Share News

వర్సిటీలకు దిక్సూచి

ABN , Publish Date - Apr 28 , 2026 | 04:12 AM

విశ్వవిద్యాలయాలు సమాజాన్ని ప్రభావితం చేసే ఆవిష్కరణలకు వేదికలు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు ఆంధ్ర యూనివర్సిటీ (ఏయూ) దిక్సూచి అని కొనియాడారు.

వర్సిటీలకు దిక్సూచి

  • రాబోయే వందేళ్లలో బెస్ట్‌ బ్రాండ్‌గా ఏయూ: సీఎం

  • గూగుల్‌ డేటా కంటే ముందు ప్రపంచాన్ని విశాఖతో కనెక్ట్‌ చేసింది ఆంధ్ర వర్సిటీయే

  • ఆవిష్కరణలకు విశ్వవిద్యాలయాలే వేదికలు

  • విశాఖ విశ్వనగరం.. అన్‌స్టాపబుల్‌ సిటీ..

  • దేశంలో టాప్‌-5లో, ప్రపంచంలో టాప్‌-100లో ఏయూ

  • దీనికోసం రూ. 500 కోట్లు ప్రభుత్వం ఇస్తుంది

  • పూర్వ విద్యార్థులు మరో 500 కోట్లు సమీకరించాలి

  • ఏయూ శతాబ్ది వేడుకల్లో చంద్రబాబు పిలుపు

‘‘విద్యార్థులకు చదువు చెప్పడానికే ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిమితం కాలేదు. తెలుగు వైభవానికి ఏయూ వన్నె తెచ్చింది. విద్య, సాహిత్య రంగాల్లో ప్రముఖులను ప్రోత్సహిస్తోంది. ఎంతోమంది రాజకీయ నాయకులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఇక్కడి నుంచే వచ్చారు. ప్రపంచంలోని అనేక వర్సిటీలకు ప్రొఫెసర్లుగా ఇక్కడి పూర్వ విద్యార్థులు సేవలు అందిస్తున్నారు. దేశంలోని పలు యూనివర్సిటీల్లో ఇక్కడివారు 50 మంది ప్రొఫెసర్లుగా పని చేయడం గొప్ప విషయం. రానున్న వందేళ్లలో ఏయూ మరో చరిత్ర సృష్టిస్తుంది. బెస్ట్‌ బ్రాండ్‌ క్రియేట్‌ చేస్తుంది.’

- సీఎం చంద్రబాబు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): విశ్వవిద్యాలయాలు సమాజాన్ని ప్రభావితం చేసే ఆవిష్కరణలకు వేదికలు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు ఆంధ్ర యూనివర్సిటీ (ఏయూ) దిక్సూచి అని కొనియాడారు. విశాఖలోని ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో సోమవారం సాయంత్రం జరిగిన ఏయూ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులు ఉద్యోగాలు చేయడానికి పరిమితం కావొద్దని, పది మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని సీఎం సూచించారు. సరికొత్త ఆవిష్కరణలు, ఆలోచనలతో సంపద సృష్టించే దిశగా విద్యార్థులు ముందుకు సాగాలన్నారు. విద్యార్థుల వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలకు అండగా ఉండేలా విశాఖలో రతన్‌టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. గూగుల్‌ డేటా సెంటర్‌ కంటే ముందుగానే ఏయూ ప్రపంచాన్ని విశాఖతో కనెక్ట్‌ చేసిందన్నారు. ఏయూలో 57 దేశాలకు చెందిన విద్యార్థులు చదువుతుండటం రాష్ట్రానికీ, దేశానికీ గర్వకారణమన్నారు. ‘‘ఆంధ్ర వర్సిటీ వందేళ్ల చరిత్ర ఒక బ్రాండ్‌. రాష్ట్ర విభజన తరువాత ఇక్కడే తొలి క్యాబినెట్‌ సమావేశాన్ని నిర్వహించాం. ఏయూ తొలి వీసీ కట్టమంచి రామలింగారెడ్డి చిత్తూరు వాసి. అదే జిల్లా నుంచి వచ్చిన నేను వందేళ్ల ఉత్సవంలో పాల్గొనడం గర్వంగా ఉంది.’’ అని వ్యాఖ్యానించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..


వీసీకి టాస్క్‌ ఇస్తున్నా..

‘‘వీసీకి లక్ష్యాన్ని నిర్దేశిస్తున్నా. రానున్న రోజుల్లో దేశంలోని టాప్‌-5 వర్సిటీల్లో, ప్రపంచంలోని టాప్‌-100 విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా ఏయూను నిలపండి. ఈ లక్ష్యాలను సాధించేందుకే రూ.500 కోట్లు నిధులు అందిస్తున్నాం. అదే సమయంలో వర్సిటీకి చెందిన పూర్వ విద్యార్థులు జీఎంఆర్‌, మోహన్‌రెడ్డి, లారస్‌ సత్యనారాయణ, ఇతర పూర్వ విద్యార్థులు, విద్యార్థులు రూపాయి చొప్పున ఇచ్చినా మరో రూ.500 కోట్లు కార్పస్‌ ఫండ్‌ వస్తుంది. ఆ దిశగా కృషి చేయాలి. వర్సిటీలో బంగారం లాంటి విద్యార్థులు, మంచి ప్రొఫెసర్లు ఉన్నారు. ప్రపంచంలోని నాలెడ్జ్‌ను ఇక్కడకు తీసుకువస్తాం.’’

విశాఖను ఎవరూ అడ్డుకోలేరు..

‘‘విశాఖ విశ్వనగరం. అన్‌స్టాపబుల్‌ సిటీ. 76 ఏళ్ల వయసైనా 26 ఏళ్ల యువకుడిలా అలోచిస్తా. హైటెక్‌ సిటీ కట్టి నాలెడ్జ్‌ ఎకానమీకి దోహదం చేశాను. ప్రస్తుతం గూగుల్‌ డేటా సెంటర్‌, క్వాంటం టెక్నాలజీ, ఏఐ వంటివి తీసుకువచ్చి రాష్ట్రాన్ని టెక్నాలజీ వైపు పరుగులు పెట్టిస్తున్నాను. రోజులు మారాయి. సాధారణ వ్యక్తులు అసాధారణ శక్తులుగా మారే అవకాశం ఉంది. నాలెడ్జ్‌, ఇన్నొవేషన్‌, స్టార్ట్‌పలపై యువత దృష్టి సారించాలి. పారిశ్రామిక రంగంతో యూనివర్సిటీలు అనుసంధానం కావాలి. ఏయూకు ఒక బ్రాండ్‌ ఉంది. వర్సిటీ అడిగితే ఒప్పందాలు చేసుకోవడానికి ప్రపంచంలోని అనేక సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం 57 దేశాలకు చెందిన విద్యార్థులు వర్సిటీలో చదువుతున్నారు. రానున్న రోజుల్లో వంద దేశాలకు చెందిన విద్యార్థులు ఏయూలో చదివేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఎంతమంది ఎంటర్‌ప్రెన్యూర్లను ఏయూ తయారుచేస్తుందన్నది మీపైనే ఉంది. ఈ యూనివర్సిటీ భావితరాల నాయకులను తయారు చేయాలి.’’


ఏయూ నుంచే జైత్రయాత్ర..

‘‘మిత్రుడు పవన్‌ కల్యాణ్‌తో కలిసి రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నాను. తెలుగు జాతి పునర్వైభవానికి ప్రధాని మోదీ సహకారాన్ని అందిస్తున్నారు. వికసిత్‌ భారత్‌, స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో పనిచేసి తెలుగు జాతిని నంబర్‌వన్‌గా ఉంచాలన్నదే నా సంకల్పం. ఈ సంకల్ప జైత్రయాత్ర ఏయూ నుంచే ప్రారంభం కావాలి. ఈ దిశగా పనిచేసే బాధ్యత, సహకరించే బాధ్యత నాది. నిరూపించే బాధ్యత మీది. వర్సిటీ అభివృద్ధికి ఎంతో మంది రాజులు, దాతలు సహకారాన్ని అందించారు. వారందరినీ స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఏయూ రెండో వీసీ సర్వేపల్లి రాధాకృష్ణన్‌. అనంతర కాలంలో ఆయన దేశానికి రాష్ట్రపతి అయ్యారు. ఆయనపై అభిమానంతో ఉపరాష్ట్రపతికి ఆయన తండ్రి అదే పేరును పెట్టడం గొప్ప విషయం. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు శక్తి, సామర్థ్యాలను పెంపొందించుకోవాలి.’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

ఆత్మ విశ్వాసమే ఆయుధం: సచిన్‌

ఆత్మ విశ్వాసమే ఆయుధమని మాజీ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ పేర్కొన్నారు. యువతరం లక్ష్యం చేరుకోవాలంటే నిరంతరం శ్రమించడం ఒక్కటే మార్గమని, దానికి అడ్డదారులేమీ ఉండవని అభిప్రాయపడ్డారు. చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా యువత లక్ష్యం వైపే పయనించాలని సూచించారు. నచ్చిన పని కోసం ఎంత కష్టపడినా ఒత్తిడి అనేది తెలియదన్నారు. తాను క్రికెట్‌ను నెట్‌లో ఎక్కువగా ప్రాక్టీస్‌ చేయడం ద్వారానే ఒత్తిడిని అధిగమించే వాడనని తెలిపారు. తన తండ్రి రమేశ్‌ టెండూల్కర్‌ ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చి ప్రొఫెసర్‌ అయ్యారని, తమ కుటుంబమంతా రెండు గదుల ఇంట్లో ఉండే వారిమని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

ఉద్యోగ సాధనే యువత లక్ష్యం: వెంకయ్య

విద్యార్థులు ఉద్యోగాలను సాధించే నైపుణ్యాలను పెంపొందించుకోవాలని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. తాను ఉన్నత స్థానానికి చేరుకోవడానికి ప్రాథమిక పునాది ఏయూనే వేసిందన్నారు. దాతల సహకారం వల్లే ఈ విద్యా సంస్థ ఎదిగిందని తెలిపారు. విద్యార్థులు పరిశోధనాపరమైన దృక్పథంతో ముందుకుసాగాలని, ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను అందించాలన్నారు.

Updated Date - Apr 28 , 2026 | 04:19 AM