Share News

జైమోగ్రామ్‌ పరీక్షతో గుండె భద్రం!

ABN , Publish Date - Apr 28 , 2026 | 05:30 AM

గత కొన్నేళ్లుగా గుండెజబ్బుల బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అప్పటివరకు ఆరోగ్యంగా ఉన్నవాళ్లు సైతం ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోతున్నారు.

జైమోగ్రామ్‌ పరీక్షతో గుండె భద్రం!

  • గుండె జబ్బు ముప్పును ముందే పసిగట్టే కిట్‌

  • ఆర్టీస్పై-నేటివ్‌జైమో పేరిట ఏయూ విద్యార్థుల రూపకల్పన

  • రూ.50 కంటే తక్కువ ఖర్చుతోనే జైమోగ్రామ్‌ పరీక్ష

  • రెండేళ్లపాటు పరిశోధన.. రెండు పేటెంట్లకు దరఖాస్తు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

గత కొన్నేళ్లుగా గుండెజబ్బుల బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అప్పటివరకు ఆరోగ్యంగా ఉన్నవాళ్లు సైతం ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్ర యూనివర్సిటీ పరిశోధకులు గుండె జబ్బుల ముప్పును ముందే గుర్తించే సరికొత్త పరికరాన్ని రూపొందించారు. ‘ఆర్టీస్పై-నేటివ్‌జైమో’ పేరిట అభివృద్ధి చేసిన ఈ పరికరంతో చేసే జైమోగ్రామ్‌ అనే రక్త పరీక్ష ద్వారా గుండెజబ్బు ముప్పును కొన్నేళ్ల ముందే గుర్తించే అవకాశం ఉంది. ఈ పరీక్ష ఖర్చు కూడా రూ.50 కంటే తక్కువే అవుతుంది. ఏయూ పరిశోధక విద్యార్థులు ఎస్‌.మణికంఠ, హేమసాయి పల్లా. ఏయూలోని టీకాబ్స్‌ ఈ-ల్యాబ్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ రవికిరణ్‌ యేడిది నేతృత్వంలో సాగిన ఈ పరిశోధనల్లో ఫలితాలు సానుకూలంగా వచ్చాయి. దీంతో వారు రెండు పేటెంట్ల కోసం దరఖాస్తు చేశారు.


ప్రజలకు ఉపయోగపడాలనే..

రాజమండ్రి గైట్‌ కాలేజీలో ఎం.ఫార్మసీ చేస్తున్న ఎస్‌.మణికంఠ, ఏయూలో ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ చేస్తున్న హేమసాయిలకు ప్రజలకు ఉపయోగపడేలా వినూత్న పరిశోధనలు చేయాలన్న ఆలోచన ఉండేది. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు వర్సిటీలోని టీకాబ్స్‌ ఈ-ల్యాబ్‌కు వచ్చి డాక్టర్‌ రవికిరణ్‌తో తమ అభిప్రాయాలు పంచుకునేవారు. వీరి మధ్య చర్చల సమయంలో గుండె జబ్బుల ముప్పును ముందుగానే గుర్తించే పరికరాన్ని డిజైన్‌ చేస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది. 2023లో ఆ దిశగా పరిశోధన ప్రారంభించారు. కేజీహెచ్‌లోని కార్డియాలజీ విభాగానికి వెళ్లి పలువురు రోగుల నమూనాలు సేకరించి విశ్లేషించారు. గుండెకు సంబంధించి కరోనరీ ఆర్టరీ (రక్తనాళాల సంకోచ వ్యాధి)లో బ్లడ్‌ సర్క్యులేషన్‌ ఆగిపోవడం వల్ల ఎక్కువమంది గుండె జబ్బుల బారినపడుతుంటారు. అయితే, ఈ పరిస్థితిని కొన్నేళ్లు ముందుగానే గుర్తించేందుకు విద్యార్థులు డిజైన్‌ చేసిన పరికరం ఉపయోగపడుతుంది. రక్త నమూనాలను సేకరించి ప్రోటీన్స్‌ ఎక్స్‌ట్రాక్ట్‌ చేస్తారు. ఈ పరీక్షను జైమోగ్రామ్‌ అని అంటారు. ఈ పరీక్ష ద్వారా ప్రోటీన్స్‌లో ఉన్న తేడాను గుర్తించి వారికి భవిష్యత్తులో గుండెజబ్బు వచ్చే అవకాశాన్ని గుర్తిస్తారు. ముందే స్పష్టత రావడం వల్ల ఆహారపు అలవాట్లు మార్చుకోవడం, వ్యాయామం చేయడం, ఇతర జాగ్రత్తల ద్వారా గుండెపోటు, ఇతర ముప్పుల నుంచి తప్పించుకునేందుకు వీలుంటుంది.

Updated Date - Apr 28 , 2026 | 05:30 AM