ఆంధ్ర విశ్వవిద్యాలయం దేశానికి గర్వకారణం
ABN , Publish Date - Mar 26 , 2026 | 03:40 AM
శతాబ్ద కాలంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్య, పరిశోధన, ఆవిష్కరణ రంగాల్లో సాధించిన ప్రగతి దేశానికి గర్వకారణమని రాష్ట్ర గవర్నర్, చాన్సలర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు.
వందేళ్ల వైభవానికి, నిరుపమాన ప్రగతికి నిదర్శనం
స్నాతకోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నజీర్
విశాఖపట్నం, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): శతాబ్ద కాలంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్య, పరిశోధన, ఆవిష్కరణ రంగాల్లో సాధించిన ప్రగతి దేశానికి గర్వకారణమని రాష్ట్ర గవర్నర్, చాన్సలర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం 91, 92వ స్నాతకోత్సవాలను బుధవారం ఉదయం ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చాన్సలర్ హోదాలో హాజరైన అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ ఒక విద్యా సంస్థగా ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయం నేడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన జ్ఞానపీఠంగా అవతరించడం విశేషమన్నారు. వందేళ్ల వైభవానికి, నిరుపమాన ప్రగతికి ఏయూ నిదర్శనమన్నారు. వందేళ్లలో ఏయూ లక్షలాది మందికి విద్యను అందించిందని తెలిపారు.
డాక్టరేట్లు ప్రదానం
స్నాతకోత్సవంలో భాగంగా ఏయూ పూర్వ విద్యార్థి, బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ చైర్మన్ డాక్టర్ పూర్ణచంద్రరావు సగ్గుర్తికి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత తల్లావజ్ఝల పతంజలిశాస్ర్తికి గవర్నర్ డాక్టరేట్‌లను ప్రదానం చేశారు. వీరితోపాటు జియో, సివిల్ ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన ప్రొఫెసర్ పి.జగదీశ్వరరావు, ప్రొఫెసర్ సీఎన్‌వీ సత్యనారాయణరెడ్డికి బెస్ట్ రీసెర్చ్ అవార్డులతోపాటు పలువురికి రీసెర్చ్ మెడల్స్, ఎంఫిల్ పట్టాలు, పీహెచ్‌డీ డిగ్రీలు, యూజీ, పీజీ మెడల్స్‌ను ప్రదానం చేశారు.