Share News

అంతర్జాతీయ స్థాయికి ఏయూ ఎదగాలి: సీపీ

ABN , Publish Date - Apr 28 , 2026 | 04:17 AM

విద్యార్థులు కేవలం డిగ్రీ పట్టాలు సాధిస్తే సరిపోదని, కాలానుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ పేర్కొన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల ముగింపు సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

అంతర్జాతీయ స్థాయికి ఏయూ ఎదగాలి: సీపీ

  • టాప్‌-3లో నిలుపుతాం: లోకేశ్‌

  • చంద్రబాబు నేతృత్వంలో...కేంద్రం మద్దతుతో

  • ఏపీ స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు...

  • శతాబ్ది వేడుకల్లో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌ వెల్లడి

విద్యార్థులు కేవలం డిగ్రీ పట్టాలు సాధిస్తే సరిపోదని, కాలానుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ పేర్కొన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల ముగింపు సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విశ్వవిద్యాలయం బోధనకే కాకుండా పరిశోధనకు కేంద్రంగా మారాలన్నారు. పేటెంట్లపై పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలని, ఫ్యూర్‌ సైన్సె్స్ పై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. వందేళ్లు చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయం అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో, కేంద్ర ప్రభుత్వ మద్దతుతో ఏపీ స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగుతోందన్నారు. 2025-26లో దేశంలోనే అత్యధిక పెట్టుబడులను ఆకర్షించిన రాష్ట్రంగా ఏపీ నిలిచిందని తెలిపారు. విశాఖ నగరం ఐటీ, డేటా సెంటర్లు, టూరిజం, గ్లోబల్‌ డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు ప్రధాన కేంద్రంగా మారుతోందన్నారు. అనంతరం గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌తో కలిసి ఏయూ పూర్వ విద్యార్థులు మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, ఒడిశా గవర్నర్‌ కంభంపాటి హరిబాబు, జీఎంఆర్‌ సంస్థ అధినేత గ్రంథి మల్లికార్జునరావు, ‘సైయంట్‌’ సంస్థ అధినేత బీవీఆర్‌ మోహన్‌ రెడ్డి, లారస్‌ ల్యాబ్స్‌ అధినేత చావా సత్యనారాయణ, ప్రొఫెసర్‌ ఎంఆర్‌ మాధవ్‌, దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌లకు ఎక్స్‌లెన్స్‌ అవార్డులతోపాటు శతాబ్ది వేడుకల జ్ఞాపికను అందించారు.


ఆస్పత్రి ఎలానో.. యూనివర్సిటీ అలా: త్రివిక్రమ్‌

ఏయూ శతాబ్ది వేడుకల ముగింపు కార్యక్రమంలో దర్శకుడు, వర్సిటీ మాజీ విద్యార్థి త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తనదైన శైలిలో ప్రసంగించారు. ‘మాటల మాంత్రికుడు’ అని మరోసారి నిరూపించుకున్నారు. విభిన్న ఆలోచనలను ఒకే చోటకు చేర్చే స్థలాన్ని యూనివర్సిటీ అంటారని విశ్లేషించారు. ఇంతటి విశాలమైన ప్రాంగణానికి, మొదట ఎవరొచ్చినా భయపడతారని.. ఎంత నడిచినా తగ్గని పొడవాటి రోడ్లు, పెద్ద భవనాలు, ఎత్తైన సీలింగులు, దూరంగా ఉండే క్లాస్‌ బోర్డులు, వినిపించీ వినిపించని ఫ్రొఫెసర్ల మాటలు... అన్నీ ముందు నెగెటివ్‌గాను, ఎంత వేగంగా ఇక్కడ నుంచి వెళ్లిపోదామా!! అని అనిపిస్తాయన్నారు. ‘ఆస్పత్రిలో వాసన సుగంధంలా ఉండదు. కానీ అదే మనల్ని బాగు చేస్తుంది, ఆరోగ్యవంతుడిని చేస్తుంది. ఆలాగే ఏయూ కూడా ముందు భయపెడుతుంది, అలవాటు చేసుకుంటే అదే మీ భవిష్యత్తును మారుస్తుంది’ అంటూ విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. తాను ఏయూకు వచ్చిన తర్వాత ఫిజిక్స్‌ చదువుకోవడం కంటే.. లైబ్రరీలో సాహిత్యం ఎక్కువగా చదివానని, కవిత్వాలే ఎక్కువగా రాశానని చెప్పారు. తనకు ఏయూ చాలా నేర్పిందని, దానితోనే జీవితంలో ఇప్పటిదాకా పోరాటం చేస్తూ వస్తున్నానని చెప్పారు.

Updated Date - Apr 28 , 2026 | 04:19 AM