అర్ధరాత్రి అంగన్వాడీల అరెస్ట్!
ABN , Publish Date - Mar 04 , 2026 | 03:30 AM
సమస్యల పరిష్కారం కోరుతూ ధర్నా చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు.
బస్సుల్లో స్టేషన్లకు తరలింపు.. యూనియన్ల ఆగ్రహం
అందరినీ బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్
విజయవాడ(ధర్నాచౌక్), మార్చి 3(ఆంధ్రజ్యోతి): సమస్యల పరిష్కారం కోరుతూ ధర్నా చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు సోమవారం ‘చలో విజయవాడ’కు పిలుపునిచ్చారు. చర్చలకు ప్రభుత్వం స్పందించకపోవడంతో ధర్నా అనంతరం సోమవారం రాత్రి ధర్నాచౌక్ శిబిరంలో నిద్రకు ఉపక్రమించారు. నిద్రపోతున్న అంగన్వాడీలను పోలీసులు అర్ధరాత్రి (మంగళవారం తెల్లవారుజామున) అరెస్టు చేశారు. బస్సుల్లో ఏలూరు, సత్తెనపల్లి, నరసరావుపేట పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో పలువురు అంగన్వాడీలు గాయపడ్డారు. అరెస్ట్ చేసే క్రమంలో పురుష పోలీసులు తమపట్ల అమానుషంగా వ్యవహరించారని పలువురు మహిళలు మండిపడ్డారు. మహిళలని చూడకుండా తాళ్లు వేసి, ముసుగులు కప్పి బలవంతంగా వాహనాల్లో కుక్కారని ఆరోపించారు. అంగన్వాడీ రాష్ట్ర నాయకులు బి. బేబీరాణి, కె.సుబ్బరావమ్మ తదితరులను అరెస్ట్ చేశారు. కాగా, అంగన్వాడీలు నిద్రమత్తులో ఉండగానే తెల్లవారుజామున పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎ్‌ఫటీయూ అనుబంధ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు మండిపడ్డారు. మంగళవారం ప్రెస్‌క్లబ్ వద్ద వారు మీడియాతో మాట్లాడారు. శ్రామిక మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ కె. ధనలక్ష్మి మాట్లాడుతూ అరెస్టు చేసినవారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరికొన్ని రోజుల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించనున్న రాష్ట్ర ప్రభుత్వం మహిళల గురించి గొప్పగా చెబుతూ మరోపక్క అంగన్వాడీలపై అమానుష దాడికి పాల్పడటం అత్యంత దుర్మార్గమని ఆరోపించారు. ఏఐటీయూసీ అనుబంధ సంఘం ప్రధాన కార్యదర్శి లలితమ్మ మాట్లాడుతూ సమస్యలు పరిష్కరిస్తామని నమ్మించి అక్రమ అరెస్టులకు పాల్పడటం అన్యాయమని అన్నారు. ఐఎ్‌ఫటీయూ అనుబంధ సంఘం రాష్ట్ర నాయకురాలు సుజాత మాట్లాడుతూ, ఎన్నికల సందర్భంగా అంగన్వాడీల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చాక నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. మూడు సంఘాల ఆధ్వర్యంలో పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని ఆమె హెచ్చరించారు.