Health Innovation: ఆక్సిజన్, పల్స్ రేట్ చెప్పే గ్లౌజ్..!
ABN , Publish Date - Jan 07 , 2026 | 02:50 AM
శరీరంలో ఆక్సిజన్ స్థాయి, పల్స్ రేట్‌ను గుర్తించేందుకు ప్రత్యేకమైన పరికరాలు కావాలి. అయితే.. వాటితో పనిలేకుండా ఆక్సిజన్, పల్స్ రేటుతోపాటు ఎన్ని క్యాలరీలు ఖర్చయ్యాయి అని ఎప్పటికప్పుడు ....
ఏయూ మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినుల ఆవిష్కరణ
విశాఖపట్నం, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): శరీరంలో ఆక్సిజన్ స్థాయి, పల్స్ రేట్‌ను గుర్తించేందుకు ప్రత్యేకమైన పరికరాలు కావాలి. అయితే.. వాటితో పనిలేకుండా ఆక్సిజన్, పల్స్ రేటుతోపాటు ఎన్ని క్యాలరీలు ఖర్చయ్యాయి అని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా ఆంధ్ర విశ్వవిద్యాలయం మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు కొత్త గ్లౌవ్స్‌ను డిజైన్ చేశారు. ఫైనల్ ఇయర్ ప్రాజెక్టులో భాగంగా ఆలర్టింగ్ సిస్టమ్‌తో కూడిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారిత గ్లౌవ్స్‌ను ఆవిష్కరించారు. ఈ గ్లౌవ్స్ ధరించిన వ్యక్తి ఆక్సిజన్ స్థాయి, పల్స్‌రేటును ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. మొబైల్ యాప్ ద్వారా నిరంతరం పర్యవేక్షించవచ్చు. వారి కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్‌ను దీనికి అనుసంధానం చేయవచ్చని విద్యార్థినులు పేర్కొన్నారు. ఈఈఈ ఫైనలియర్ చదువుతున్న కె. శివచంద్రిక, మోనాలిసా సేథి, ఎస్.తనూజ ఈ కొత్త గ్లౌవ్స్‌ను ఆవిష్కరించారు. సుమారు రూ.5 వేల ఖర్చుతో 45 రోజులపాటు శ్రమించి దీన్ని డిజైన్ చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె.అరవింద శిల్ప సహకారం అందించారు. వీరి ఆవిష్కరణను ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆర్.పద్మశ్రీ దృష్టికి తీసుకువెళ్లి పేటెంట్ కోసం దరఖాస్తు చేశారు. ఈ గ్లౌవ్స్‌ను ఈఎ్‌సపీ32 మైక్రో కంట్రోలర్ ఆధారంగా అభివృద్ధి చేశారు. వీటికి వేరబుల్ హెల్త్ గ్లోవ్స్ అని పేరుపెట్టారు. మాక్స్ 30102, ఎంపీయూ 6050తోపాటు మరికొన్ని సెన్సర్లను వినియోగించారు. ఆక్సిజన్ స్థాయి, హార్ట్ బీట్, పల్స్ రేటు, కేలరీల ఖర్చు, శరీర ఉష్ణోగ్రతతోపాటు ఒత్తిడిని గుర్తించేలా దీన్ని డిజైన్ చేశారు. ఈ సమాచారాన్ని ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్‌లో చూడవచ్చు.