్‌వాడీ వేతనాల పెంపుదల గురించి లేకపోవడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీ కార్యకర్తలు మంగళవారం ఆందోళన చేపట్టారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం..
బడ్జెట్‌లో వేతనాల పెంపు ప్రస్తావన లేకపోవడంపై ఆగ్రహం
రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అంగన్‌వాడీ వేతనాల పెంపుదల గురించి లేకపోవడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీ కార్యకర్తలు మంగళవారం ఆందోళన చేపట్టారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ జిల్లాల్లోని సీడీపీవో కార్యాలయాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం బడ్జెట్‌లో అన్యాయం చేసిందంటూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కార్యకర్తలు విజయవాడలో ఆందోళన నిర్వహించారు. కానూరులోని ఐసీడీఎస్ అర్బన్, రూరల్ ప్రాజెక్టు కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించి, కేంద్ర బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. రూరల్ సీడీపీవో భానుమతి, అర్బన్ సీడీపీవో జ్యోత్స్నకు వినతిపత్రాలు అందజేశారు. ఏలూరు జిల్లాలోని పది సీడీపీవో కార్యాలయాల ఆందోళనలు చేపట్టిన అంగన్‌వాడీ కార్యకర్తలు.. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, రూ.26 వేల కనీస వేతనం ఇవ్వాలని, పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. బాపట్ల జిల్లాలో బాపట్ల, రేపల్లె, వేటపాలెం, నగరం ఐసీడీఎస్ కార్యాలయాల వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్ప్‌ర్స్ అసోసియేషన్ నాయకులు, సభ్యు లు ఆందోళనకు దిగారు. కేంద్ర బడ్జెట్‌లో తమకు కేటాయింపులు పెంచాలని డిమాం డ్ చేస్తూ విశాఖలో అంగన్‌వాడీ సిబ్బంది ఆందోళన నిర్వహించారు. కేంద్ర బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయించలేదని శ్రీసత్యసాయి జిల్లాలో చేపట్టిన ఆందోళనలో అంగన్‌వాడీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లాల పరిధిలోని మండల కేంద్రాల్లోని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాల వద్ద నిరసన చేపట్టారు. కడప అర్బన్ ఐసీడీఎస్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బడ్జెట్ ప్రతులను దహనం చేశారు.