Share News

సమస్యలకు ధర్నాలు పరిష్కారం కాదు

ABN , Publish Date - Feb 24 , 2026 | 05:02 AM

అంగన్వాడీల డిమాండ్లను ప్రభుత్వం సమగ్రంగా పరిశీలిస్తుందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకోవాలని రాష్ట్ర మహిళా,శిశు సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కోరారు.

సమస్యలకు ధర్నాలు పరిష్కారం కాదు

  • రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకోండి

  • వేతనాల పెంపు అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా

  • అంగన్వాడీ సంఘాలకు మంత్రి సంధ్యారాణి హామీ

అమరావతి, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): అంగన్వాడీల డిమాండ్లను ప్రభుత్వం సమగ్రంగా పరిశీలిస్తుందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకోవాలని రాష్ట్ర మహిళా,శిశు సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కోరారు. అంగన్‌వాడీల సమస్యల పరిష్కారం కోరుతూ నిరాహార దీక్షలు చేస్తున్న నేపథ్యంలో సోమవారం అమరావతి సచివాలయంలో అంగన్వాడీ సంఘాల నేతలతో మంత్రి చర్చలు జరిపారు. వారి డిమాండ్లను, సమస్యలను మంత్రి సమగ్రంగా విన్నారు. అంగన్వాడీల డిమాండ్లపై కూటమి ప్రభుత్వం సమగ్రంగా పరిశీలన చేస్తుందని హామీ ఇచ్చారు. డిమాండ్లను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.

మార్చి 2 మహా ధర్నా.. మంత్రి గుమ్మిడి సంధ్యారాణితో అంగన్వాడీ డిమాండ్లపై చర్చలు జరిగాయని ఈ చర్చల్లో వేతనాల పెంపుపై స్పష్టత రాలేదని, అంత వరకూ నిరాహార దీక్షలు కొనసాగిస్తామని ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌, ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ అసోసియేషన్‌, ఏపీ ప్రగతి శీల అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌లు స్పష్టం చేశాయి. మార్చి 2వ తేదీన విజయవాడలో మహాధర్నా నిర్వహిస్తామని సోమవారం ఆ సంఘాల నేతలు బేబీరాణి, లలిత, వీఆర్‌ జ్యోతి ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - Feb 24 , 2026 | 05:03 AM