Share News

ఏయూలో మళ్లీ రగడ

ABN , Publish Date - Feb 22 , 2026 | 04:25 AM

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘాల మధ్య మళ్లీ రగడ చోటు చేసుకుంది. ఎన్నడూ లేని విధంగా సంఘాలు పరస్పరం దాడులకు దిగుతున్నాయి.

ఏయూలో మళ్లీ రగడ

  • విద్యార్థి సంఘాల ఆందోళనలు

  • స్వయంగా రంగంలోకి దిగిన పోలీస్‌ కమిషనర్‌

  • స్టూడెంట్‌ లీడర్లతో అధికారుల సమావేశం

  • నాన్‌ బోర్డర్లు క్యాంప్‌సలో ఉంటే చర్యలంటూ హెచ్చరిక

  • మార్చి 2 వరకూ ధర్నాలు, నిరసనలపై ఆంక్షలు

విశాఖపట్నం, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘాల మధ్య మళ్లీ రగడ చోటు చేసుకుంది. ఎన్నడూ లేని విధంగా సంఘాలు పరస్పరం దాడులకు దిగుతున్నాయి. ఇది శాంతి భద్రతల సమస్యగా పరిణమించింది. ఏబీవీపీ విద్యార్థులు శనివారం వందల సంఖ్యలో క్యాంప్‌సలోకి ప్రవేశించి జెండాలు ఎగురవేసే స్తంభాలను విరిచేశారు. ఒకేసారి ఎక్కువ మంది రావడం, పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్వయంగా సిటీ పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి అక్కడకు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. కొందరిని వ్యాన్లలో ఎక్కించి బయటకు తరలించారు. క్యాంప్‌సకు సంబంధం లేనివారు ఈ ఆందోళనలో పాల్గొన్నట్టు తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఆధారాలు సమర్పించండి...

ఈ ఘర్షణలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలని జిల్లా అధికార యంత్రాంగం శాంతి కమిటీని ఏర్పాటు చేసింది. ఏయూ వీసీ ప్రొఫెసర్‌ జీసీ రాజశేఖర్‌ అధ్యక్షతన రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ కె.రాంబాబు, ఆర్‌డీఓ సుధాసాగర్‌, విశాఖ ఈస్ట్‌ ఏసీపీ లక్ష్మణమూర్తి కలిసి విద్యార్థి సంఘాల నాయకులతో శనివారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. రెండు గంటలసేపు సాగిన సమావేశంలో ఇరువర్గాల ఆరోపణలు, వాదనలు విన్నారు. వివాదానికి సంబంధించిన ఎవరి దగ్గర ఏయే ఆధారాలు ఉన్నాయో వీడియోలు, ఫొటోలు సోమవారం మధ్యాహ్నానికి సమర్పించాలని సూచించారు. వాటి ఆధారంగా మార్చి రెండో తేదీన మరోసారి సమావేశం నిర్వహించి, తుది నిర్ణయం వెల్లడిస్తామన్నారు. దీనికి అన్ని విద్యార్థి సంఘాలు కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు. అంతవరకు క్యాంప్‌సలో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించకూడదని ఆంక్షలు విధించారు. విద్యార్థులు కెరియర్‌పై దృష్టి సారించాలని, వివాదాల్లో తలదూర్చవద్దని సూచించారు. నాన్‌ బోర్డర్లకు క్యాంప్‌సలో స్థానం కల్పించవద్దని స్పష్టం చేశారు. అలా ఎవరైనా చేస్తే ఆ విద్యార్థులపైనా చర్యలు చేపడతామన్నారు.


గొడవకు కారణం ఇదీ....

ఏబీవీపీ విద్యార్థులు కొద్దిరోజుల క్రితం క్యాంప్‌సలోని బాస్కెట్‌బాల్‌ మైదానంలో ఆర్‌ఎ్‌సఎస్‌ శాఖ కార్యక్రమం నిర్వహించారు. ఈ విషయం తెలిసి ఎస్‌ఎ్‌ఫఐ, ఏఎ్‌సఎ్‌ఫఐ విద్యార్థి సంఘాల ప్రతినిధులు అక్కడకు వెళ్లి ఘర్షణ పడ్డారు. దాడి చేశారని ఏబీవీపీ ఆరోపిస్తోంది. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ స్పందించారు. ఈ నేపథ్యంలో గత నాలుగు రోజులుగా క్యాంప్‌సలో ఆందోళనలు, ధర్నాలు జరుగుతున్నాయి. పోలీసులు సర్దిచెప్పి పంపుతున్నారు. తాజాగా శనివారం ఉదయం పెద్ద సంఖ్యలో ఏబీవీపీ ప్రతినిధులు వచ్చారు. పరిస్థితి చేయి దాటిపోయేటట్టు ఉందని పోలీసు కమిషనర్‌ స్వయంగా రంగంలోకి దిగారు.

Updated Date - Feb 22 , 2026 | 04:27 AM